AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఐపీఎల్ 2026 రద్దు చేయండి.. ప్రధాని మోదీకి కాంగ్రెస్ సీనియర్ నేత సంచలన లేఖ!

పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు, దేశంలో పెరుగుతున్న ఇంధన సంక్షోభం నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌ను తక్షణమే నిలిపివేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. లీగ్ చివరి దశకు చేరుకున్న తరుణంలో, కేంద్ర ప్రభుత్వం ఈ మెగా టోర్నీపై కఠిన నిర్ణయం తీసుకోవాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత భూపేష్ బఘేల్ ప్రధాని నరేంద్ర మోదీని కోరడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది.

ఐపీఎల్ 2026 రద్దు చేయండి.. ప్రధాని మోదీకి కాంగ్రెస్ సీనియర్ నేత సంచలన లేఖ!
Ipl 2026 Pm Modi
Venkata Chari
|

Updated on: May 17, 2026 | 1:53 PM

Share

ఇరాన్, అమెరికాల మధ్య రేగిన సాయుధ పోరు అంతకంతకూ తీవ్రరూపం దాలుస్తోంది. మార్చి 28న ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభమైనప్పుడు పరిస్థితి కొంత అదుపులోనే ఉన్నప్పటికీ, గత రెండు నెలలుగా అంతర్జాతీయంగా సమీకరణాలు వేగంగా మారిపోయాయి. ముఖ్యంగా ముడి చమురు సరఫరాపై ఈ యుద్ధ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. దేశంలో ఇంధన పొదుపు పాటించాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా దేశ ప్రజలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో, ఐపీఎల్ లాంటి భారీ ఈవెంట్‌ను కొనసాగించడం ఎంతవరకు సమంజసమనే చర్చ మొదలైంది.

ప్రధాని మోదీకి భూపేష్ బఘేల్ డిమాండ్.. ఆ నాలుగు కారణాలు ఇవే..!

ఛత్తీస్‌గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అగ్రనేత భూపేష్ బఘేల్ ఈ సంక్షోభాన్ని ప్రస్తావిస్తూ ప్రధానికి లేఖ రాశారు. ఐపీఎల్‌ను తక్షణమే నిలిపివేయడం ద్వారా దేశానికి బహుళ ప్రయోజనాలు చేకూరుతాయని ఆయన వాదించారు. బఘేల్ తన డిమాండ్ వెనుక ప్రధానంగా నాలుగు కారణాలను విశ్లేషించారు:

ఇంధన పొదుపు: ఐపీఎల్ వల్ల 10 జట్లు దేశవ్యాప్తంగా విమానాలు, బస్సుల్లో నిరంతరం ప్రయాణించాల్సి వస్తోంది. టోర్నీ ఆపితే భారీగా ఇంధన వృధాను అరికట్టవచ్చు.

స్టేడియంల ప్రయాణాలు: లక్షలాది మంది అభిమానులు మ్యాచ్‌ల కోసం వివిధ నగరాలకు ప్రయాణించడం తగ్గి, చమురు వినియోగం అదుపులోకి వస్తుంది.

విదేశీ మారక ద్రవ్యం: విదేశీ ఆటగాళ్లకు చెల్లించే భారీ మొత్తాల రూపంలో దేశీయ కరెన్సీ బయటకు పోకుండా కాపాడుకోవచ్చు.

బెట్టింగ్ కట్టడి: ఐపీఎల్ సాకుతో దేశంలో యథేచ్ఛగా సాగుతున్న క్రికెట్ బెట్టింగ్ ముఠాలకు అడ్డుకట్ట వేయవచ్చని బఘేల్ స్పష్టం చేశారు.

“ప్రధానమంత్రి గారూ.. దేశ హితం కోసం ఐపీఎల్‌ను తక్షణమే నిలిపివేయండి. దీనివల్ల ఇంధనం ఆదా అవ్వడమే కాకుండా, దేశంలో జరుగుతున్న అక్రమ బెట్టింగులకు కూడా బ్రేక్ పడుతుంది” అని భూపేష్ బఘేల్ పేర్కొన్నారు.

పెరిగిన పెట్రోల్ ధరలు.. ప్రధాని నూతన జీవనశైలి..

ప్రస్తుత అంతర్జాతీయ సంక్షోభం వల్ల దేశంలో ఇంధన ధరలు లీటరుకు 3 రూపాయల వరకు పెరిగాయి. రానున్న రోజుల్లో ఈ భారం మరింత పెరిగే అవకాశం ఉండటంతో, ప్రధాని మోదీ సైతం తన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను తగ్గించుకుని పర్యావరణ అనుకూల, పొదుపు జీవనశైలిని అవలంబిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 10 జట్లకు సంబంధించిన భారీ లాజిస్టిక్స్, రవాణా ఖర్చులను తగ్గించడానికి ఐపీఎల్ రద్దు సరైన మార్గమని కాంగ్రెస్ వాదిస్తోంది. అయితే, టోర్నీ ముగియడానికి కేవలం రెండు వారాల సమయం మాత్రమే ఉన్నందున, ఈ దశలో లీగ్‌ను ఆపితే భారీ ఆర్థిక నష్టాలు వస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. బీసీసీఐ గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

బెంగళూరుకు షాక్.. అహ్మదాబాద్‌కు ఐపీఎల్ 2026 ఫైనల్..

ఇదిలా ఉంటే, ఐపీఎల్ 2026 ముగింపు వేడుకలకు వేదిక మారింది. మే 31న జరగబోయే గ్రాండ్ ఫైనల్ మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. నిజానికి డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) హోమ్ గ్రౌండ్ అయిన చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది.

కానీ, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (KSCA) స్థానిక ఎమ్మెల్యేల కోసం పెద్ద ఎత్తున ఉచిత టికెట్లను కేటాయించి, సామాన్య క్రికెట్ అభిమానులకు అన్యాయం చేస్తూ దొరికిపోయింది. బీసీసీఐ, ఐపీఎల్ నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించినందుకు గానూ బెంగళూరు నుంచి ఫైనల్ మ్యాచ్ నిర్వహణ హక్కులను బోర్డు వెనక్కి తీసుకుంది. కొత్త షెడ్యూల్ ప్రకారం, మే 26న ధర్మశాలలో క్వాలిఫైయర్-1, మే 27న ముల్లాన్‌పూర్‌లో ఎలిమినేటర్, మే 29న క్వాలిఫైయర్-2 మ్యాచ్‌లు జరగనున్నాయి.

దేశంలో ఇంధన సంక్షోభం, పెరిగిన ధరల నేపథ్యంలో ఐపీఎల్ రద్దు డిమాండ్ రాజకీయంగా పెద్ద దుమారమే రేపుతోంది. ఒకవైపు దేశ ఆర్థిక భద్రత, మరోవైపు వేల కోట్ల వ్యాపారంతో ముడిపడి ఉన్న క్రికెట్ పండుగ.. ఈ రెండింటి మధ్య సమతూకం పాటించడం బీసీసీఐకి, కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది. ఏదేమైనా, మే 31న అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్ పోరు వైపే అభిమానుల చూపు ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us