Rajinikanth’s Peddanna Review: చెల్లెలి కోసం అన్న పడే ఆరాటం ‘పెద్దన్న’

Peddanna Review: రజనీ కాంత్‌ సినిమా, అందులోనూ చెల్లెలిగా కీర్తీ సురేష్‌, హీరోయిన్‌గా నయనతార, ఇద్దరు మరదళ్లుగా ఖుష్బూ, మీనా, మాస్‌ సినిమాలకు కేరాఫ్‌ కెప్టెన్‌ శివ...

Rajinikanth's Peddanna Review: చెల్లెలి కోసం అన్న పడే ఆరాటం 'పెద్దన్న'
Peddanna

Peddanna Movie Review: రజనీ కాంత్‌ సినిమా, అందులోనూ చెల్లెలిగా కీర్తీ సురేష్‌, హీరోయిన్‌గా నయనతార, ఇద్దరు మరదళ్లుగా ఖుష్బూ, మీనా, మాస్‌ సినిమాలకు కేరాఫ్‌ కెప్టెన్‌ శివ… అందరూ కలిసి ఈ దీపావళికి రెడీ చేసిన సినిమా ‘పెద్దన్న’. అసలు సిసలైన పండగ సినిమా అని ముందు నుంచే ప్రమోట్‌ చేస్తున్నారు యూనిట్‌. ఇంతకీ ఈ సినిమా జనాలను మెప్పిస్తుందా? తలైవర్‌ ఫ్యాన్స్ కి ఫుల్‌ జోష్‌ తెస్తుందా? చదివేయండి.

సినిమా: పెద్దన్న
నటీనటులు: రజనీకాంత్‌, కీర్తీ సురేష్‌, నయనతార, మీనా, ఖుష్బూ, జగపతిబాబు, అభిమన్యు సింగ్‌, ప్రకాష్‌రాజ్‌, అరవింద్‌ కృష్ణ తదితరులు
కెమెరా: వెట్రి
సంగీతం: డి.ఇమాన్‌,
కూర్పు: రూబెన్‌
నిర్మాణం: సన్‌ పిక్చర్స్
నిర్మాత: కళానిధి మారన్‌
దర్శకత్వం: శివ
నిర్మాతలు: డి.సురేష్‌బాబు, నారాయణ్‌దాస్‌ నారంగ్‌, దిల్‌రాజు
విడుదల: 4.11.2021

వీరన్న అలియాస్‌ పెద్దన్న(రజనీకాంత్‌) చుట్టూ కొన్ని గ్రామాలకు పెద్దమనిషి. వాళ్ల బాగోగులన్నీ చూస్తుంటాడు. అతనికి చెల్లెలు కనకమహాలక్ష్మి (కీర్తీ సురేష్‌). కడుపులో పడ్డ మూడు నెలలకు తండ్రిని, పుట్టీ పుట్టగానే తల్లిని పోగొట్టుకున్న అమ్మాయి. ఆమెకు అన్నీ అన్నే అయి పెంచుకుంటాడు. ఉత్తరాదికెళ్లి చదువుకుని వస్తుంది. ఆమెకు పెళ్లి చేయాలనుకుంటాడు వీరన్న. చుట్టూ ఉన్న గొప్ప గొప్ప సంబంధాలను చూస్తాడు. తన అన్నయ్య ఏ సంబంధం చూస్తే, దాన్నే చేసుకుంటానని చెప్పిన కనకం ఉన్నట్టుండి పెళ్లి రోజు ముందు రాత్రి ఇంటినుంచి వెళ్లిపోతుంది. ఉత్తరాదిన చదువుకుంటున్నప్పుడు ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటుంది. ఆమె కోసం వెతికిన పెద్దన్నకు కొన్ని విషయాలు తెలుస్తాయి. ఆ క్రమంలోనే తన చెల్లెలు ఇబ్బందుల్లో ఉందని తెలుసుకుంటాడు. తనంటే ఇష్టపడే లాయర్‌ (నయనతార)ను తన చెల్లెలికి తోడుగా పెడతాడు. పెద్దన్న తెలుసుకున్నదాన్లో పారేకర్‌ సోదరుల పాత్ర ఏంటి? మనోజ్‌ పారేకర్‌ (అభిమన్యు సింగ్‌)కీ… ఉద్దవ్‌ పారేకర్‌ (జగపతిబాబు)కి వీరన్న సోదరి ఫ్యామిలీతో ఉన్న వైరం ఎలాంటిది వంటివన్నీ ఆసక్తికరమైన అంశాలు.

పెద్దన్న తరహా పాత్రలు రజనీకాంత్‌కి కొత్తేం కాదు. రీసెంట్‌గా ఆయన సెలక్ట్ చేసుకుంటున్న చాలా కేరక్టర్లు అలాంటివే. పెద్దన్న తరహా కథలు కూడా సిల్వర్‌ స్క్రీన్‌కి కొత్తేం కాదు. తల్లి చనిపోతూ చెల్లెలి బాధ్యతలను కొడుకు చేతిలో పెట్టిపోతే, కంటికి రెప్పలా కాపాడుకున్న చెల్లెలిని ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేయడం, అక్కడ మెట్టినింట్లో ఆమె కష్టాలు పడటం, వాటిని అన్న తీర్చడం అనేది ఏజ్‌ ఓల్డ్ కాన్సెప్ట్. కానీ దాన్ని ఎలా డీల్‌ చేశారనేదాని మీద సక్సెస్‌ రేట్‌ ఆధారపడి ఉంటుంది.

