AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funky MovieReview: ఫంకీ మూవీ రివ్యూ.. విశ్వక్ సేన్, అనుదీప్ కాంబినేషన్ నవ్వులు పూయించిందా..?

మాస్ కా దాస్ విశ్వక్‌సేన్‌ హీరోగా, జాతిరత్నాలు వంటి కల్ట్ కామెడీ ఇచ్చిన డైరెక్టర్ కె.వి.అనుదీప్‌ కాంబినేషన్‌లో సినిమా అనగానే ఫంకీపై ఆడియన్స్‌లో ఆసక్తి బాగానే నెలకొంది. దానికి తోడు సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ వంటి బడా నిర్మాణ సంస్థ ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించడంతో అంచనాలు మరింత పెరిగాయి. మరి ఈ క్రేజీ కాంబినేషన్ ఆ అంచనాలను అందుకుందా? అనుదీప్ తన మార్క్ కామెడీతో మ్యాజిక్ చేశాడా? విశ్వక్‌సేన్‌ ఖాతాలో మరో హిట్ పడిందా? రివ్యూలో చూద్దాం.

Funky MovieReview: ఫంకీ మూవీ రివ్యూ.. విశ్వక్ సేన్, అనుదీప్ కాంబినేషన్ నవ్వులు పూయించిందా..?
Funky Movie Review
Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Feb 13, 2026 | 1:31 PM

Share

మూవీ రివ్యూ: ఫంకీ

నటీనటులు: విశ్వక్‌సేన్‌, కయాదు లోహర్‌, నరేష్‌, మిర్చి సంపత్‌, పమ్మి సాయి, మహిపాల్ తదితరులు

సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో

ఎడిటింగ్: నవీన్ నూలి

నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య

దర్శకత్వం: కె.వి.అనుదీప్‌

కథ:

కోమల్ (విశ్వక్‌సేన్‌) ఒక సినిమా డైరెక్టర్. తన మొదటి సినిమాను తెరకెక్కించే క్రమంలో అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ ఖర్చు చేయడంతో నిర్మాత సుదర్శన్ (నరేష్)ఆసుపత్రి పాలవుతాడు. దీంతో ఆ నిర్మాత కూతురు చిత్ర (కయాదు లోహర్‌) కోపంతో షూటింగ్ ఆపేస్తుంది. అంతేకాకుండా కోమల్‌ను ప్రాజెక్ట్ నుంచి తప్పిస్తుంది. అయితే తన తప్పును సరిదిద్దుకుని మళ్లీ షూటింగ్ మొదలుపెట్టాలని కోమల్ నానా తంటాలు పడతాడు. చివరికి చిత్ర ఒక కండీషన్ మీద ఒప్పుకుంటుంది. మిగిలిన సినిమాను కేవలం కోటి రూపాయల బడ్జెట్‌లో పూర్తి చేయాలన్నది ఆ షరతు. ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన కోమల్, ఆ తక్కువ బడ్జెట్‌లో సినిమాను ఎలా పూర్తి చేశాడు? ఈ ప్రయాణంలో చిత్రతో ప్రేమలో ఎలా పడ్డాడు? షూటింగ్ సమయంలో కోమల్‌కు ఎదురైన విచిత్రమైన సమస్యలేంటి? అన్నదే మిగతా కథ.

కథనం:

