AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చై, సమంత ‘ఏ మాయ చేశావె’కు 16ఏళ్లు..! గౌతమ్ మేనన్ మ్యాజిక్, రెహమాన్ మ్యూజిక్‌తో మర్చిపోలేని ప్రేమకథ

సినిమా చరిత్రలో కొన్ని చిత్రాలు కేవలం కథలుగా మిగిలిపోతే, మరికొన్ని చిత్రాలు ఒక తరానికి తీపి జ్ఞాపకాలుగా మారుతాయి. సరిగ్గా పదహారేళ్ల క్రితం ఒక అందమైన వర్షపు జల్లులా వచ్చి, ప్రేమికుల హృదయాలను తడిపేసిన ఒక అద్భుత కావ్యం నేటికీ తాజాగా అనిపిస్తుంది.

చై, సమంత ‘ఏ మాయ చేశావె’కు 16ఏళ్లు..! గౌతమ్ మేనన్ మ్యాజిక్, రెహమాన్ మ్యూజిక్‌తో మర్చిపోలేని ప్రేమకథ
Ye Maaya Chesaave
Nikhil
|

Updated on: Feb 26, 2026 | 9:14 PM

Share

ఆ మేజిక్ మళ్లీ మళ్లీ జరగదు అనిపించేలా, వెండితెరపై ప్రేమకు కొత్త అర్థాన్ని అద్దింది ఆ దృశ్యకావ్యం. ఆమె నీలి రంగు చీర కట్టుకుని నడిచి వస్తుంటే.. కుర్రకారు గుండెల్లో ఏదో తెలియని అలజడి. అతను కేవలం ఒక మెకానికల్ ఇంజనీర్, కానీ ఆమె కళ్ళలోకి చూస్తూ సినిమా దర్శకుడిలా కలలు కనే ప్రేమికుడు. వారిద్దరి మధ్య కేరళ బ్యాక్ డ్రాప్‌లో సాగే ఆ సున్నితమైన సంభాషణలు, వర్షం కురుస్తుంటే వచ్చే ఆ మ్యూజిక్ నేటికీ మన ఫోన్లలో రింగ్‌టోన్‌గా మారుతూనే ఉంటుంది. ఆ జంట వెండితెరపై మాత్రమే కాదు, నిజ జీవితంలోనూ ఒక అందమైన ప్రయాణానికి పునాది వేసుకుంది. గౌతమ్ మీనన్ సృష్టించిన ఆ అందమైన ప్రపంచం మరేదో కాదు.. అదే ‘ఏమాయ చేశావే’.

మ్యాజికల్ లవ్ స్టోరీ..

ఫిబ్రవరి 26, 2010న విడుదలైన ఈ సినిమా నేటితో 16 ఏళ్లు పూర్తి చేసుకుంది ఈ సినిమాతోనే సమంత తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే ‘జెస్సీ’గా ఆమె పండించిన హావభావాలు, నాగచైతన్య నటన ఈ చిత్రాన్ని ఒక కల్ట్ క్లాసిక్ గా మార్చాయి.

ఈ సినిమా విజయంలో సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ పాత్ర మరువలేనిది. ‘హోసన్నా’, ‘ఈ హృదయం’, ‘వింత రాగం’ వంటి పాటలు నేటికీ మ్యూజిక్ ప్లేలిస్టులలో టాప్‌లో ఉంటాయి. పాటలే కాకుండా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. గౌతమ్ మీనన్ మేకింగ్ స్టైల్, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్రాణం పోశాయి.

సరికొత్త ట్రెండ్ సెట్టర్

అప్పటివరకు తెలుగు సినిమాలో ఉన్న రొటీన్ ప్రేమకథలకు భిన్నంగా, ఎంతో సహజంగా, మన పక్కింట్లో జరిగే కథలా ఈ సినిమా ఉంటుంది. హిందూ అబ్బాయి, క్రిస్టియన్ అమ్మాయి మధ్య ఉండే వయసు వ్యత్యాసం, వారి కుటుంబాల మధ్య ఉండే ఇబ్బందులను ఎంతో హుందగా చూపించారు. క్లైమాక్స్ విషయంలో కూడా రెండు రకాల వెర్షన్లు తమిళంలో విషాదాంతం, తెలుగులో సుఖాంతంగా తీసి గౌతమ్ మీనన్ ప్రయోగం చేశారు. కాలం మారుతున్నా, కొత్త కొత్త ప్రేమకథలు వస్తున్నా ‘ఏమాయ చేశావె’ క్రేజ్ మాత్రం తగ్గదు. కార్తీక్, జెస్సీల మధ్య సాగే ఆ మాయాజాలం ఎప్పటికీ సినీ ప్రేమికుల మనసుల్లో పదిలంగా ఉంటుంది.

Follow Us