Sri Devi: అతిలోక సుందరి జయంతి నేడు.. బాలనటిగా ఎంట్రీ.. హీరోయిన్ గా చిత్రపరిశ్రమకు ఏలిన శ్రీదేవి జీవితంలో ముఖ్య ఘట్టాలు..

శ్రీదేవి తన సినీ జీవితంలో 200కు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారు. శ్రీదేవి నవ్విందంటే చాలు అభిమానులను పిచ్చెక్కిపోయేవారు. అంతేకాదు ఆమె రొమాంటిక్ స్టైల్ కూడా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.

Sri Devi: అతిలోక సుందరి జయంతి నేడు.. బాలనటిగా ఎంట్రీ..  హీరోయిన్ గా చిత్రపరిశ్రమకు ఏలిన శ్రీదేవి జీవితంలో ముఖ్య ఘట్టాలు..
Untitled 1
Follow us
Surya Kala

|

Updated on: Aug 13, 2022 | 8:13 AM

భారతీయ సినీ నటి అతిలోక సుందరి శ్రీదేవి జయంతి నేడు.. బాలనటిగా వెండి తెరపై అడుగు పెట్టి.. స్టార్ హీరోయిన్ గా దశాబ్దకాలం పాటు.. చిత్ర పరిశ్రమను ఏలింది శ్రీదేవి. తమిళ, తెలుగు, మలయాళం సహా హిందీ భాషల్లో వందల సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అందం, అభినయంతో ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసిని.. దక్షిణలోనే కాదు.. బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకున్న శ్రీదేవి  58వ జయంతి నేడు. ఈ అందాల నటి దివి నుంచి భువికేగి ఉండవచ్చు.. అభిమానుల మధ్య నేడు లేకపోవచ్చు.. కానీ వారు ఎప్పుడూ శ్రీదేవిని గుర్తు చేసుకుంటూనే ఉంటారు. దక్షిణాది నుంచి హిందీ చిత్రపరిశ్రమలో అడుగు పెట్టి.. స్టార్ హీరోయిన్ గా దశాబ్దాలు ఏలిన శ్రీ దేవి 1963 ఆగస్టు 13న తమిళనాడులో జన్మించారు. శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలు పెట్టి.. తమిళ, తెలుగు చిత్రాలతో పాటు హిందీ చిత్రాల్లో కూడా నటించారు. తన నటనతో శ్రీదేవి తనకంటూ ఓ  ముద్ర వేసుకుంది.  శ్రీదేవి పుట్టినరోజు సందర్భంగా ఆమె జీవితంలోని కొన్ని ముఖ్యవిషయాలను గురించి తెలుసుకుందాం..

శ్రీదేవి సినీ పరిశ్రమలో ఎంట్రీ:  శ్రీదేవి అసలు పేరు శ్రీ అమ్మ అయ్యప్పన్ యంగర్.  సినిమాల్లో నటించడం కోసం పేరు మార్చుకుంది. శ్రీదేవి నాలుగేళ్ల వయసులో నటించడం  ప్రారంభించింది. శ్రీదేవి తమిళ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా తన సినీ జీవితాన్ని ప్రారంభించింది. తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాలలో పనిచేశారు. బాలీవుడ్ చిత్రం జూలీతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా హిందీ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది. పదహారేళ్ళ వయసు సినిమాతో హీరోయిన్ గా మారింది. తన కెరీర్‌లో చాలా మంది స్టార్ హీరోలతో పనిచేసింది. రజనీకాంత్, ఎన్టీఆర్, ఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, వంటి దక్షిణాది స్టార్ లతో పాటు.. బాలీవుడ్ లో అమితాబ్, అనిల్ కపూర్, జితేంద్ర, మిథున్ చక్రవర్తి, రుషికపూర్, ధర్మేంద్ర వంటి హీరోలకు జోడీ నటించి బాక్సాఫీస్ వద్ద సంచనల విజయాలను సొంతం చేసుకుంది. శ్రీదేవిని అతిలోక సుందరి, చాందిని అని ముద్దుగా అభిమానులు పిలుచుకుంటారు.

