త్యాగాలతో తెచ్చుకున్న స్వాతంత్ర్యాన్ని కాపాడుకోవడం మన బాధ్యతః మోహన్ భగవత్
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పూర్వీకుల త్యాగాలను స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్యం సాధించడం మాత్రమే కాదని, దానిని కాపాడుకోవడం, దేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం ప్రతి భారతీయుడి బాధ్యత అన్నారు. నిజమైన దేశభక్తి అంటే స్వాతంత్ర్య స్ఫూర్తిని ఆచరణలో పెడుతూ జాతి నిర్మాణంలో భాగస్వామ్యం కావడమేనని ఆయన ఉద్ఘాటించారు.

స్వాతంత్ర్య దినోత్సవం ప్రతి భారతీయుడికి గర్వకారణమైన, ఆనందోత్సాహాల సందర్భమని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) సర్‌సంఘ్‌చాలక్ డా. మోహన్ భగవత్ అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు పూర్వీకులు చేసిన అపారమైన త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర్యం సాధించినంత మాత్రాన బాధ్యత ముగియదని.. దాన్ని కాపాడుకోవడం, దేశాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. దేశ ప్రజలందరికీ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
1857లో ప్రారంభమైన స్వాతంత్ర్య పోరాటాన్ని ప్రస్తావించిన మోహన్ భగవత్.. దాదాపు 90 సంవత్సరాల పాటు భారతీయులు నిరంతర పోరాటం సాగించారని గుర్తుచేశారు. ఈ సుదీర్ఘ పోరాటంలో ఎంతోమంది తమ జీవితాలను త్యాగం చేశారని, దేశం కోసం ప్రాణాలను అర్పించారని అన్నారు. వారి త్యాగం, అంకితభావం, దేశభక్తిని తరతరాలు స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటం కేవలం ఒక రాజకీయ మార్పు కోసం జరిగిన ఉద్యమం కాదని.. దేశ భవిష్యత్తు కోసం సాగిన మహత్తర పోరాటమని భగవత్ గుర్తు చేశారు. స్వేచ్ఛను సాధించేందుకు పూర్వీకులు చేసిన త్యాగాల స్ఫూర్తితో ప్రస్తుత తరం దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
అయితే స్వాతంత్ర్యం సాధించుకున్న తర్వాత దాని విలువను మరచిపోకూడదని ఆయన హెచ్చరించారు. ఎంతో శ్రమ, త్యాగాల ద్వారా లభించిన స్వేచ్ఛను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. దేశ సమగ్రత, ఐక్యత, స్వావలంబన, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు.
స్వాతంత్ర్య ఫలాలు దేశంలోని ప్రతి ఒక్కరికీ అందేలా చూడాల్సిన అవసరం ఉందని మోహన్ భగవత్ అన్నారు. దేశంలో అత్యుత్తమమైనది, ఉదాత్తమైనది, ఉన్నతమైనది, ఆనందదాయకమైన ప్రతిదీ వికసించే వాతావరణాన్ని నిర్మించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు.
పూర్వీకుల త్యాగాలను స్మరించుకుంటూ.. వారి ఆశయాలకు అనుగుణంగా దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే నిజమైన దేశభక్తి అని ఆయన పేర్కొన్నారు. స్వాతంత్ర్య స్ఫూర్తిని కేవలం వేడుకలకే పరిమితం చేయకుండా.. దేశ నిర్మాణంలో ప్రతిరోజూ ఆచరణలో పెట్టాలని మోహన్ భగవత్ పిలుపునిచ్చారు.
వీడియో ఇక్కడ చూడండి..
“स्वतंत्रता दिवस हम सबके लिए गौरव का और उत्सव का विषय़ है। 1857 से गिनेंगे तो लगातार 90 वर्ष अनेक प्रकार का त्याग बलिदान देकर हमारे पूर्वजों ने स्वातंत्र्य की प्राप्ति की। उस त्याग और बलिदान का गौरव हमारे मन में है। लेकिन इसके साथ एक भान मन में चाहिए, कि इतना त्याग-परिश्रम करके… pic.twitter.com/1s5t2Jrz3C
— RSS (@RSSorg) August 15, 2026
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
