కొత్త తరానికి కొత్త విద్యా విధానం అవసరం: సద్గురు మధుసూదన్ సాయి
Sadguru Madhusudan Sai: హైదరాబాద్‌లో సద్గురు శ్రీ మధుసూదన్ సాయి విద్యా సంస్కరణల ఆవశ్యకతను నొక్కిచెప్పారు. పరిశ్రమల అవసరాలకు, ప్రస్తుత విద్యకు మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు నైపుణ్యాధారిత స్వల్పకాలిక కోర్సులు అత్యవసరమన్నారు. విలువలు, నైతిక విద్య లోపం నేటి తరాలపై చూపే ప్రభావాన్ని విశ్లేషించారు. విద్యాసంస్థలు వ్యాపార కేంద్రాలు కారాదని, జెన్-జీ వేగంగా నేర్చుకుంటారని, అయితే నిదానంగా జీవించడం అలవర్చుకోవాలని సూచించారు.

Sadguru Madhusudan Sai: పారిశ్రామిక రంగ అవసరాలకు, విద్య విధానానికి మధ్య ఉన్న అంతరాన్ని తగ్గించేందుకు మరింత కృషి జరగాల్సిన అవసరం ఉంది. నైపుణ్యాధారిత స్వల్పకాలిక కోర్సులు ప్రస్తుత తక్షణ అవసరం. త్వరలోనే మా విద్యాసంస్థల్లో ఇటువంటి కోర్సులను రూపొందించనున్నామని ‘వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ మిషన్’ వ్యవస్థాపకులు సద్గురు మధుసూదన్ సాయి అన్నారు.
హైదరాబాద్ నగరంలో శుక్రవారం (సెప్టెంబరు 25) జరిగిన ‘కంపాషన్ ఇన్ యాక్షన్’ కార్యక్రమంలో టాలీవుడ్ నిర్మాత, రామానాయుడు స్టూడియోస్ చైర్మన్, సురేశ్ ప్రొడక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ దగ్గుబాటి సురేశ్ బాబు అడిగిన ప్రశ్నలకు సద్గురు సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా విద్యా రంగంలో సంస్కరణల ఆవశ్యకతను ఆయన నొక్కిచెప్పారు.
అమెరికా సహా అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో దీర్ఘకాలిక కోర్సుల పట్ల విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. భారతదేశంలో విద్యార్థులు కళాశాలల్లో నేర్చుకుంటున్న దానికి, పారిశ్రామిక అవసరాలకు మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని విద్యా రంగంలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
విద్యాసంస్థలు ఎప్పటికీ వ్యాపార కేంద్రాలు కాకూడదు. చాలా పాఠశాలల్లో విలువల విద్య, నైతిక విద్య తరగతులే జరగడం లేదు. ఇలాంటి వాటిని ‘టైమ్‌వేస్ట్’గా చాలా మంది తల్లిదండ్రులు భావిస్తున్నారు. నేటి జెన్-జీ లేదా జెన్-ఆల్ఫా తరాలు ఈ విధంగా తయారు కావడానికి నైతిక విద్య లోపించడం కూడా ఒక కారణమని ఆయన స్పష్టం చేశారు.
జెన్-జీపై ఉన్న అభ్యంతరాల గురించి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. “ఈ తరం వారు మనకంటే వేగంగా నేర్చుకుంటారు, చాలా చురుకుగా ఉంటారు. పెద్దలు ఈ విషయాన్ని అంగీకరించాలి. అదేవిధంగా జెన్-జీ తరం యువత కూడా నిదానంగా జీవించడాన్ని అలవాటు చేసుకోవాలి” అని సద్గురు సూచించారు.
ముద్దేనహళ్లిలోని మధుసూదన్ సాయి వైద్య విజ్ఞాన, పరిశోధనా సంస్థలో పలు వైద్య పరిశోధనలు జరుగుతున్నాయి. వెల్‌నెస్-లాంజివిటీ విషయంలో నాలుగు విధానాల సమన్వయంతో కూడిన చికిత్సా పద్ధతిని రూపొందించాం, దానికి పేటెంట్ పొందేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రెసిషన్ మెడిసిన్, టార్గెటెడ్ మెడిసిన్, జీనోమిక్స్ తదితర అంశాలపై కూడా విస్తృతంగా కృషి చేస్తున్నామని ఆయన వివరించారు.
సిద్దిపేటలోని కొండపాకలో ఉన్న శ్రీ సత్యసాయి ప్రశాంతి నికేతనం క్యాంపస్‌లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని భావన తన జీవిత అనుభవాన్ని పంచుకున్నారు. “మద్యానికి బానిసైన మా నాన్న, ఒకసారి నేను చనిపోయానని భావించి నా బట్టలనే అమ్మేశారు. నేను 8వ తరగతి పూర్తి చేసే వరకు ఎన్నో కష్టాలు పడ్డాను. ఇప్పుడు సద్గురు శ్రీ మధుసూదన్ సాయి నాకు అండగా గట్టిగా నిలబడ్డారు. నా కలలకు రెక్కలు తొడిగారు” అని ఆమె భావోద్వేగానికి గురయ్యారు.
లాయిడ్స్ టెక్నాలజీ సెంటర్ ఆపరేషన్స్ విభాగం అధిపతి రాజేష్ కె.ఎస్. ప్రస్తావన చేస్తూ.. కార్పొరేట్ కంపెనీల అధిపతులు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి అక్కడి వాస్తవ సమస్యలను గమనించి పరిష్కారాలను రూపొందించాలని సూచించారు. సత్యసాయి సంజీవని ఆసుపత్రుల సమూహానికి చెందిన ట్రస్ట్ ఆఫీసర్ సౌమ్య ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌కు చెందిన కాన్సల్ జనరల్ లోరా విలియమ్స్ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
