AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశభక్తికి నిలువెత్తు సాక్ష్యం.. ఆ గ్రామంలో 80 ఏళ్లుగా నిరంతరం రెపరెపలాడుతున్న మువ్వన్నెల జెండా..

ఎక్కడైనా జాతీయ జెండా.. స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం రోజున ఎగురుతుంది.. కానీ ఓ గ్రామంలో మాత్రం దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు నుంచి మువ్వన్నెల జెండా నిరంతరం రెపరెపలాడుతూనే ఉంది. ఒకటి కాదు.. రెండు కాదు.. దశాబ్దాలు దాటిపోయాయి. ఆ జెండా వెనుక మూడు రంగులే కాదు.. ముగ్గురు స్వాతంత్ర్య సమరయోధుల త్యాగగాథ ఉంది. దేశభక్తిని తరతరాలకు అందించాలనే సంకల్పం ఉంది. ఇంతకీ.. 80 ఏళ్లుగా జాతీయ జెండాను అవనతం కానివ్వని ఆ గ్రామం ఎక్కడుందో తెలుసుకోవాలంటే ఏ స్టోరీ చదవాల్సిందే.

దేశభక్తికి నిలువెత్తు సాక్ష్యం.. ఆ గ్రామంలో 80 ఏళ్లుగా నిరంతరం రెపరెపలాడుతున్న మువ్వన్నెల జెండా..
India's Flag Flies Continuously Since 1947
M Revan Reddy
| Edited By: |

Updated on: Aug 15, 2026 | 11:19 AM

Share

బ్రిటిష్ బానిస సంకెళ్ళ నుంచి దేశానికి 1947 ఆగస్టు 15న భారతదేశం విముక్తి పొందిన చారిత్రాత్మక రోజు. దేశమంతా స్వాతంత్ర్య సంబరాల్లో మునిగిపోయిన వేళ.. యాదాద్రి జిల్లా రాజాపేట మండలం బేగంపేట గ్రామంలోనూ ఓ చారిత్రాత్మక ఘట్టం జరిగింది. గ్రామానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధులు బద్దం నర్సిరెడ్డి, బల్జె వీరయ్య, చీగుళ్ల మల్లయ్య గ్రామ చౌరస్తాలో మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఎగురవేసి తమ దేశభక్తిని చాటుకున్నారు. అది కేవలం జెండా ఆవిష్కరణ కాదు.. స్వాతంత్ర్య సమర యోధుల త్యాగాలకు నివాళి. స్వేచ్ఛా భారతానికి స్వాగతమది. అప్పటి నుంచి 80 ఏళ్లుగా మువ్వన్నెల పతాకాన్ని అవనతం చేయకుండా నిరంతరాయంగా రెపరెపలాడుతూనే ఉంది. అప్పటి నుంచి మొదలైన ఆ సంప్రదాయం.. ఇప్పటికీ గ్రామస్తులు కొనసాగించడం విశేషం.

జెండా కాదు.. దేశభక్తికి ప్రతీక..

సాధారణంగా జాతీయ పతాకాన్ని ప్రత్యేక రోజుల్లో ఎగురవేస్తాం. కానీ బేగంపేటలో మాత్రం మువ్వన్నెల పతాకం నిరంతరంగా రెపరెపలాడుతూనే ఉంటుంది. ప్రతి ఏడాది ఆగస్టు 15న.. గణతంత్ర దినోత్సవం రోజున.. దసరా సందర్భంగా.. గ్రామ పెద్దలు పాత జెండాను తొలగించి కొత్త జాతీయ పతాకాన్ని అమర్చుతారు. అంటే.. జెండా మారుతుంది కానీ.. దేశభక్తి మాత్రం మారదు. దేశభక్తిని కేవలం జెండాకే పరిమితం చేయలేదు గ్రామస్తులు. దేశం కోసం పోరాడిన మహనీయుల స్ఫూర్తిని భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో గ్రామస్తులు చందాలు వేసుకుని 1979లో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

చిన్నారులు.. యువత.. ప్రతి ఒక్కరిలో జాతీయ భావాన్ని పెంపొందించాలన్నదే ఉద్దేశమని గ్రామస్తులు చెబుతున్నారు. తరాలు మారినా.. తమ సంప్రదాయం మారలేదనీ అంటున్నారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన పెద్దలు చూపించిన దారిని.. నేటి తరం కొనసాగిస్తోమని చెబుతున్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేశారనీ, వారి త్యాగాలను గుర్తు చేసుకోవడం.. వారి స్ఫూర్తిని భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెబుతున్నారు. ఒకప్పుడు ముగ్గురు స్వాతంత్ర్య సమర యోధులు ఎగరేసిన జెండా.. ఇప్పుడు ఓ గ్రామం మొత్తానికి గర్వకారణంగా ఉందని చెబుతున్నారు.

జెండా ఎగరేయడం ఓ ఆనవాయితీ కావొచ్చు.. కానీ ఆ జెండా వెనుక ఉన్న త్యాగాలను గుర్తు చేసుకుంటూ తరతరాలుగా దాన్ని కొనసాగించడం మాత్రం అసలైన దేశభక్తి. మువ్వన్నెల జెండా రెపరెపల్లో.. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగం కనిపిస్తోంది. బేగంపేట గ్రామస్తుల గుండెల్లో.. భారతమాతపై ఉన్న అభిమానం కనిపిస్తోంది. ఏదేమైనా 80 ఏళ్లుగా జెండాను ఎగరేస్తున్న ఆ గ్రామానికి.. నిజంగా సెల్యూట్ చేయాల్సిందే!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us