Pushpaka Vimanam Review: ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలని… వినోదంతో కలిపి సెన్సిటివ్‌గా చెప్పిన ‘పుష్పక విమానం’
Pushpaka Vimanam Movie Review: ప్రతి వారం రిలీజయ్యే సినిమాల మీద తప్పకుండా సినీ ప్రేమికులు ఓ లుక్కేసి ఉంచుతారు. అదే... కొందరు హీరోల సినిమాలు ఎప్పుడు రిలీజ్‌కి వస్తున్నాయా..
Pushpaka Vimanam Movie Review: ప్రతి వారం రిలీజయ్యే సినిమాల మీద తప్పకుండా సినీ ప్రేమికులు ఓ లుక్కేసి ఉంచుతారు. అదే… కొందరు హీరోల సినిమాలు ఎప్పుడు రిలీజ్‌కి వస్తున్నాయా అని స్పెషల్ ఫోకస్ ఆటోమేటిగ్గా క్రియేట్ అవుతుంది. కెరీర్ ప్రారంభించిన కొన్నేళ్లకే అలాంటి స్పెషల్ ఫోకస్ తెచ్చుకున్న హీరో ఆనంద్ దేవరకొండ. రొటీన్ మూసకొట్టుడు కథలకు దూరంగా, తన ఫిజిక్‌కి, ఇమేజ్‌కి సూటయ్యే కథలను, సెన్సిటివ్‌గా చెప్పే సన్నటి అంశాలను సెలక్ట్ చేసుకుంటున్నారు ఆనంద్. తాజాగా ఆయన చేసిన సినిమా పుష్పక విమానం. పెళ్లాం లేచిపోవడం అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు మొదటి నుంచీ మంచి బజ్ క్రియేటైంది.
సినిమా: పుష్పక విమానం నిర్మాణ సంస్థలు: కింగ్ ఆఫ్ ది హిల్, టాంగా ప్రొడక్షన్స్ నటీనటులు: ఆనంద్ దేవరకొండ, గీత్ సైనీ, శాన్వి మేఘన, సునీల్, హర్షవర్ధన్, నరేష్, గిరి, కిరీటి, మీనా తదితరులు కెమెరా: హెస్టిన్ జోస్ జోసెఫ్, ఆర్ట్: నీల్ సెబాస్టియన్ ప్రొడ్యూసర్స్: గోవర్ధన్‌రావు దేవరకొండ, విజయ్ మిట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి సమర్పణ: విజయ్ దేవరకొండ రచన – దర్శకత్వం: దామోదర విడుదల: 12.11.2021
సుందర్ (ఆనంద్ దేవరకొండ) ఓ ప్రభుత్వ పాఠశాలలో లెక్కల మాస్టారుగా పనిచేస్తుంటాడు. మిడిల్ క్లాస్ మనస్తత్వం అతనిది. ఇంట్లో వాళ్లు చూసిన పెళ్లి చేసుకుంటాడు. మీనాక్షి (గీత్ సైనీ) మెడలో మూడు ముళ్లు వేసిన తర్వాత ఎనిమిది రోజులకు సిటీకి తీసుకొస్తాడు. అప్పటిదాకా అమ్మాయిలతో పెద్దగా మాట్లాడని సుందర్‌కి భార్యతో ఎలా మాట్లాడాలో తెలియక, శోభనం రోజు నోరు జారుతాడు. దాంతో హర్ట్ అయిన అమ్మాయి అతన్నుంచి దూరంగా వెళ్లిపోతుంది. ఆమె వెళ్లడానికి అదొక్కటే కారణమా? ఇంకేమైనా ఉందా? ఆమె బాయ్‌ఫ్రెండ్ బంగారం సంగతేంటి? జిమ్ ఓనర్ రాఖీ పరిస్థితి ఏంటి? మధ్యలో మీనాక్షి ప్లేస్‌కి షిఫ్ట్ అయిన రేఖ ఎవరు? పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఇన్వెస్టిగేషన్‌లో తేలిందేంటి? సుందర్ ఉంటున్న అపార్ట్ మెంట్ వాచ్‌మేన్ కొడుకు, ఎదురు ఫ్లాట్ మ్యూజిక్ డైరక్టర్, స్కూల్లో పనిచేసే కొలీగ్స్, మీనాక్షి ఫ్రెండ్, ట్రావెల్ ఏజెన్సీ పర్సన్… వీళ్లందరికీ మీనాక్షి సుందర్ కథతో సంబంధం ఏంటి? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
