Jai Bhim Review: ప్రశ్నించే గళం ఉంటే… ఫలితం తప్పకుండా ఉంటుందనే `జై భీమ్`
Jai Bhim Movie Review: సామాజిక అసమానతలు, ఒక వర్గాన్ని మరో వర్గం తక్కువగా చూడటం అనేది మన దేశంలో కొత్తేమీ కాదు. అనాదిగా జరుగుతున్న విషయమే.
Jai Bhim Movie Review: సామాజిక అసమానతలు, ఒక వర్గాన్ని మరో వర్గం తక్కువగా చూడటం అనేది మన దేశంలో కొత్తేమీ కాదు. అనాదిగా జరుగుతున్న విషయమే. అయితే కాలక్రమేణ ఇందులో కొంత మార్పు కనిపిస్తోంది. కానీ రాజ్యాంగం కల్పించిన హక్కులు అందరికీ అందుబాటులో ఉండటం లేదు. అందుకు కారణం చదువు లేకపోవటం, అవగాహన లేమి. తెలియజెప్పేవారు, పోరాడేవారు,,అండగా నిలుచునే వారు లేకపోవటమే. అయితే కొందరు మాత్రం ఈ సామాజిక అసమానతలను పొగొట్టడానికి తమ వంతు కృషి చేస్తూనే ఉన్నారు. అలాంటి ఓ రియల్ హీరో.. లాయర్ చంద్రు కథే ‘జై భీమ్’. ఈ సినిమాలో చంద్రు పాత్రలో హీరో సూర్య నటించారు. ఈయనకు అటు తమిళంతో పాటు ఇటు తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి ఆదరణ ఉంది. నటుడిగానే కాదు నిర్మాతగానూ ఆయన న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తూ 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై టి.జె.జ్ఞానవేల్ దర్శకత్వంలో ‘జై భీమ్’ సినిమాను రూపొందించారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది? చంద్రు పాత్రలో సూర్య నటన ఎలా ఉంది? తెలియాలంటే సినిమా కథలోకి వెళదాం…
గిరిజనుడైన రాజన్న(మణికందన్) తన భార్య సినతల్లి(లిజో మోల్ జోసె)తో కలిసి ఊరి బయట నివసిస్తుంటాడు. అతనికి ఐదేళ్ల పాప ఉంటుంది. సినతల్లి గర్భవతిగా ఉంటుంది. అలాగే అతనితో పాటు మరికొంత మంది గిరిజనులు కూడా ఊరి బయటే ఉంటారు. వారికి తమదంటూ చెప్పుకోవడానికి ఓ స్థలం కానీ, గుర్తింపు కానీ ఉండదు. దీనికి తోడు వారిని ఊర్లోకి రానివ్వరు ఊరి పెద్దలు. అయినా కూడా అవేవీ పట్టించుకోకుండా అందరూ కష్టపడి కూలీ నాలీ చేసుకుని బతుకుతుంటారు. చేలలో ఎలుకలు, పాములను కూడా పట్టుకునే పనులు కూడా చేస్తుంటారు. ఓసారి అధికార పార్టీకి చెందిన నాయకుడు, ఊరి పెద్ద ఇంట్లోకి పాము వస్తుంది. దాంతో ఆయన రాజన్నకు కబురు పెడతాడు. అతను వచ్చి పామును పట్టుకుంటాడు. ఆ మరుసటి రోజు రాజన్న వేరే ఊర్లో ఇటుకల బట్టిలోకి పనికి వెళ్లిపోతాడు. రాజన్న ఊర్లో లేని రోజునే ఇంటి పెద్ద ఇంట్లో దొంగతనం జరుగుతుంది. నగలను దోచుకెళ్తారు. పోలీసులకు రాజన్న మీద కంప్లైంట్ ఇస్తాడు ఊరి పెద్ద. రాజన్న ఊర్లో ఉండకపోవడంతో అతని మనుషులను ఆడ, మగ అని చూడకుండా పోలీసులు లాకప్‌లో వేసి చిత్ర హింసలు పెడతారు. ఈలోపు రాజన్న కూడా ఊర్లోకి రావటంతో అతన్ని కూడా దొంగతనం కేసులో అరెస్ట్ చేసి చిత్ర హింసలు పెడతారు. సిన తల్లి గర్భవతి అని చూడకుండా ఇబ్బందులకు గురి చేస్తారు. వీటిని అందరూ మౌనంగానే భరిస్తుంటారు. ఆ మరుసటి రోజు రాజన్న మరో ఇద్దరితో కలిసి పారిపోయాడని చెబుతూ పోలీసులు ముగ్గురు కోసం వెతకడం మొదలు పెడతారు. ఎంత వెతికినా ఆ ముగ్గురు కనిపించరు. భర్త ఏమయ్యాడో… సినతల్లికి ఏం చేయాలో తెలియదు. అప్పుడు తమకు చదువు చెప్పే టీచర్ మిత్ర(రజిషా విజయన్) సాయంతో లాయర్ చంద్రు(సూర్య)ని కలిసి తన బాధలన్నింటినీ చెప్పుకుంటుంది. కేసులో సాక్ష్యాలన్నిరాజన్న దోషి అని చెబుతుంటాయి. మరో వైపు రాజన్న కనపడకుండా పోతాడు. అప్పుడు చంద్రు ఓ ఆలోచన చేస్తాడు? ఇంతకీ చంద్రు ఆలోచన ఏంటి? సినతల్లి, రాజన్నలకు న్యాయం జరుగుతుందా? కేసు విచారణలో చంద్రుకు ఎదురయ్యే సవాళ్లు ఏంటి? అనే విషయాలను తెలుసుకోవాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.
