Jr NTR: తాత చనిపోయే ముందు చివరిగా నాతో ఏం మాట్లాడారంటే..?
జూనియర్ ఎన్టీఆర్ తన తాత సీనియర్ ఎన్టీఆర్‌ను తొలిసారి కలిసిన సందర్భం, ఆ తర్వాత వారి మధ్య ఏర్పడిన బలమైన బంధాన్ని వివరించారు. ఎన్టీఆర్ తన పేరును నందమూరి తారక రామారావుగా మార్చడం, బ్రహ్మర్షి విశ్వామిత్ర చిత్రంలో నటించే అవకాశం కల్పించడం వంటి విశేషాలను పంచుకున్నారు. తన తల్లికి ఎన్టీఆర్ చెప్పిన చివరి మాటలు తన జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాయో కూడా వెల్లడించారు.

గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. జూనియర్ ఎన్టీఆర్ తన తాత, దివంగత నటసార్వభౌముడు నందమూరి తారక రామారావును తొలిసారి కలిసిన సందర్భం, ఆ తర్వాత వారి మధ్య ఏర్పడిన సన్నిహిత అనుబంధం, ఎన్టీఆర్ చివరి మాటలు తన జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాయో వివరించారు. జూనియర్ ఎన్టీఆర్ తాను చిన్నతనంలో సీనియర్ ఎన్టీఆర్‌ను కలవడానికి వెళ్లినప్పుడు ఆ వాతావరణం ఆధ్యాత్మికతతో నిండి ఉందని తెలిపారు. ఒక గదిలోకి తొంగి చూడగా, కాషాయ వస్త్రాల్లో ఆ మహానుభావుడు కింద కూర్చుని కనిపించారని, “రండి” అని పిలవగానే పూనకం వచ్చినట్లుగా వెళ్లి ఆయన ముందు కూర్చున్నానని జూనియర్ ఎన్టీఆర్ చెప్పారు. అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ “వాట్ ఈజ్ యువర్ నేమ్?” అని అడగగా, తాను “మై నేమ్ ఈజ్ తారక్ రామ్” అని బదులిచ్చానని పేర్కొన్నారు. తన నాయనమ్మ బసవరామతారకం పేరుతో కలిసి వస్తుందని తారక్ రామ్ అని పెట్టారని వివరించారు. అప్పుడు సీనియర్ ఎన్టీఆర్ హరికృష్ణను పిలిచి, “అబ్బాయి పేరు నందమూరి తారక రామారావు కింద మార్చండి” అని సూచించారని గుర్తుచేసుకున్నారు. ఆ పేరు మార్పుతోనే తన జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలైందని ఆయన అన్నారు. ఆ రోజు నుంచి సీనియర్ ఎన్టీఆర్ తనను వదల్లేదని, దాదాపు ఒక సంవత్సరం పాటు ఆయనతోనే గడిపానని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు. ఉదయాన్నే నాలుగు గంటలకు సీనియర్ ఎన్టీఆర్ వద్దకు వెళ్లి, ఆయనతో బ్రేక్‌ఫాస్ట్, లంచ్ చేస్తూ, ఎప్పుడు ఇంటికి తిరిగి వస్తానో తెలిసేది కాదని చెప్పారు. సీనియర్ ఎన్టీఆర్ తనను ఒక బంగారంలా, అమూల్యమైన రత్నంలా చూసుకున్నారని.. ఆ సమయంలో ఆయనతో ప్రత్యేక అనుబంధం ఉండేదని ఆయన పంచుకున్నారు. ఆయనతో గడిపిన ప్రతి క్షణంలోనూ తామిద్దరమే ఉన్నామని, మూడో వ్యక్తి లేడని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు.
సీనియర్ ఎన్టీఆర్ తనను బ్రహ్మర్షి విశ్వామిత్ర హిందీ వెర్షన్ షూటింగ్‌కు తీసుకెళ్లి, అందులో భరతుడిగా వేషం వేయించారని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. ఆయన దర్శకత్వంలో నటించే అవకాశం దక్కడం తన అదృష్టంగా భావించానని చెప్పారు. షూటింగ్ సమయంలో సీనియర్ ఎన్టీఆర్ శాఖాహారం మాత్రమే తీసుకునేవారని, రాత్రి 7 గంటలకల్లా పడుకునేవారని తెలిపారు. అయితే, తాను మాంసాహారం అలవాటు ఉన్నందున, తన తల్లి రోజు మాంసాహార భోజనం పంపేవారని, దానిని తినడానికి రాత్రి ఎనిమిదిన్నరకు ఆయన పక్కన పడుకున్న తనను లేపేవారని వివరించారు. ఉదయాన్నే సీనియర్ ఎన్టీఆర్‌కు మసాజ్ చేసే వ్యక్తి, తర్వాత తనకూ మసాజ్ చేసి, మీగడతో స్నానం చేయించేవారని గుర్తుచేసుకున్నారు. తర్వాత, సీనియర్ ఎన్టీఆర్ తన తల్లిని పిలిపించి, ఆమె చేతి వంట రుచి చూసిన తర్వాత, రోజు ఆమె చేత క్యారేజీ తెప్పించుకునేవారని జూనియర్ ఎన్టీఆర్ తెలిపారు.
సీనియర్ ఎన్టీఆర్ చివరి రోజుల్లో తన తల్లిని పిలిపించి.. “ఇంత కాలం దూరమున్నాము, దాని గురించి పట్టించుకోకండి. నా వంశోద్ధారకుడు నీ కడుపున పుట్టాడు. నా అంతడి వాడిగా అతన్ని తీర్చిదిద్దడంలో నీ వంతు బాధ్యత నువ్వు నిర్వర్తించు అమ్మ, నా వంతు బాధ్యత నేను నిర్వర్తిస్తాను” అని అన్నారని జూనియర్ ఎన్టీఆర్ వివరించారు. ఆ తర్వాత కొద్ది రోజులకే సీనియర్ ఎన్టీఆర్ చనిపోవడంతో, అప్పుడు తనలో కోపం, నిరాశ కలిగినా, వయసు పెరిగే కొద్దీ ఆ మాటల లోతు అర్థమైందని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. మూడు అక్షరాలు (ఎన్.టి.ఆర్), పోలికలు, ఆయన ఆశీర్వాదం తనకు దక్కాయని, ఆయన తన వంతు బాధ్యతను నిర్వర్తించారని, ఇప్పుడు తన వంతు బాధ్యతను తాను నిర్వర్తించాలని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు.