శ్రీదేవి కెరీర్: శ్రీదేవి తన సినీ జీవితంలో 200కు పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారు. శ్రీదేవి నవ్విందంటే చాలు అభిమానులను పిచ్చెక్కిపోయేవారు. అంతేకాదు ఆమె రొమాంటిక్ స్టైల్ కూడా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. 1975-90 సమయంలో శీదేవి అగ్ర కథానాయిక. దాదాపు తాను నటించిన అన్ని భాషల్లోనూ స్టార్ హీరోలతో కలసి నటించింది.  ఎన్టీఆర్ తో కొండవీటి సింహం, వేటగాడు, సర్దార్ పాపారాయుడు, బొబ్బిలిపులి మొదలగు చిత్రాలలో  ఏఎన్నార్ తో ముద్దుల కొడుకు, ప్రేమాభిషేకం, బంగారు కానుక, ప్రేమకానుక మొదలగు చిత్రాలలో నటించారు. సూపర్ స్టార్ కృష్ణతో కంచుకాగడా, కలవారి సంసారం, కృష్ణావతారం, బుర్రిపాలెం బుల్లోడు మొదలగు చిత్రాలలో నటించారు. కమల్ హాసన్ తరువాత, శ్రీదేవి కృష్ణతో ఎక్కువ చిత్రాలలో నటించారు. ఆమె తెలుగులో చిత్రాలు చేస్తూనే, హిందీ సినీ రంగంలో అడుగుపెట్టారు. అక్కడ కూడా   సద్మా, నగీనా, మిస్టర్ ఇండియా, చాందినీ, చాల్‌బాజ్, లమ్హే, జుదాయి, ఇంగ్లీష్-వింగ్లీష్, మామ్, నిగహైన్, ఫరిష్తే, లాడ్లా, రూప్ కీ రాణి చోరోన్ కా రాజా వంటి అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించారు.

ఇవి కూడా చదవండి

శ్రీదేవి పెళ్లి: శ్రీదేవి తన వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచుకోవడానికి ఇష్టపడుతుంది. తన పర్సనల్ లైఫ్ గురించి ఎప్పుడూ ఎక్కువగా ప్రస్తావించేవారు కాదు.  శ్రీదేవి బోనీ కపూర్‌ను వివాహం చేసుకుంది . ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు జాన్వీ కపూర్ ,  ఖుషీ కపూర్ ఉన్నారు.

కెరీర్ ప్రారంభంలో శ్రీదేవి తన చిత్రాలకు తాను స్వయంగా డబ్బింగ్ చెప్పుకోలేదు.. అయితే, మెల్లమెల్లగా తన వాయిస్ ని ఇవ్వడం మొదలు పెట్టారు.  శ్రీదేవి పలు సినిమాల్లో ద్విపాత్రాభినయం చేసింది.

సినిమా నుండి దూరం: తన అత్యుత్తమ నటనతో సినీ పరిశ్రమను శాసించిన శ్రీదేవి, బోనీ కపూర్‌ని పెళ్లాడిన తర్వాత నటనకు దూరమైంది. “జుదాయి” (1997) తరువాత ఆమె వెండితెరకు తాత్కాలికంగా గుడ్ బై చెప్పారు. దీని గురించి శ్రీదేవిని ప్రశ్నించగా, ఆమె తన కుమార్తెలు జాన్వీ కపూర్ , ఖుషీ కపూర్‌లను పెంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. తిరిగి  2011లో గౌరీ షిండే దర్శకత్వం వహించిన ఇంగ్లీష్ వింగ్లీష్‌తో 15 సంవత్సరాల తర్వాత సినిమా ప్రపంచంలోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. మామ్ సినిమాలో తన నటనతో శ్రీదేవి గ్లామర్ తోనే కాదు..నటనతో కూడా అభిమానులను అలరిస్తాది అని నిరూపించారు.

మరణం: 2018 ఫిబ్రవరి 24 న దుబాయ్ లో తాను బసచేసిన హోటల్ లో ప్రమాదవశాత్తూ శ్రీదేవి మరణించింది.  శ్రీదేవి మరణ వార్త చిత్ర పరిశ్రమని,  అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అశేషమైన జనవాహిని నడుమ ఫిబ్రవరి 28న ముంబైలో అంతిమ యాత్ర చిరస్మరణీయంగా నిర్వహించారు. దివి నుంచి భువికేగిన అతిలోక సుందరి జయంతి సందర్భంగా అభిమానులు ఆమెను గుర్తు చేసుకుంటున్నారు.

మరిన్నిఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.