IBOMMA: ‘ఇకపై మేం బొమ్మ చూపిస్తాం’.. ‘ఐబొమ్మ’ నిర్వాహకులకు సీవీ ఆనంద్ స్ట్రాంగ్ వార్నింగ్
మూవీ లవర్స్ కు ‘ఐబొమ్మ’ వెబ్‌సైట్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. థియేటర్లు, ఓటీటీలో రిలీజైన కొత్త సినిమాలను నిమిషాల వ్యవధిలో పైరసీ చేస్తోందీ వెబ్ సైట్. తద్వారా నిర్మాతలకు కోట్లాది రూపాయల నష్టం కలిగిస్తోంది. సినిమా పెద్దలు, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా వీరి ఆగడాలను అడ్డుకోలేకపోయారు.

మూవీ రూల్జ్, ఐ బొమ్మ.. సినిమాల పైరసీకి సంబంధించి ప్రధానంగా వినిపించే వెబ్ సైట్స్ ఇవే. మరీ ముఖ్యంగా ఐ బొమ్మ సినిమాల పైరసీకి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. మొన్నటివరకు కేవలం ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలు, సిరీస్ లను మాత్రమే పైరసీ చేసి తమ సైట్ లో అప్ లోడ్ చేస్తోంది ఐ బొమ్మ. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్, ఆహా వంటి ప్రముఖ ఓటీటీల్లోని కంటెంట్ ను నిమిషాల వ్యవధిలో పైరసీ చేసి తమ సైట్ లో అప్ లోడ్ చేస్తోంది. అయితే ఈ మధ్యన ఐ బొమ్మ ఆగడాలు మరీ మితిమీరిపోయాయి. థియేటర్ లో రిలీజవుతోన్న కొత్త సినిమాలను కూడా పైరసీ చేస్తున్నారీ వెబ్ సైట్ నిర్వాహకులు. గంటల వ్యవధిలోనే థియేటర్ హెచ్‌డీ ప్రింట్‌ను పైరసీ చేసి వెబ్ సైట్ లో రిలీజ్ చేస్తున్నారు. మొన్నటి అల్లు అర్జున్ ‘పుష్ప 2’ నుంచి నేటి పవన్ కల్యాణ్ ‘ఓజీ 2’ వరకు పైరసీ బాడిన పడినవే. వీటి నియంత్రణకు సినిమా పెద్దలు, పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా పైరసీ మాత్రం ఆగడం లేదు. తాజాగా హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ పైరసీ ముఠాలను అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను టాలీవుడ్ సినీ పెద్దలకు పోలీసులు వివరించారు.
వారే అసలు సూత్రధారులు
ఈ సమవేశంలో హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, నాని, రామ్, నాగచైతన్య.. ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో పటు పలువురు దర్శకులు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పైరసీ ముఠాల పని తీరును పోలీసులు సినీ వివరించారు. సినిమాలు థియేటర్లలోకి రాకముందే హెచ్‌డీ క్వాలిటీ ప్రింట్లు ఎలా బయటకు వస్తున్నాయో తెలుసుకుని అందరూ షాక్ అయ్యారు. హ్యాకర్లకు, పైరసీ ముఠాలకు బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకులే సహకరిస్తున్నారని పోలీసులు స్పష్టం చేశారు. ఇదే మీటింగ్ సందర్భంగా హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ పైరసీ ముఠాలకు వార్నింగ్ ఇచ్చారు. త్వరలోనే ఐబొమ్మ నిర్వాహకులను కూడా అరెస్ట్ చేస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ‘ఐబొమ్మ నిర్వాహకులను త్వరలోనే పట్టుకుంటాం. దాదాపు రూ.2 కోట్లు ఖర్చు చేసి అధునాతన పరికరాలు వాడి పైరసీ ముఠాను పట్టుకున్నాం’ అని సీవీ ఆనంద్ చెప్పుకొచ్చారు.
ఆ మాస్టర్ మైండ్ ఎవరబ్బా!
కాగా ఐబొమ్మకు చెందిన నలుగురిని ఇప్పటికే హైదరాబాద్ సీపీ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ పైరసీ దందా వెనక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరన్నది ఇంకా తెలియడం లేదట.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








