Manchi Rojulu Vachayi Review: తండ్రి భయం.. కూతురి ప్రేమ.. ధైర్యం చెప్పే అల్లుడు..`మంచి రోజులు వచ్చాయి`
Manchi Rojulu Vachayi Review: పక్కా మారుతి బ్రాండ్ సినిమా అని గట్టిగా చెప్పి పబ్లిసిటీ చేసిన సినిమా మంచి రోజులు వచ్చాయి. సంతోష్ శోభన్, మెహ్రీన్ జంటగా నటించిన..
Manchi Rojulu Vachayi Movie Review: పక్కా మారుతి బ్రాండ్ సినిమా అని గట్టిగా చెప్పి పబ్లిసిటీ చేసిన సినిమా మంచి రోజులు వచ్చాయి. సంతోష్ శోభన్, మెహ్రీన్ జంటగా నటించిన మంచి రోజులు వచ్చాయి నిజంగా మారుతి మార్క్ సినిమానా? లేకుంటే ట్రైలర్‌లో ఉన్న కంటెంట్‌కి జస్ట్ ఎలాబరేషనా? చదివేయండి
సినిమా: మంచి రోజులు వచ్చాయి నిర్మాణం: వీ సెల్యులాయిడ్, ఎస్.కె.ఎన్. దర్శకత్వం: మారుతి నటీనటులు: సంతోష్ శోభన్, మెహ్రీన్, వెన్నెల కిశోర్, సప్తగిరి, వైవా హర్ష, శ్రీనివాసరెడ్డి, అజయ్ ఘోష్, ప్రవీణ్ తదితరులు సంగీతం: అనూప్ ఎడిటింగ్: ఉద్ధవ్ కెమెరా: సాయి శ్రీరామ్ విడుదల: 4.11.2021
ఎంత చదువుకున్నా, ఎంత పెద్ద ఉద్యోగం చేసినా కూతురు తన మాట జవదాటదని అనుకునే తండ్రి గోపాలం (అజయ్ ఘోష్), అప్పటికే కొలీగ్ సంతోష్( సంతోష్ శోభన్)తో మూడేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్న కూతురు పద్మజ (మెహ్రీన్). వాళ్లదో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఉన్నంతలో హ్యాపీగా ఉండే కుటుంబం. అయితే గోపాలం ఆనందాన్ని చూసి ఆ కాలనీలో ఉన్న కోటి, మూర్తి తట్టుకోలేరు. ఆయనకున్న భయం అనే బలహీనతను వాడుకుని, అస్తమానం భయపెడుతూనే ఉంటారు. గోపాలాన్ని ఏడిపించడానికి వాళ్లు పద్మ గురించి ఏం చెప్పారు? గోపాలానికి, సంతోష్‌కి అసలు గొడవ ఎందుకు వచ్చింది? మధ్యలో అప్పడాల విజయలక్ష్మి ఎవరు? ఈ సినిమాకీ, కరోనాకీ సంబంధం ఏంటి? పిలవకుండా వచ్చే ఆంబులెన్సుల మాటేంటి?అవన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
అమ్మాయిలకు చదువుచెప్పించి, చనువిచ్చి, స్వేచ్ఛగా ఉండనిచ్చే తండ్రులు సమాజంలో చాలా మందే ఉన్నారు. కానీ చెప్పుడు మాటల వల్ల సందేహాలు మొదలవుతాయి. మంచి రోజులు వచ్చాయి సినిమాలో మారుతి చెప్పింది కూడా అదే. మూడేళ్లు రిలేషన్‌షిప్‌లో ఉన్న అమ్మాయి చెయిజారిపోతుందని యువకుడు బాధపడితే, పాతికేళ్లు కంటిపాపలా పెంచుకున్న తండ్రి పడే ఆరాటంలో తప్పేముంది? అని. మనిషిలో రకరకాల భావోద్వేగాలు ఉంటాయి. అన్నిటినీ పక్కనపెట్టి ఏ ఒక్కదానికో కనెక్ట్ అయిపోయి, వాటికి అతిగా విలువ ఇచ్చి జీవితాన్ని క్లిష్టతరం చేసుకోకూడదన్నది ఇందులో చెప్పిన మరో మాట. ఎవరు బతుకు వాళ్లు బతుకుతున్నా చూసి ఓర్వలేని వాళ్లు మన చుట్టూనే ఉంటారు. వాళ్ల అభిప్రాయాలకు విలువ ఇచ్చి ఉన్న మనశ్శాంతిని పాడుచేసుకోకూడదన్నది వాలిడ్ పాయింట్. అనారోగ్యంతో హాస్పిటల్‌కి చేరిన వారితో ఆప్యాయంగా చెప్పే రెండు మాటలు వాళ్లలో ఆశను రేకెత్తిస్తాయన్నది ఇంకో పాయింట్.