దర్శకుడు అనుదీప్ తన గత చిత్రాల మాదిరిగానే లాజిక్‌ను పక్కనపెట్టి కేవలం కామెడీ మ్యాజిక్‌ మీదే దృష్టి పెట్టాడు. కథలో సీరియస్‌నెస్ కంటే సిల్లీనెస్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఒక చిన్న పాయింట్‌ను తీసుకుని దానికి తనదైన శైలిలో ఫన్ జోడించుకుంటూ వెళ్ళారు. సినిమాలోని ప్రధాన పాత్రలే కాకుండా, చిన్న చిన్న పాత్రలు కూడా సెటైర్లు వేస్తుంటే థియేటర్‌లో నవ్వులు వినిపిస్తాయి. ముఖ్యంగా హీరో క్యారెక్టరైజేషన్ డిఫరెంట్‌గా ఉంటుంది. అమ్మతో ఫోన్లో మాట్లాడటాన్ని కూడా చిరాకుగా.. అంటే అనుదీప్ భాషలో చెప్పాలంటే గలీజ్‌గా ఫీలయ్యే హీరో, హీరోయిన్‌ ప్రేమలో పడ్డాక బంధాల విలువ తెలుసుకోవడం అనే పాయింట్ బాగుంది. అయితే హీరో హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్ ఉన్నా, దాన్ని బయటపెట్టే సందర్భాలు రాకపోవడంతో వారి మధ్య నడిచే అంతర్మధనం ఆకట్టుకుంటుంది. కథలో సడన్‌గా వచ్చే దిల్‌రాజు, నాగవంశీ, హరీష్‌శంకర్ వంటి వారి క్యామియోలు సర్ప్రైజ్ చేస్తాయి. మొత్తంగా కథనం ఎక్కడా సీరియస్‌గా లేకుండా నవ్వించడమే లక్ష్యంగా సాగింది. ఇందులో నిర్మాత నాగవంశీ చెప్పినట్లు మొదటి సీన్‌లోనే కథ అనేది పూర్తిగా పక్కనబెట్టేయాలి. అలా పెడితేనే మిగిలిన సినిమా చూడగలరు. అస్సలు ఒక సీన్‌తో మరో సీన్‌కు సంబంధం లేకుండా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు అనుదీప్. ముఖ్యంగా సింగిల్ లైనర్స్‌పైనే వెళ్దామని ముందుగానే ఫిక్సైపోయాడు. దానికే స్టిక్ అయి సినిమా తీసాడని అర్థం అవుతుంది.

నటీనటులు:

విశ్వక్‌సేన్‌ తన ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్‌తో సినిమాను నడిపించాడు. కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఇక హీరోయిన్ కయాదు లోహర్‌ స్క్రీన్ మీద చాలా అందంగా కనిపించింది, ఆమె నటన కూడా సహజంగా ఉంది. నిర్మాత కూతురి పాత్రలో ఆమె ఒదిగిపోయింది. సీనియర్ నటుడు నరేష్ తన అనుభవంతో నవ్వించగా.. జీకే పాత్రలో మిర్చి సంపత్ విలనిజం పండించలేకపోయినా కామెడీని మాత్రం బాగానే పండించాడు. మిగతా నటీనటులు తమ పరిధి మేరకు మెప్పించారు.

టెక్నికల్ టీం:

భీమ్స్‌ సిసిరోలియో అందించిన సంగీతం ఓకే.. పాటలు బాగానే ఉన్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా ఓకే. విజువల్స్ పరంగా సినిమా బాగుంది. సినిమాటోగ్రఫీ, కలర్ గ్రేడింగ్ మీద ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉంటే ఇంకాస్త బాగా వచ్చేది అనిపించింది. ఇదొక పూర్తి స్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌ కాబట్టి దర్శకుడు కథలో పెద్దగా ట్విస్టులు ఉండవు. అయితే కథ మరీ లైటర్‌-వీన్‌గా సాగడం వల్ల కొన్ని చోట్ల సాగదీసిన భావన కలుగుతుంది. హీరోకు వచ్చే సమస్యలు కూడా కామెడీగా పరిష్కారం అవ్వడం వల్ల డ్రామా అనుకున్నంతగా పండలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు అనుదీప్ మరోసారి తన కామెడీతోనే బండి లాక్కొచ్చాడు. జాతిరత్నాలు రేంజ్‌లో వర్కవుట్ అవ్వలేదు కానీ సరదాగా చూసి నవ్వుకోడానికి ఈ ఫంకీ ఓకే.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా ‘ఫంకీ’.. లాజిక్కులు వెతక్కుండా నవ్వుకోవాలనుకునే వాళ్లకు ‘ఫన్’ రైడ్.