Mythri Movie Makers: ఐదుగురు మెగా హీరోలతో సూపర్ హిట్స్.. సెంటిమెంట్ కలిసొస్తే పవన్ మూవీ సైతం
వాల్తేరు వీరయ్య సక్సెస్‌ను చిరంజీవి ఫ్యాన్స్ కంటే పవన్ కళ్యాణ్ అభిమానులే ఎక్కువగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దానికి కారణం అన్నయ్య సినిమా హిట్టైందని కాదు.. సెంటిమెంట్ రిపీట్ అయిందని. అదే వర్కవుట్ అయితే పవన్ సినిమా కూడా బ్లాక్‌బస్టర్ అవుతుందని వాళ్ల అంచనా. మరి పవన్ ఫ్యాన్స్‌ను అంతగా ఊరిస్తున్న ఆ సెంటిమెంట్ ఏంటి..?
చాలా ఏళ్ళ తర్వాత చిరంజీవి బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోస్తున్నారు. ఇంకా చెప్పాలంటే రీ ఎంట్రీ తర్వాత మెగా మేనియా మొదటిసారి థియేటర్ల ముందు కనిపిస్తుంది. ఆయన కోసం అభిమానులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా కదులుతున్నారు. అందుకే 5 రోజుల్లోనే 140 కోట్ల గ్రాస్ వసూలు చేసింది వాల్తేరు వీరయ్య. ఈ జోరు ఇలాగే సాగితే సినిమా 200 కోట్ల క్లబ్బులో చేరడం ఖాయం. వాల్తేరు వీరయ్య విజయంలో మరో సెంటిమెంట్ కూడా కలిసొచ్చింది.. అదే మైత్రి మూవీ మేకర్స్. ఒక్కో హీరోకు ఒక్కో నిర్మాణ సంస్థ బాగా కలిసొస్తుంటుంది. కానీ మొత్తం ఫ్యామిలీకే కలిసి రావడం మాత్రం అరుదు. మైత్రి మూవీ మేకర్స్, మెగా కుటుంబం విషయంలో ఇదే జరుగుతుంది. మెగా హీరోలు ఈ ప్రొడక్షన్ హౌజ్‌లో సినిమా చేసారంటే చాలు బొమ్మ బ్లాక్‌బస్టర్ అంతే. రామ్ చరణ్‌తో మొదలైన జైత్రయాత్ర.. చిరంజీవి వరకు సాగుతుంది.
2018లో రంగస్థలంతో మొదటిసారి మైత్రి మూవీ మేకర్స్‌లోకి మెగా హీరోలు ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ అయింది. ఇక 2019లో సాయి ధరమ్ తేజ్‌తో నిర్మించిన చిత్రలహరి మంచి విజయం సాధించింది. అప్పటికే అరడజన్ ఫ్లాపుల్లో ఉన్న తేజ్‌కు మైత్రి మూవీ మేకర్స్ సెంటిమెంట్ వర్కవుట్ అయింది. ఇక ఉప్పెన గురించి ఎంత చెప్పినా తక్కువే.. వైష్ణవ్ తేజ్ మొదటి సినిమాతోనే 100 కోట్లు కొట్టేసారు.
2021లో పుష్పతో అల్లు అర్జున్ బ్లాక్‌బస్టర్ అందుకున్నారు.. దీన్ని నిర్మించింది మైత్రి మూవీ మేకర్సే. 350 కోట్లకు పైగా వసూలు చేసింది పుష్ప. ఇప్పుడు చిరంజీవితో నిర్మించిన వాల్తేరు వీరయ్య సైతం సూపర్ హిట్ దిశగా అడుగులేస్తుంది. నెక్ట్స్ పవన్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మిస్తున్నారు ఈ నిర్మాతలు. హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కూడా బ్లాక్‌బస్టర్ అని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.