Swag Movie Review: ‘స్వాగ్’ సినిమా రివ్యూ.. శ్రీవిష్ణు నట విశ్వరూపం.. మూవీ ఎలా ఉందంటే..
సామజవరగమన, ఓం భీం బుష్ లాంటి హిట్స్ తర్వాత శ్రీ విష్ణు నుంచి వచ్చిన సినిమా స్వాగ్. రాజ రాజ చోర తర్వాత హసిత్ గోలీ కాంబినేషన్‌లో విష్ణు చేసిన సినిమా ఇది. అచ్చ తెలుగు సినిమా అంటూ వచ్చిన స్వాగ్ ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..
మూవీ రివ్యూ: స్వాగ్
నటీనటులు: శ్రీ విష్ణు, రితూ వర్మ, సునీల్, మీరా జాస్మిన్, దక్షా నగార్కర్, రవిబాబు, వాసు ఇంటూరి తదితరులు
సినిమాటోగ్రఫీ: వేదరామన్ శంకరన్
సంగీతం: వివేక్ సాగర్
ఎడిటర్: విప్లవ్ నైషధం
కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: హసిత్ గోలీ
నిర్మాత: టిజి విశ్వప్రసాద్
సామజవరగమన, ఓం భీం బుష్ లాంటి హిట్స్ తర్వాత శ్రీ విష్ణు నుంచి వచ్చిన సినిమా స్వాగ్. రాజ రాజ చోర తర్వాత హసిత్ గోలీ కాంబినేషన్‌లో విష్ణు చేసిన సినిమా ఇది. అచ్చ తెలుగు సినిమా అంటూ వచ్చిన స్వాగ్ ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..
కథ:
1551లో వింజామర వంశపు పాలన ఉంటుంది. ఆ వంశ మహారాణి రుక్మిణీ దేవి (రీతు వర్మ) మగాళ్లని కాలి కింద చెప్పులా తొక్కి పెడుతుంది. చివరికి ఆమె భర్త భవభూతి మహారాజు (శ్రీవిష్ణు 1)ను కూడా దారుణంగా చూస్తుంది. అందుకే ఓ పన్నాగంతో వింజామర వంశాన్ని అంతం చేసి.. తన శ్వాగణిక వంశాన్ని అభివృద్ధి చేస్తూ.. పురుషాధిక్యతను చూపిస్తాడు భవభూతి. ఓ 500 ఏళ్ళ తర్వాత SI గా పని చేసి రిటైర్ అవుతుంటాడు అదే శ్వాగణిక వంశపు వారసుడు అయిన భవభూతి (శ్రీవిష్ణు 2). వారసత్వం కోసం మళ్లీ అదే పన్నాగాలు పన్నుతుంటాడు. ఈ కథ ఇలా సాగుతుండగానే.. సింగరేణి అలియాస్ సింగ ( శ్రీవిష్ణు 3) సీన్‌లోకి ఎంట్రీ ఇస్తాడు. ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు అంతా శ్వాగణిక వంశవృక్షం దగ్గరికి చేరుకుంటారు. అక్కడ ఓ పెద్ద నిధి ఉంటుంది. దానికోసం మేమంటే నేనే వారసుడిని అంటూ వచ్చిన భవభూతికి.. అక్కడ ఊహించని షాక్ తగులుతుంది. ఆ నిధి దక్కించుకోవడం కోసం అనుభూతి (రీతు వర్మ 2) కూడా అక్కడికి చేరుకుంటుంది. అక్కడికి వచ్చిన తర్వాతే తన తండ్రి యయాతి (శ్రీవిష్ణు 4) అని తెలుసుకుంటాడు భవభూతి. కథ అంతా చాలా కన్ఫ్యూజింగ్‌గా అనిపిస్తుంది కదా.. ఇక్కడ ఉన్న ఒక్క థ్రెడ్ రివీల్ చేసినా ట్విస్టులు అన్నీ తెలిసిపోతాయి.. అసలు వీళ్ళంతా ఎవరు అనేది స్క్రీన్ మీదే చూడాలి..