పెద్దన్న పాత్రకు రజనీకాంత్‌ పర్ఫెక్ట్ గా సరిపోయారు. ఆయన కాస్ట్యూమ్స్, విగ్‌ కూడా బావున్నాయి. ఇద్దరు మరదళ్లుగా ఖుష్బూ, మీనా కనిపించినంత సేపు ఆ సందడి మొత్తం స్క్రీన్‌ మీద కనిపించింది. వాళ్లిద్దరి కాస్ట్యూమ్స్, జువెలరీ కచ్చితంగా లేడీస్‌ని అట్రాక్ట్ చేస్తాయి. కీర్తీసురేష్‌ స్టైలింగ్‌ కూడా పర్ఫెక్ట్ గా ఉంది. ఇంతకు ముందు బొద్దుగా ఉన్న కీర్తీ సురేష్‌, కాస్త నాజూగ్గా మారాక ఆమెకు పర్ఫెక్ట్ గా సూట్‌ అయిన కేరక్టర్‌ ఇదే. ఇటు రజనీ ముద్దుల చెల్లెలిగా, ఉత్తరాదిన కష్టపడే ఇల్లాలిగా… రెండు వేరియేషన్స్ చక్కగా చూపించారు కీర్తీ సురేష్‌. మహానటి తర్వాత కీర్తీ సురేష్‌కి పర్ఫెక్ట్ మూవీ పడ్డట్టయింది. నయన్‌తార కాస్ట్యూమ్స్ కూడా బావున్నాయి. లాయర్‌గా మంచి రోల్‌ చేశారు నయన్‌. కీర్తీ సురేష్‌ చెల్లెలయితే, నయన్‌ కి ఏం కేరక్టర్‌ ఉంటుందనుకున్నవారికి ఈ కేరక్టర్‌ పర్ఫెక్ట్ ఆన్సర్‌. రజనీతో పాటు ఈక్వెల్‌గా ట్రావెల్‌ అయ్యే కేరక్టర్‌ చేశారు నయన్‌.

Peddanna

Peddanna

మనోజ్‌ పారేకర్‌గా అభిమన్యు, ఉద్ధవ్‌ పారేకర్‌గా జగపతిబాబు నటన పీక్స్ అన్నమాట. సినిమాలో డైలాగులు బావున్నాయి. కాకపోతే అక్కడక్కడా కొన్ని సీన్స్ తెలుగు నేటివిటీకి పెద్దగా కనెక్ట్ కావు. తమిళ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతాయి. రజనీ ఫ్యాన్స్ కి బానే కనెక్ట్ అవుతాయి. హోలే హోలే అంటూ ఇమాన్‌ స్వరపరచిన ట్యూన్‌ హాంటింగ్‌గా ఉంటుంది.

లొకేషన్లు బావున్నాయి. భారీగా ఖర్చు పెట్టి లావిష్‌గా తీశారనే విషయం చూడగానే ఇట్టే అర్థమవుతుంది. డైరక్టర్‌ శివకి కెమెరా మీద గ్రిప్‌ ఉండటంతో కొన్ని షాట్స్ చాలా బాగా తీశారు. విలన్‌ కన్నా, రజనీకాంత్‌ నీడ బావుండటం, తన చెల్లెలు పబ్‌ నుంచి బయటికి వెళ్తున్నప్పుడు వెనుక మేడ మీద రజనీ నిలుచుని ఉండటం… తరహా షాట్స్ ఫ్యాన్స్ కి గూస్‌బంప్స్ తెప్పిస్తాయి.

సెకండ్‌ హాఫ్‌ ఇంకాస్త క్రిస్పీగా ఉండాల్సింది. ఎడిటింగ్‌ కూడా ఇంకాస్త పర్ఫెక్ట్ గా ఉంటే బావుండేది. స్క్రీన్‌ప్లేనీ ఇంకొంచెం టైట్‌ చేయాల్సింది. కొత్త కథ, కథనాల కోసం, ఊహించని ట్విస్టుల కోసం ఎదురుచూడకుండా సరదాగా చూడాలనుకునేవారికి నచ్చుతుంది. ఓవరాల్‌గా రజనీ ఫ్యాన్స్ కి నచ్చే పండగ సినిమా పెద్దన్న.

– డా. చల్లా భాగ్యలక్ష్మి

Also Read..

Manchi Rojulu Vachayi Review: తండ్రి భ‌యం.. కూతురి ప్రేమ‌.. ధైర్యం చెప్పే అల్లుడు..`మంచి రోజులు వ‌చ్చాయి`

Jai Bhim Review: ప్ర‌శ్నించే గ‌ళం ఉంటే… ఫ‌లితం త‌ప్ప‌కుండా ఉంటుంద‌నే `జై భీమ్‌`

Click on your DTH Provider to Add TV9 Telugu