ఇంతకు ముందు ప్రస్తావించినట్లు గిరిజనులకు అండగా నిలుచున్న లాయర్ చంద్రు కథే ‘జై భీమ్’. పోలీసులు, కేసులు, కోర్టులు అంటూ సాగే కథ. కమర్షియల్ అంశాలకు పెద్దగా ప్రాధాన్యం ఉండదు. కథలోని పాత్రలు, ఎమోషన్స్‌ను ఆధారంగా చేసుకుని సినిమాను హృద్యంగా, ప్రేక్షకులు మెచ్చేలా తెరకెక్కించాలి. దర్శకుడు టి.జె.జ్ఞానవేల్ చెప్పిన ఈ కథను విని, నచ్చి నిర్మించడానికి ముందుకు వచ్చిన సూర్య, జ్యోతికలను అభినందించాలి. ఎందుకంటే దర్శకుడి మొదటి విజయం నిర్మాతకు కథ నచ్చడమే. ఆ విషయంలో జ్ఞానవేల్ సక్సెస్ అయ్యారు . సినిమాలో ప్రధాన పాత్రలను ఎమోషనల్‌గా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా అద్భుతంగా తెరకెక్కించారు. పోలీసులు బాధితులను ఇబ్బంది పెట్టే సన్నివేశాలను చూస్తే ప్రేక్షకుడికి అయ్యో! అనిపించకమానదు. రాజన్నను, అతని భార్య సినతల్లిని, ఇతరులను కేసు విషయంలో పోలీసులు బాధ పెట్టే తీరుని తెరపై చూసినప్పుడు నిజంగానే ఇలాంటివి జరుగుతాయా? అనే సిట్యువేషన్స్ ఫస్టాఫ్‌లో మనకు కనిపిస్తుంది. దర్శకుడు ఆ సన్నివేశాలను డెప్త్‌తో తెరకెక్కించారు. అలా చేయడం వల్ల తదుపరి సన్నివేశాల్లోని ఎమోషనల్ పాయింట్స్‌కు ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడని ఆయన భావించి ఉండొచ్చు. తన భావన నిజమైంది. డైరెక్టర్ విజన్‌కు తగ్గట్లు కదిర్ సన్నివేశాలను తన కెమెరాలో బంధించిన తీరు అభినందనీయం. సీయాన్ రోల్డన్ పాటలు తెలుగులో అంతగా కనెక్ట్ కావు.. కానీ నేపథ్య సంగీతం బావుంది.
సూర్య ఓ మంచి కథను, రియల్ హీరో కథను ప్రేక్షకులకు చూపించాలనుకున్నారు. చంద్రు పాత్రలో ఎక్కడా హీరోయిజం ఉండదు. మనం చూసే మామూలు లాయర్ పాత్రే. సొంత సినిమానే కదా, రెండు ఫైట్స్, పాటలు, ఓ లవ్ ట్రాక్ పెట్టుకుని ఉండి ఉండొచ్చు సూర్య. కానీ, ఆయన దానికి స్కోప్ ఇవ్వలేదు. తను చెప్పాలనుకున్న కథను స్ట్రయిట్‌గా చెప్పాలనుకున్నారు. సినిమా ప్రారంభమైన అరగంటకు హీరో పాత్ర మనకు కనిపిస్తుంది, సినిమాలో మరో ప్రధాన పాత్ర. సినతల్లి ఈ పాత్రను లిజో మోల్ జోసె అద్భుతంగా పోషించారు. నిజానికి సినిమా అంతా ఆమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఆ పాత్రలో లిజో మోల్ జోస్ అంత అమాయకంగా, ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యేలా ఒదిగిపోయారు. అలాగే రాజన్న పాత్రను మణి కందన్ చేసిన తీరు బావుంది.
న్యాయం పక్షాన నిలుచునే పోలీస్ ఆఫీసర్ పెరుమాల్ పాత్రలో ప్రకాశ్ రాజ్..ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ పాత్రలో రావు రమేశ్ అద్భుతంగా నటించారు. ఈ పాత్రలు కాసేపే కనిపిస్తాయి. అయితే కథా గమనంలో చక్కటి ఇంపాక్ట్‌ను చూపిస్తాయి. సినిమాలో నటించిన ఇతర నటీనటులు అందరూ వారి వారి పాత్రల పరిధుల మేరకు చక్కగా నటించారు.
సినిమా ఫస్టాఫ్ అంతా పోలీస్ స్టేషన్, అమాయకులను వారు పెట్టే ఇబ్బందులు.. ఇలా సాగుతుంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమా ప్రేక్షకులకు ఇవి నచ్చవు. కొన్ని సన్నివేశాలు కొందరికి ఇబ్బందిగానూ అనిపిస్తాయి. అక్కడక్కడా ల్యాగ్‌లుంటాయి. పది, పదిహేను నిమిషాలు ఎడిట్ చేసుంటే సినిమా కాస్త స్పీడుగా ఉండేదనిపిస్తుంది. నేచురల్ సినిమాలను ఇష్టపడేవారికి మాత్రం జై భీమ్ నచ్చుతాడు.
– డా. చల్లా భాగ్యలక్ష్మి
Also Read..
Varudu Kaavalenu Review: చెప్తే అలుసైపోతారేమో… చెప్పకుంటే మిస్ అయిపోతారు… వరుడు కావలెను కాన్సెప్ట్!
Pelli SandaD Movie Review: పాత పెళ్లి సందడిని గుర్తుచేసిన… పెళ్లి సందD