కథనం:
కొన్ని సినిమాలు ఐడియా పరంగా అద్భుతంగా ఉంటాయి. అది స్క్రీన్ మీదకు వచ్చేసరికి కన్ఫ్యూజింగ్‌గా మారుతుంటాయి. స్వాగ్ అలాగే అనిపించింది. ఆలోచన పరంగా.. కథగా స్వాగ్ కొత్తగా ఉంది.. అందులో అనుమానం లేదు. అయితే అది తెరకెక్కిన విధానం మాత్రం అంత కొత్తగా అనిపించలేదు. దర్శకుడు హసిత్ గోలీ చెప్పాలనుకున్న పాయింట్ చాలా బాగుంది. ఆడ, మగ, ట్రాన్స్‌జెండర్ ఇలా ఏ తేడా లేదు.. అందరూ మనుషులే అని చెప్పాలనుకున్నాడు. ఐడియా వరకు చాలా బాగా రాసుకున్నాడు.. కానీ స్క్రీన్ ప్లే మాత్రం కలగాపులగం అయిపోయింది. ఫస్టాఫ్ సరదాగా వెళ్లిపోయింది.. ఎస్పెషల్లీ శ్రీ విష్ణు కామెడీ టైమింగ్ సూపర్. మనోడు అర్థమై కాకుండా మాట్లాడే కొన్ని డైలాగులు భలే నవ్వు తెప్పిస్తుంటాయి. ఇందులోనూ అలాగే చేసాడు శ్రీ విష్ణు. ఇంటర్వెల్ అయితే మ్యాడ్ అంతే.. పిచ్చెక్కినట్లు రాసుకున్నాడు ఆ స్క్రీన్ ప్లే.. ఈ కథను ఇంకా హిలేరియస్‌గా కూడా చెప్పొచ్చేమో..
దర్శకుడు హసిత్ గోలీ మాత్రం ఎమోషనల్ దారిని ఎంచుకున్నాడు ఎందుకో మరి..? అక్కడక్కడా వచ్చే నవ్వులు తప్ప.. దర్శకుడు చెప్పినట్లు కడుపులు చెక్కలైతే కావు. జెండర్ బేస్డ్ కథ అన్నపుడు.. కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. వాటిని చాలా వరకు చాలా సేఫ్‌గా దాటేస్తూ వచ్చాడు దర్శకుడు హసిత్ గోలీ.. సెకండాఫ్ మాత్రం పూర్తిగా ఎమోషనల్ టర్న్ తీసుకుంది.. స్లో నెరేషన్ ఇబ్బంది పెడుతుంది. మీరా జాస్మిన్ చుట్టూ అల్లుకున్న కథ బాగుంది. అయితే ఆ ఎపిసోడ్ చాలా ల్యాగ్ అయినట్లు అనిపిస్తుంది. ఎటు చూసిన శ్రీ విష్ణునే కథలో కనిపిస్తుంటాడు. అందుకే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ కూడా ఎక్కువగానే ఉంటుంది.
నటీనటులు:
శ్రీ విష్ణు అయితే నెక్ట్స్ లెవల్.. మనోడు నిజంగానే కింగ్ ఆఫ్ కంటెంట్. చేసిన నాలుగు పాత్రలకు ప్రాణం పోసాడు. మరీ ముఖ్యంగా సింగ పాత్రతో చాలా నవ్వించాడు. మరో సర్‌ప్రైజింగ్ కారెక్టర్ ఉంది.. అది అదుర్స్. ఇలాంటి కథను ఎంచుకున్నాడంటేనే శ్రీ విష్ణు ధైర్యానికి మెచ్చుకోవచ్చు.. హీరోయిన్లు రితూ వర్మ, మీరా జాస్మిన్, దక్ష నగార్కర్ కూడా చాలా బాగా నటించారు. సునీల్ ఉన్నంతలో బెటర్. రవిబాబు చాలా కాలం తర్వాత మంచి పాత్రలో నవ్వించాడు. మిగిలిన వాళ్ళంతా పాత్రల పరిధి మేరకు నటించారు.
టెక్నికల్ టీం:
స్వాగ్ సినిమాకు మెయిన్ అడ్వాంటేజ్ వివేక్ సాగర్ మ్యూజిక్. ఆర్ఆర్ అదిరిపోయింది.. పాటలు కూడా పర్లేదు. ఎడిటింగ్ కాస్త వీక్.. ఎందుకో మరి దర్శకుడు హసిత్ కొన్ని సీన్స్ దగ్గర పట్టు వదల్లేదు. ల్యాగ్ అనిపించిన సీన్స్ కొన్ని తీసుంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఇక హసిత్ గురించి చెప్పాలి.. ఇలాంటి ఐడియాతో సినిమా అంత ఈజీ కాదు.. కానీ ధైర్యం చేసాడు. జెండర్ ఈక్వాలిటీ కథలు చెప్పడం కష్టమే.. కానీ ట్రై చేసాడు ఈ దర్శకుడు.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా స్వాగ్.. ఐడియా అద్భుతం.. ఆచరణ అంతంతమాత్రం..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.