Mirchi Vada Recipe: ఇది మీరు తినే సాధారణ మిరపకాయ బజ్జీ కాదు.. రాజస్థానీ స్పెషల్ మిర్చి వడ
సాయంత్రం కాగానే వేడివేడిగా ఏదైనా కారం కారంగా తినాలనిపించడం సహజం. మనకు తెలిసిన మిరపకాయ బజ్జీలకంటే వెయ్యి రెట్లు రుచిగా ఉండే 'రాజస్థానీ మిర్చి వడ' గురించి మీకు తెలుసా? ఇది కేవలం పిండిలో ముంచి వేసే బజ్జీ కాదు, లోపల బయట అద్భుతమైన మసాలాలతో నిండిన ఒక రుచికరమైన అద్భుతం. రాజస్థానీ వీధుల్లో దొరికే ఆ ఒరిజినల్ మిర్చి వడను ఇంట్లోనే ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..

మిర్చి వడ ప్రత్యేకత ఏమిటంటే.. ఇందులో వాడే బంగాళాదుంప మసాలా సోంపు వాసన. మిరపకాయ లోపల మసాలా నింపడమే కాకుండా, పైన కూడా ఒక లేయర్ లాగా బంగాళాదుంపను కోట్ చేయడం వల్ల ఇది వడ లాగా మందంగా, రుచిగా తయారవుతుంది. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలనే ఈ వెరైటీ వంటకం మీ ఆదివారం సాయంత్రాన్ని కలర్‌ఫుల్‌గా మార్చేస్తుంది. మరి ఆ కరకరలాడే మిర్చి వడ తయారీలో వాడే పదార్థాలు ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం..
కావలసిన పదార్థాలు:
పెద్ద మిరపకాయలు (బజ్జీ మిర్చి): 8 గ్రాములు
బంగాళాదుంపలు: 4 (ఉడికించి, మెత్తగా చేసినవి)
మసాలాలు: సోంపు (1 టీస్పూన్), ధనియాల పొడి, కారం, ఆమ్చూర్ (మామిడికాయ పొడి), గరం మసాలా.
బైండింగ్ కోసం: అల్లం-పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, ఉప్పు.
బజ్జీ పిండి: 2 కప్పుల శనగపిండి, చిటికెడు పసుపు, బేకింగ్ సోడా, నూనె (వేయించడానికి).
తయారీ విధానం
మసాలా ప్రిపరేషన్: ఒక గిన్నెలో ఉడికించిన బంగాళాదుంపలను తీసుకుని అందులో సోంపు, ధనియాల పొడి, కారం, ఆమ్చూర్ పొడి, గరం మసాలా, అల్లం పేస్ట్ మరియు కొత్తిమీర వేసి బాగా కలపండి.
మిర్చి స్టఫ్ఫింగ్: మిరపకాయలను కడిగి, మధ్యలో నిలువుగా గాటు పెట్టి గింజలు తీసేయండి. ఇప్పుడు సిద్ధం చేసుకున్న బంగాళాదుంప మసాలాను మిరపకాయ లోపల నింపండి.
సీక్రెట్ ట్రిక్: మసాలాను మిరపకాయ లోపల నింపడమే కాకుండా, బయట కూడా పల్చటి పొరలా రాయండి. దీనివల్ల వడ మందంగా, డబుల్ రుచితో వస్తుంది.
శనగపిండిలో ఉప్పు, పసుపు వేసి, నీళ్లు పోస్తూ దోసె పిండి కంటే కొంచెం గట్టిగా (బజ్జీ పిండిలా) కలుపుకోవాలి.
నూనె వేడెక్కాక, మసాలా పట్టించిన మిరపకాయను పిండిలో ముంచి, బంగారు రంగు వచ్చేవరకు మీడియం మంటపై వేయించి తీయండి.
చిన్న చిట్కా: మిర్చి వడను వేడివేడిగా గ్రీన్ చట్నీ లేదా చింతపండు చట్నీతో తింటే ఆ రుచి అమోఘం!