ఆనంద్ దేవరకొండ ఈ కథను సెలక్ట్ చేసుకోవడంతోనే సక్సెస్ అయినట్టు. ఇలాంటి కథలు తెరమీద చూసినప్పుడు ఓకేగానీ, ఫస్ట్ టైమ్ వినగానే పెద్దగా కన్విన్సింగ్‌గా ఉండవు. అలాంటిది కథను నమ్మి ఈ సినిమా చేయడంతోనే మేకర్స్ గట్స్ అర్థమైపోతాయి. సుందర్ కేరక్టర్‌లో ఆనంద్ చాలా బాగా చేశాడు. ముఖ్యంగా భార్యతో గొడవపడే సన్నివేశాలు, భార్య కోసం పోలీసుల చుట్టూ తిరిగే సందర్భాలు అన్నీ బావున్నాయి. ఆల్రెడీ ఒకరిని ప్రేమించి, ఇంట్లో వాళ్ల బలవంతం మీద పెళ్లి చేసుకున్న అమ్మాయి మ్యారీడ్ లైఫ్ లో ఏం జరిగింది? పెళ్లి తర్వాత వచ్చే కన్‌ఫ్యూజన్స్ ని ఎలా తట్టుకుందని చెప్పే సీన్లలో గీత్ సైనీ పెర్ఫార్మెన్స్ బావుంది. శాన్వి మేఘన యాక్టింగ్ యూత్‌కి కనెక్ట్ అవుతుంది. అక్కడక్కడా నవ్వులు కురిపించింది.
సౌందర్యపోషణ మీద ధ్యాస ఉన్న పోలీస్ ఆఫీసర్‌గా సునీల్ కేరక్టర్ పేలింది. సునీల్‌కి, శాన్వికి మధ్య వచ్చే సన్నివేశాలు బావున్నాయి. స్కూల్లో టీచర్ల మధ్య జరిగే సరదా సన్నివేశాలు, మన టీచర్ల ఫ్యామిలీస్ అని నరేష్ అనే తీరు నవ్వు తెప్పిస్తాయి.పుష్పక్ ట్రావెల్స్ ఎంప్లాయిగా భద్రం, హీరో ఫ్రెండ్‌గా కిరీటీ బాగా నటించారు.
లొకేషన్లు కూడా కథకు అనుగుణంగానే సెట్ అయ్యాయి. రీరికార్డింగ్ బావుంది. మన చుట్టూ ఉన్న సమాజంలో మంచీ చెడులు అన్నీ కలగలిసే ఉంటాయి. మంచీ చెడుల్ని గుర్తించి, వాటికి తగ్గట్టు ప్రవర్తించాల్సింది మనమే. ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని చెప్పే సినిమా పుష్పక విమానం. సన్నటి కథ తీసుకుని హాస్యపు సన్నివేశాలతో అల్లుకున్నారు.
కొన్ని షాట్స్ అక్కడక్కడా రిపీట్ అయినట్టు అనిపించాయి. ఎడిటింగ్, రీరికార్డింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుని ఉంటే బావుండేది. సెన్సిటివ్ సినిమాలను, రియలిస్టిక్ మూవీస్‌ని ఇష్టపడేవారికి పుష్పక విమానం నచ్చుతుంది.
– డా. చల్లా భాగ్యలక్ష్మి, టీవీ9
Read More Reviews..
Rajinikanth’s Peddanna Review: చెల్లెలి కోసం అన్న పడే ఆరాటం ‘పెద్దన్న’