Team India: వన్డే సిరీస్‌లో అట్టర్ ఫ్లాప్.. కట్‌చేస్తే.. దేశవాళీ బాట పట్టిన ఇద్దరు.. ఎవరంటే?
Ranji Trophy 2026: అంతర్జాతీయ క్రికెట్‌లో ఒత్తిడి ఎదురైనప్పుడు ఆటగాళ్లు తిరిగి దేశవాళీ క్రికెట్‌కు వెళ్లడం ఉత్తమమైన మార్గం. గిల్, జడేజా తీసుకున్న ఈ నిర్ణయం వారి వ్యక్తిగత ఫామ్‌కే కాకుండా, భారత జట్టు భవిష్యత్తు ప్రణాళికలకు కూడా మేలు చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Shubman Gill, Ravindra Jadeja: న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఎదురైన చేదు అనుభవం తర్వాత, టీమ్ ఇండియా సీనియర్ ఆటగాళ్లు తమ తప్పులను సరిదిద్దుకునే పనిలో పడ్డారు. ముఖ్యంగా ఫామ్ లేమితో సతమతమవుతున్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తిరిగి రిథమ్ అందుకోవడానికి రంజీ ట్రోఫీని వేదికగా ఎంచుకున్నారు. జనవరి 22 నుంచి ప్రారంభం కానున్న రంజీ మ్యాచ్‌లో వీరిద్దరూ ప్రత్యర్థులుగా తలపడబోతున్నారు.
న్యూజిలాండ్‌తో సొంతగడ్డపై జరిగిన వన్డే సిరీస్‌ను 1-2తో కోల్పోవడం టీమ్ ఇండియాకు పెద్ద ఎదురుదెబ్బ. ఈ సిరీస్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన శుభ్‌మన్ గిల్, రవీంద్ర జడేజా, తమ ఫామ్‌ను తిరిగి పొందేందుకు దేశవాళీ క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నారు. జనవరి 22 నుంచి రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో పంజాబ్, సౌరాష్ట్ర జట్ల మధ్య జరగనున్న రంజీ మ్యాచ్‌లో వీరు పాల్గొననున్నారు.
గిల్ కెప్టెన్సీ, ఫామ్: టీమ్ ఇండియా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత శుభ్‌మన్ గిల్‌పై ఒత్తిడి పెరిగింది. న్యూజిలాండ్ సిరీస్‌లో రెండు హాఫ్ సెంచరీలు చేసినప్పటికీ, నిర్ణయాత్మకమైన మూడవ వన్డేలో విఫలం కావడం విమర్శలకు దారితీసింది. పంజాబ్ జట్టు తరపున బరిలోకి దిగుతున్న గిల్, భారీ ఇన్నింగ్స్ ఆడి తన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలని చూస్తున్నాడు. పంజాబ్ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో వెనుకబడి ఉండటంతో, గిల్ రాక ఆ జట్టుకు పెద్ద బూస్ట్ అని చెప్పవచ్చు.
జడేజాకు అగ్నిపరీక్ష: మరోవైపు, సీనియర్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు ఈ రంజీ మ్యాచ్ అత్యంత కీలకం. న్యూజిలాండ్ వన్డే సిరీస్‌లో జడేజా ఘోరంగా విఫలమయ్యాడు. మూడు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 43 పరుగులు మాత్రమే చేయడమే కాకుండా, ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. 37 ఏళ్ల వయసులో ఉన్న జడేజా ఫామ్ ఇలాగే కొనసాగితే అతని కెరీర్‌పై ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే తన సొంత గడ్డ అయిన రాజ్‌కోట్‌లో జరిగే మ్యాచ్‌లో సత్తా చాటాలని జడ్డూ పట్టుదలతో ఉన్నాడు.
ముఖాముఖి పోరు – అభిమానుల్లో ఆసక్తి: ఒకవైపు పంజాబ్ తరపున గిల్, మరోవైపు సౌరాష్ట్ర తరపున జడేజా తలపడనుండటం క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో కలిసి ఆడే ఈ ఇద్దరు స్టార్స్, ఇప్పుడు దేశవాళీ క్రికెట్‌లో ప్రత్యర్థులుగా ఎలా ఆడతారనేది చూడాలి. రాబోయే టెస్టు సిరీస్‌లు, ఛాంపియన్స్ ట్రోఫీని దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ సెలెక్టర్లు కూడా ఈ మ్యాచ్‌ను నిశితంగా గమనించనున్నారు.




