SSMB28: ట్రెండింగ్‌లో మరో కొత్త టైటిట్.. ఇది మాములు నాటు కాదు
అవునూ మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమా టైటిల్ ఏంటి..? మొన్నేదో విన్నానే.. అయోధ్యలో అర్జునుడో ఏదో అన్నారు..? ఎక్కడున్నారండీ మీరూ.. ఇంకెక్కడి అర్జునుడు.. దాని తర్వాత ఇంకో అరడజన్ టైటిల్స్ వచ్చాయి..! అవునా.. అవేంటబ్బా అనుకుంటున్నారు కదా..! ఈ మధ్య మరే భారీ సినిమాకి ఇన్నేసి టైటిల్స్ ప్రచారంలోకి రాలేదు. మరి ఆ టైటిల్ కథేంటో ఓ సారి చూసొద్దాం పదండి..!

అభిమాన హీరో సినిమా అంటే ముందుగా ఫ్యాన్స్ కోరుకునేది టైటిల్ గురించే. ఎందుకంటే వాళ్లకు కథ ఎలా ఉంటుందో తెలియదు.. సినిమా ఎలా వస్తుందో ఐడియా ఉండదు.. అందుకే టైటిల్ చూసి దాంతోనే లెక్కలేసుకుంటారు కథ ఇలా ఉంటుంది అలా ఉంటుందని..! ఇప్పుడు మహేష్ బాబు, త్రివిక్రమ్ సినిమా విషయంలోనూ ఇదే జరుగుతుంది. SSMB28కి రోజుకో టైటిల్ పుట్టిస్తున్నారు ఫ్యాన్స్.
మహేష్ బాబు, త్రివిక్రమ్ షూటింగ్ కొన్నాళ్లుగా జరగట్లేదు. చిన్న బ్రేక్ దొరకడంతో సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు సూపర్ స్టార్. జూన్ మొదటివారంలో న్యూ షెడ్యూల్ మొదలుపెట్టి.. మూడు నెలలు ఏకధాటిగా షూట్ చేయాలని చూస్తున్నారు త్రివిక్రమ్. ఇదిలా ఉంటే ప్రాజెక్ట్ మొదలైన రోజు నుంచే టైటిల్స్‌పై గాసిప్స్ మొదలయ్యాయి. అప్పట్లో అయోధ్యలో అర్జునుడు పేరు బలంగా వినిపించింది.
SSMB 28 షూటింగ్ జరిగినా జరక్కపోయినా.. సినిమా మాత్రం ట్రెండింగ్‌లోనే ఉంది. అయోధ్యలో అర్జునుడు తర్వాత అమ్మకథ అన్నారు.. అబ్బే అది కాదు అమరావతికి అటూ ఇటూ అన్నారు. త్రివిక్రమ్‌కు అ అక్షరం సెంటిమెంట్ కదా నిజమే అనుకున్నారంతా. కానీ రెండు మూడు రోజులుగా గుంటూరు కారం, ఊరికి మొనగాడు, పల్నాటి పోటుగాడు టైటిల్స్ ట్రెండ్ అవుతున్నాయి. ఈ గాసిప్స్ అన్నింటికీ మే 31న తెరపడేలా కనిపిస్తుంది. కృష్ణ జయంతి సందర్భంగా ఆ రోజే టీజర్ విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. అప్పుడే ఒరిజినల్ టైటిల్ ఏంటో తేలనుంది. అప్పటి వరకు ఈ గాసిప్స్‌కు అడ్డే లేదు.
మరిన్ని సినిమా వార్తల కోసం..