Naga Chaitanya @ 15 Years: నాగ చైతన్య @ 15 ఇయర్స్ ఇండస్ట్రీ..

2009లో ‘జోష్‌’ సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా అడుగు పెట్టాడు నాగ చైతన్య. నాగార్జున, సుమంత్ తర్వాత అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన వారసుడు కావడంతో చైతూపై ఎన్నో అంచనాలున్నాయి. దిల్ రాజు లాంటి సక్సెస్ ఫుల్ నిర్మాత చేతుల్లో తన కొడుకు లాంఛింగ్ పెట్టాడు నాగార్జున. అయితే జోష్ అనుకున్నంతగా ఆడలేదు.

Naga Chaitanya @ 15 Years: నాగ చైతన్య @ 15 ఇయర్స్ ఇండస్ట్రీ..
Naga Chaitanya
Follow us
Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Rajitha Chanti

Updated on: Sep 05, 2024 | 7:37 PM

ఈ రోజుల్లో వారసుడు అయినా.. ఎంత బ్యాగ్రౌండ్ ఉన్నా 15 ఏళ్ళు ఇండస్ట్రీలో హీరోగా నిలబడటం.. నెగ్గుకురావడం అంటే మాటలు కాదు. అది చేసి చూపించాడు అక్కినేని వారసుడు నాగ చైతన్య. ఈయన కెరీర్ మొదలు పెట్టి 15 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువ నడుస్తుంది. 2009లో ‘జోష్‌’ సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా అడుగు పెట్టాడు నాగ చైతన్య. నాగార్జున, సుమంత్ తర్వాత అక్కినేని కుటుంబం నుంచి వచ్చిన వారసుడు కావడంతో చైతూపై ఎన్నో అంచనాలున్నాయి. దిల్ రాజు లాంటి సక్సెస్ ఫుల్ నిర్మాత చేతుల్లో తన కొడుకు లాంఛింగ్ పెట్టాడు నాగార్జున. అయితే జోష్ అనుకున్నంతగా ఆడలేదు. వాసు వర్మ తెరకెక్కించిన ఈ చిత్రంతో నాగ చైతన్య నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కానీ కోరుకున్న కమర్షియల్ మార్కెట్ మాత్రం తెచ్చుకోలేకపోయాడు. రెండో సినిమా ఏ మాయ చేసావేతో క్లాస్ హీరోగా గుర్తింపుతో పాటు మార్కెట్ కూడా సంపాదించుకున్నాడు నాగ చైతన్య.

ఆ తర్వాత కొన్నాళ్లు క్లాస్ సినిమాలు మాత్రమే చేసాడు. మధ్య మధ్యలో మాస్ ఇమేజ్ కోసం దడ లాంటి సినిమాలు చేసి దెబ్బతిన్నాడు చైతూ. అందుకే 100 పర్సెంట్ లవ్‌ లాంటి సినిమాలు చేసి మార్కెట్ పెంచుకున్నాడు. ఒక్కోమెట్టు ఎక్కుతూ తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు చైతూ. తడాఖా లాంటి సినిమాలు ఈయన్ని మాస్‌గానూ నిలబెట్టాయి. ముఖ్యంగా కథల ఎంపిక విషయంలో నాగ చైతన్య తీరు మరోలా ఉంటుంది. కెరీర్ మొదట్లోనే చాలా ప్రయోగాలు చేసాడు ఈ హీరో. మజిలీ, లవ్ స్టోరీ లాంటి సినిమాల్లో కథలు చాలా అద్భుతంగా ఉంటాయి. తన వయసుకు మించిన పాత్రల్ని కూడా అద్భుతంగా నటించి చూపించాడు నాగ చైతన్య. తెలుగు ఇండస్ట్రీ నుంచి ఫస్ట్ టైమ్ ఓ స్టార్ హీరో ఓటిటిలో నటించడం కూడా నాగ చైతన్య నుంచే మొదలైంది. ‘దూత’ వెబ్ సిరీస్‌తో డిజిటల్ ప్లాట్ ఫామ్‌పై కూడా అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు నాగ చైతన్య. ఇప్పుడు దూత సీజన్ 2 కూడా మొదలైంది. త్వరలోనే షూటింగ్ మొదలు కానుంది.

ప్రస్తుతం చందూ మొండేటితో ‘తండేల్’ సినిమా చేస్తున్నాడు. ఇది నాగ చైతన్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బడ్జెట్‌తో వస్తుంది. దాదాపు 80 కోట్లకు పైగానే తండేల్ కోసం ఖర్చు పెడుతుంది గీతా ఆర్ట్స్ 2 సంస్థ. అక్కినేని వారసత్వాన్ని మోయడం అంటే చిన్న విషయం కాదు.. కానీ నాగ చైతన్య మాత్రం దీన్ని విజయవంతంగా మోస్తున్నాడు. మధ్యలో అప్పుడప్పుడూ చిన్న చిన్న అడ్డంకులు వచ్చినా కూడా ఎప్పుడూ రేసు నుంచి తప్పుకోలేదు చైతూ. నటుడిగానే కాకుండా.. రేసింగ్‌లోనూ తన సత్తా చూపిస్తున్నాడు నాగ చైతన్య. హైదరాబాద్ రేసింగ్ ఫెస్టివ‌ల్‌లో హైద‌రాబాద్ బ్లాక్ బ‌ర్డ్స్ టీమ్‌ను సొంతం చేసుకున్నాడు. దాంతో పాటు రెస్టారెంట్ బిజినెస్‌లోనూ రప్ఫాడిస్తున్నాడు నాగ చైతన్య. ఈ 15 ఏళ్ళ కెరీర్‌లో ఏ మాయ చేసావే, 100 పర్సెంట్ లవ్, తడాఖా, మజిలి, లవ్ స్టోరీ, వెంకీ మామ లాంటి సినిమాలున్నాయి. ఇకపై ఇంకా మంచి మంచి కథలతో వస్తానంటున్నాడు అక్కినేని వారసుడు. ఈయన కెరీర్ ఇలాగే ముందుకెళ్లాలని అక్కినేని అభిమానులు కోరుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.