Soundarya: అందానికి అందమైన గాత్రం ఇచ్చింది ఎవరో తెలుసా ?.. తెర వెనుక వినిపించిన వాయిస్ ఈమెదే..
పద్మావతి.. పద్మావతి.. నీ ఎర్రని మూతి.. చూడగానే పోయింది నా మతి.. అయిపోయింది నా మనసు కోతి.. ఈ డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. చిన్న పెద్ద తేడా లేకుండా ఈ డైలాగ్‌కు రీల్స్ చేస్తూ అదరగొడుతున్నారు.
పద్మావతి.. పద్మావతి.. నీ ఎర్రని మూతి.. చూడగానే పోయింది నా మతి.. అయిపోయింది నా మనసు కోతి..
ఈ డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. చిన్న పెద్ద తేడా లేకుండా ఈ డైలాగ్‌కు రీల్స్ చేస్తూ అదరగొడుతున్నారు. వాస్తవానికి ఈ డైలాగ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన చూడాలని ఉంది చిత్రంలోనిది. ఇందులో చిరుకు జోడిగా.. అంజలి జవేరి.. సౌందర్య నటించారు. ఇందులో సౌందర్య నటన ఇప్పటికీ ప్రేక్షకుల మనసులలో నిలిచిపోయింది. ఈ చిత్రంలో ఆమె అల్లరి.. చిరుతో ఆమె నటన ఆడియన్స్ కళ్ల ముందుకు వస్తుంటాయి. అయితే ఈ సినిమాలో సౌందర్యకు డబ్బింగ్ చెప్పింది ఎవరో తెలుసా ?. ఈ చిత్రంలో అందానికి గాత్రం ఇచ్చింది ప్రముఖ సింగర్ అని మీకు తెలుసా. మనం నిత్యం కొన్ని వందల పాటలలో ఆమె గాత్రాన్ని వింటుంటాం. అందమైన గాత్రం మాత్రమే కాదు.. సంప్రదాయమైన చీరకట్టులో సహజ సౌందర్యంతో తన వాయిస్‌కు మించిన అందమైన రూపం ఆమె సొంతం. ఆమె ఎవరో తెలుసుకుందామా..
అందం, అభినయంతో దక్షిణాది చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు సౌందర్య. తెలుగుతోపాటు.. కన్నడ, మలయాళ, తమిళ, హిందీ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటిస్తూ.. యువ హృదయాలను కొల్లగొట్టింది. కొన్ని వందల చిత్రాలు చేసి తెలుగు చిత్రపరిశ్రమలో మరో సావిత్రి అని పేరు సంపాదించుకున్నారు. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ.. సంప్రదాయంగా కనిపిస్తూనే అగ్రకథానాయికగా కొనసాగారు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే అనుకోకుండా విమాన ప్రమదంలో మరెన్నటికీ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు సౌందర్య. ఇప్పటికీ ఆమె స్థానాన్ని భర్తీ చేయగల కథానాయిక ఇండస్ట్రీలోకి అడుగుపెట్టలేదు. అయితే సౌందర్య కెరీర్లో ఎన్నో అద్భుతమైన చిత్రాలున్నాయి. అందులో చూడాలని ఉంది ఒకటి.
సౌందర్య..మెగాస్టార్ చిరంజీవి కాంబోలో వచ్చిన చిత్రాలు చాలా తక్కువ. ఇందులో చూడాలని ఉంది సినిమాలో ఆమె నటనకు.. అల్లరికి ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. సౌందర్య నటన మాత్రమే కాదు.. ఆమె వాయిస్ కూడా ఇప్పటికీ స్పెషల్. ఇంతకీ ఈ సినిమాలో ఆమెకు వాయిస్ ఇచ్చింది ఎవరంటే.. తన పాటలతో శ్రోతల మనసులను దొచుకుంటున్న సింగర్ సునీత. కేవలం గాయనిగానే కాదు..డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ రాణిస్తోంది సునీత. ఇప్పటివరకు ఎంతో మంది హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సునీత.. సౌందర్యతో తనకున్న అనుబంధాన్ని వివరించారు. తనను ఎవరికైనా పరిచయం చేయాలంటే.. ‘నా పేరు సౌందర్య.. తను నా వాయిస్’ అంటూ పరిచయం చేసేవారు అంటూ చెప్పుకొచ్చారు సునీత.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.