CPI: ఖమ్మం ఖిల్లాలో సిపిఐ శతాబ్ది ఉత్సవాలు.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బ్రిటిషర్ల ఆలోచనతోనే బీజేపీ ముందుకు సాగుతోందని ఆరోపించారు. పేదల కోసం కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి.. జాతీయ ఉపాధి హామీ పథకం తీసుకొస్తే.. బీజేపీ ఈ పథకాన్ని రద్దు చేసిందని విమర్శించారు. రాజ్యాంగాన్ని చెరబట్టేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందన్నారు

కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా.. CPIకి నూరేళ్లు.. అభ్యుదయానికి విప్లవ వెలుగై…అణగారిన వర్గాల గుండె చప్పుడై..అక్రమాలు అన్యాయాలపై దరువేసిన ఎర్ర జెండాకు వందేళ్లు. ఉత్తర్ ప్రదేశ్ కాన్పుర్ లో 1925 డిసెంబరు 26న ఆవిర్భవించిన సీపీఐ.. కమ్యూనిజం గుమ్మం ఖమ్మంలో శతవసంతాల వేడుకను జరుపుకుంటోంది. ఖమ్మంలోని SRBGNR డిగ్రీ కాలేజీ గ్రౌండ్‌లో భారీ బహిరంగ జరుగుతోంది.. 5 లక్షల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. ఈ భారీ బహిరంగ సభకు.. సీఎం రేవంత్ రెడ్డి సహా దేశ,విదేశాల నుంచి ముఖ్య అతిథులు హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా, జాతీయ కార్యదర్శులు ప్రసంగించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. బ్రిటిషర్ల ఆలోచనతోనే బీజేపీ ముందుకు సాగుతోందని ఆరోపించారు. పేదల కోసం కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి.. జాతీయ ఉపాధి హామీ పథకం తీసుకొస్తే.. బీజేపీ ఈ పథకాన్ని రద్దు చేసిందని విమర్శించారు. రాజ్యాంగాన్ని చెరబట్టేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందన్నారు సీఎం రేవంత్. పేదల ఓట్లు తొలగించేందుకే S.I.R తీసుకొచ్చారన్నారు. శాశ్వతంగా అధికారంలో ఉండేందుకు బీజేపీ కుట్రలకు పాల్పడుతోందన్నారు.
ఇక 19న జాతీయ సమితి సమావేశం నిర్వహిస్తారు.త్వరలో జరిగే కేరళ,తమిళనాడు, పశ్చిమబెంగాల్, పుదుచ్చేరి ఎన్నికల్లో పార్టీ.. అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తారు. ఇక 20న నేటి భారతదేశం-వామపక్షాల ముందున్న సవాళ్లు’ అనే అంశంపై సదస్సు ఉంటుంది. ఇక 21న జరిగే సీపీఐ శతాబ్ది ముగింపు వేడుకలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొంటారు.
ఖమ్మం నగరమంతా ఎర్రెర్రని జెండాలతో రెపరెపలాడుతోంది.ఇవాళ భారీ బహిరంగ సభతో ఆరంభమయ్యే ఈ వేడుకలు ఈ నెల 21 వరకు కొనసాగుతాయి. సీపీఐ ప్రజాపోరాటాలు, చారిత్రక ఘట్టాలు కళ్లకు కట్టేలా శతాబ్ది వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు.
