అబ్బబ్బ.. మామిడి, అల్లం రోటి పచ్చడి.. ఇలా చేశారంటే గిన్నెలు తుడవాల్సిందే..
మామిడికాయ, అల్లంలో ఎన్నో ఎన్నో పోషకాలు దాగున్నాయి.. ఈ సీజన్‌లో లభించే మామిడి అల్లంతో రోటి పచ్చడిని సులభంగా తయారుచేసుకోవచ్చు.. పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే నీళ్లు చేర్చకుండా రుబ్బుకోవాలి. దీనిని అన్నం, టిఫిన్ లో ఆస్వాదిస్తూ తినవచ్చు. ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన ఈ పచ్చడి తయారీ వివరాలను తెలుసుకోండి.

మామిడికాయ, అల్లంలో ఎన్నో ఎన్నో పోషకాలు దాగున్నాయి. మామిడి పండు రుచిగా ఉండటమే కాదు, శరీరానికి అవసరమైన అనేక పోషకాలను అందిస్తుంది. విటమిన్ C, A, E, ఫైబర్, పొటాషియం, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. మన వంటింట్లో ఉండే అల్లంలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి.. దీనిలో కూడా విటమిన్ C, విటమిన్ B6, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్, జింజరాల్ ఉంటాయి.. అయితే.. వీటితో ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.. అల్లం, మామిడి కాంబినేషన్ ఎన్నో సమస్యలకు అద్భుతంగా పనిచేస్తాయి. అల్లం, మామిడి పచ్చడితో నోటికి రుచితో ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.. అంతేకాకుండా ఈ పచ్చడి.. నోటికి పుల్లగా.. అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. దీనిని టిఫిన్ లో కూడా తినొచ్చు..
ఈ సీజన్‌లో విరివిగా లభించే మామిడి అల్లంతో ఎంతో రుచిగా, ఆరోగ్యకరంగా ఉండే రోటి పచ్చడిని ఎలా తయారు చేయాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. మామిడి అల్లం, సాధారణ అల్లం కంటే భిన్నంగా కొద్దిగా తెల్లగా ఉండి, లోపల పసుపు రంగులో మామిడికాయ వాసనను కలిగి ఉంటుంది. ఇది భూమి లోపల పెరుగుతుంది కాబట్టి, దీన్ని శుభ్రం చేసే పద్ధతి చాలా ముఖ్యం.
తయారీకి కావలసిన మామిడి అల్లం శుభ్రపరచడం:
అల్లం మామిడి.. మీకు తగినంతగా తీసుకోవాలి.. లేదా సుమారు పావు కేజీ మామిడి అల్లాన్ని తీసుకొని, నాలుగైదు సార్లు నీళ్లతో శుభ్రంగా కడగాలి. స్పూన్‌తో పైన పొట్టును జాగ్రత్తగా తీసేయాలి. ఆ తరువాత, తడి లేకుండా శుభ్రమైన వస్త్రంతో తుడిచి, పూర్తిగా ఆరనివ్వాలి. తడి ఆరిన తర్వాత మాత్రమే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
పచ్చడి తయారీ విధానం:
1. స్టవ్ మీద పాన్ పెట్టి, రెండు టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడయ్యాక, ఒక చిన్న ఇంగువ ముక్క, మూడు ఎండుమిరపకాయలు, పావు టీస్పూన్ మెంతులు వేసి దోరగా వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.
2. అదే నూనెలో ముందుగా కట్ చేసుకున్న మామిడి అల్లం ముక్కలు, ఐదు పచ్చిమిరపకాయలు (మీ కారానికి తగినట్లుగా), పావు టీస్పూన్ పసుపు, చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు వేయాలి.
3. ఈ మిశ్రమాన్ని మీడియం మంటపై రెండు లేదా మూడు నిమిషాల పాటు ఫ్రై చేయాలి. మామిడి అల్లాన్ని ఎక్కువ సేపు వేయించాల్సిన అవసరం లేదు, పచ్చి వాసన పోతే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.
4. అనంతరం రోటిలో లేదా మిక్సీ జార్ లో ముందుగా వేయించుకున్న ఎండుమిరపకాయలు, ఇంగువ, మెంతులు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
5. ఆ తరువాత, చల్లారబెట్టుకున్న మామిడి అల్లం మిశ్రమాన్ని, రుచికి సరిపడా ఉప్పును, కావాలంటే నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రెబ్బలను వేసి, నీళ్లు ఉపయోగించకుండా కొద్దిగా (మరీ మెత్తగా కాకుండా) గ్రైండ్ చేసుకోవాలి.
6. నీళ్లు ఉపయోగించకుండా గ్రైండ్ చేస్తే పచ్చడి రెండు రోజుల వరకు బయటే నిల్వ ఉంటుంది. నీళ్లు వేస్తే ఒక రోజు మాత్రమే నిల్వ ఉంటుంది.
తాలింపు తయారీ:
మామిడి అల్లం వేయించిన అదే పాన్ లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేయాలి. నూనె వేడయ్యాక, అర టీస్పూన్ ఆవాలు, ఒక టీస్పూన్ మినప్పప్పు వేయాలి.
పొడి ఇంగువ వాడే వారైతే ఈ దశలో వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, ఒక రెమ్మ కరివేపాకు, ఒక ఎండుమిర్చి వేసుకోవాలి. పాన్ వేడికి ఇవి వేగిపోతాయి.
ఈ తాలింపును గ్రైండ్ చేసుకున్న పచ్చడిలోకి వేసి బాగా కలుపుకోవాలి.
ఈ సులభమైన మామిడి అల్లం రోటి పచ్చడిని వేడి వేడి అన్నంతో పాటు, దోశల్లోకి కూడా కాంబినేషన్‌గా తీసుకోవచ్చు. దీని రుచి చాలా బాగుంటుంది.