ఇలా పాయింట్లుగా చూసుకుంటే బాగానే ఉంది. అప్పడాల విజయలక్ష్మి, యువీ క్రియేషన్స్ ఏక్ మినీ ప్రేమకథ, హాస్పిటల్‌కి వెళ్దామంటే పట్టుచీరకట్టుకొచ్చే సీన్.. ఇలా అక్కడక్కడా మాస్‌ని నవ్వించే విషయాలు ఉన్నాయి. అయితే తీసుకున్న కథని కనెక్ట్ చేయడానికి రాసుకున్న సీన్లలో బలం లేదనిపిస్తుంది. సప్తగిరి ట్రాక్ ఐడియా బావుంది. కానీ దాన్ని కథలో సరిగా కనెక్ట్ చేయలేకపోయారు. అలాగే అప్పటిదాకా వీక్ హార్ట్ మీద నడుస్తున్న కథలో సడన్‌గా కరోనాని ఇరికించడం కూడా కన్విన్సింగ్‌గా అనిపించదు. డ్రామా ఎక్కువైపోయి, కొన్ని సీన్లలో చిరాకు పుడుతుంది.
మారుతి సినిమా అంటే పాటలు, ఆర్ ఆర్ బావుంటుందనే పేరుంది. కానీ ఈ సినిమాలో ఆ ఏరియా కూడా వీక్‌గానే అనిపించింది. కరోనా గురించి హీరో చెప్పగానే ఫ్లైట్‌కి టైమ్ అవుతుందని హీరోయిన్ అనడం అంత యాప్ట్ గా లేదు. ఇలాంటి సీన్స్ సినిమాలో అక్కడక్కడా తగులుతూనే ఉంటాయి. ఎడిటింగ్ విషయంలో డబుల్ కేర్ తీసుకుని ఉంటే బావుండేది. కరోనా పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు హాస్పిటల్లో ఐసీయూ వార్డుల్లో పీపీఈ కిట్లు లేకుండా పేషెంట్ అటెండర్స్ ని అలో చేసే పరిస్థితే లేదు. ఇలాంటి ప్రాక్టికల్ విషయాల మీద ఇంకాస్త ఫోకస్ చేసి ఉండాల్సింది.
కథలో దమ్ము, సీన్లలో ఇంటెన్స్ మిస్ అయిన ఫీలింగ్ కలిగింది. మంచి రోజులు వచ్చాయి పాట అలా సడన్‌గా వచ్చినట్టే అనిపించింది. డైలాగులు, కెమెరా వర్క్ ని అందరూ మెచ్చుకుంటారు. తండ్రి భయం, కూతురి ప్రేమ, అల్లుడు చెప్పే ధైర్యం… మంచి రోజులు వచ్చాయి… సింపుల్‌గా ఇంతే. లాజిక్కులు లాగకుండా, గొప్ప కథ కోసం పెద్దగా ఎక్స్ పెక్టేషన్స్ లేకుండా వెళ్తే టైమ్ పాస్ చేయొచ్చు.
– డా. చల్లా భాగ్యలక్ష్మి
Also Read..
Jai Bhim Review: ప్రశ్నించే గళం ఉంటే… ఫలితం తప్పకుండా ఉంటుందనే `జై భీమ్`
Varudu Kaavalenu Review: చెప్తే అలుసైపోతారేమో… చెప్పకుంటే మిస్ అయిపోతారు… వరుడు కావలెను కాన్సెప్ట్!