AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు

ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు

Samatha J
|

Updated on: Jan 19, 2026 | 9:23 AM

Share

ఒడిశాలో భారత పురాతన చరిత్రకు సంబంధించిన అత్యంత కీలకమైన ఆనవాళ్లు బయటపడ్డాయి. సంబల్‌పుర్ జిల్లాలోని రైరాఖోల్ ప్రాంతంలో ఉన్న భీమ మండలి గుహల్లో దాదాపు 15,000 ఏళ్ల క్రితం ఆదిమానవులు నివసించినట్లు ఆధారాలు లభించాయి. భారత పురావస్తు శాఖ చేపట్టిన తవ్వకాల్లో ఈ చారిత్రక సంపద వెలుగు చూసింది. పురావస్తు శాస్త్రవేత్తలు జరిపిన ఈ పరిశోధనల్లో, రాతి యుగానికి చెందిన పనిముట్లు, ఆయుధాలతో పాటు గుహల గోడలపై గీసిన అద్భుతమైన చిత్రాలు లభించాయి. ఈ ఆధారాలు సింధు లోయలోని హరప్పా, మొహెంజోదారో నాగరికతల కన్నా ఎంతో పురాతనమైనవి కావచ్చని నిపుణులు ప్రాథమికంగా అంచనా వేశారు.

ఈ ఆనవాళ్ల కచ్చితమైన వయస్సును నిర్ధారించేందుకు కార్బన్ డేటింగ్ పరీక్షల నిమిత్తం నమూనాలను పంపినట్లు అధికారులు వెల్లడించారు. గంగాధర్ మెహర్ యూనివర్సిటీ చరిత్ర విభాగం ప్రకారం, ఈ ప్రాంతంలో 45కు పైగా రాతి ఆవాసాలు ఉన్నాయి. ఇక్కడున్న చిత్రాల్లో ఆదిమానవుల జీవనశైలి, వేట దృశ్యాలు, జంతువుల బొమ్మలు కనిపిస్తున్నాయి. సహజసిద్ధమైన రంగులతో గీసిన ఈ చిత్రాలు నాటి మానవుల కళా నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ గుహలు మహాభారత కాలం నాటివిగా స్థానికులు నమ్ముతున్నప్పటికీ, శాస్త్రీయంగా ఇవి అంతకంటే ఎంతో ప్రాచీనమైనవని తేలింది. ఈ చారిత్రక ప్రదేశాన్ని జాతీయ వారసత్వ సంపదగా గుర్తించి, పర్యాటకంగా అభివృద్ధి చేయాలని చరిత్రకారులు, స్థానికులు కోరుతున్నారు. ఈ తవ్వకాలతో భారత ఉపఖండంలోని ఆదిమానవ చరిత్రకు సంబంధించి మరిన్ని కొత్త విషయాలు తెలిసే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు.