Mohanlal Birthday: భారతదేశం గర్వించదగ్గ సంపూర్ణ నట శిఖరం మోహన్‌ లాల్‌…

కొందరి గురించి చెప్పేటప్పుడు ఉన్నదాన్నే కొండంతలు చేసి చెప్పాల్సి వస్తుంది. అది కష్టం.. మరి కొందరి గురించి చెప్పేటప్పుడు ఒక్కసారి వాళ్లలోని కొండంత ప్రతిభను కొంచెంలో చెప్పాల్సి వస్తుంది..

Mohanlal Birthday: భారతదేశం గర్వించదగ్గ సంపూర్ణ నట శిఖరం మోహన్‌ లాల్‌...
Mohan Lal
Follow us

| Edited By: Phani CH

Updated on: May 22, 2021 | 9:32 AM

కొందరి గురించి చెప్పేటప్పుడు ఉన్నదాన్నే కొండంతలు చేసి చెప్పాల్సి వస్తుంది. అది కష్టం.. మరి కొందరి గురించి చెప్పేటప్పుడు ఒక్కసారి వాళ్లలోని కొండంత ప్రతిభను కొంచెంలో చెప్పాల్సి వస్తుంది.. ఇది మరింత కష్టం! పద్మభూషణుడు, మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ రెండో కోవకు చెందుతాడు. ఆ విలక్షణ నటుడి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఎక్కడో ఏదో మిస్సయ్యామేమోననే సందేహం పట్టిపీడిస్తుంది.. ఇవాళ ఆ మహానటుడి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన గురించి నాలుగు మాటలు.

Mohanlal (1)

మోహన్‌లాల్‌ వంటి నటులు చాలా అరుదుగా దొరుకుతారు. ఇన్నేళ్లుగా సూపర్‌స్టార్‌గా ఉండటం, విజయవంతమైన చిత్రాలలో నటించడం, నటించిన ప్రతీ సినిమాలోనూ నటనలో వైరుధ్యాన్ని కనబర్చడం కాదు ప్రత్యేకత.. ఇంతకాలం ప్రేక్షకులకు ‘ ఇక చాల్లే తప్పుకో’ అనే భావన రానీయకుండా నటించుకురావడం! ఈ విద్య అందరికీ అబ్బదు. ప్రజలు ఇంతలా పొగుడుతున్నారంటే మోహన్‌లాల్‌లో ఏదో మెస్మరిజం ఉండే ఉంటుంది.. ఆ అయస్కాంత శక్తి నటన నుంచి వచ్చింది.. మోహన్‌లాల్‌ మనకు కూడా సుపరిచితమే.. ఎన్టీఆర్‌ నటించిన జనతా గ్యారేజ్‌తోనే కాదు, అందుకు ముందు వచ్చిన అనేకానేక డబ్బింగ్‌ సినిమాలతో మోహన్‌లాల్‌ మనకు కూడా ఆత్మీయ నటుడయ్యారు. అసలు సంపూర్ణ నటనకు నిర్వచనం చెప్పాలంటే మోహన్‌లాల్‌ పేరు తీసుకుంటే సరిపోతుంది.. మలయాళీలు ప్రేమతో ముద్దుగా పిల్చుకునే లాలెటన్‌ నిజంగానే ది కంప్లీట్‌ మ్యాన్‌.. ఏ పాత్ర ఇచ్చినా అందులో ఇట్టే ఒదిగిపోతారు. పాత్రలో పరకాయప్రవేశం చేస్తారు. ప్రేక్షకులను నవ్విస్తారు. ఏడిపిస్తారు. భావోద్వేగాలకు గురి చేస్తారు. ఆయన దర్శకులకు కావల్సిన నటుడు. దర్శకులు కోరుకున్న నటుడు.

నటన అనేది ఓ విచిత్రరంగం. అక్కడ కొందరు ఎంతో కాలంగా నటిస్తూ ఉంటారు. కానీ తమకంటూ ఓ స్టయిల్ ఏర్పరచుకోలేరు. కానీ ఇంకొందరు కొద్దికాలంలోనే గుర్తింపు పొందుతారు. ఎలాంటి వారసత్వపు బ్యాక్ గ్రౌండూ లేకపోయినా… ఎవరబ్బా ఈ నటుడు అని … అందరూ అతన్నే చూస్తారు. ఓ పక్క నటన నేర్చుకుంటూనే నటనకి కొత్త అర్థాలు చెబుతారు. వీళ్లే వెండితెర వెలుగులవుతారు. మోహన్‌లాల్‌ కచ్చితంగా ఈ కోవకే చెందుతారు. చూడగానే ఆకర్షించే ముఖం, చిత్రమైన వాచకం, అవలీలగా పలికే హావభావాలు, అద్భుతమైన నటనా కౌశలం.. ఇవన్నీ కలిస్తే మోహన్‌లాల్‌.

సినీరంగంలో అడుగుపెట్టిన తొలినాళ్లలో చాలా మందిలాగే ఆయనా చాలా కష్టపడ్డారు. అంతలా కష్టపడ్డారు కాబట్టే ఇప్పుడందరికి ఇష్టుడయ్యారు. మోహన్‌లాల్‌ అనగానే ఏదో నార్త్‌ ఇండియన్‌ పేరులా అనిపిస్తుంది కానీ.. ఆయన అసలు పేరు మోహన్‌లాల్‌ విశ్వనాథ్‌ నాయర్‌.. నటన ఆయన ఆరోప్రాణం.. ఆరో తరగతిలోనే రంగస్థలం మీద అదరగొట్టారు. ఓ నాటకంలో 90 ఏళ్ల వృద్ధుడిగా నటించి శభాష్‌ అనిపించుకున్నారు. అలా చదువుకుంటూ మరో పక్క నాటకాలు వేస్తూ వచ్చారు మోహన్‌లాల్‌.. మధ్యలో కుస్తీ మీద మక్కువ పెంచుకున్నారు. రెండు సార్లు ఛాంపియన్‌గా కూడా నిలిచారు. అక్కడే ఉంటే ప్రయోజనం ఉండదని భావించిన మోహన్‌లాల్‌ స్నేహితులు ఎంతో కష్టపడి తిరనోట్టమ్‌ అనే సినిమా మోహన్‌లాల్‌తో తీశారు.. ఈ స్నేహితుల బృందం సుప్రసిద్ధ దర్శకుడు ప్రియదర్శన్‌ కూడా ఉన్నారు. అందులో మానసిక వైకల్యం ఉన్న పాత్రలో నటించారు. మోహన్‌లాల్‌ను హీరోగా చూడాలన్నది వారి తాపత్రయం.. కానీ ఆర్ధిక ఇబ్బందులో, అనివార్య కారణాలో తెలియదు కానీ ఆ సినిమా విడుదల కాలేదు.. పాతికేళ్ల తర్వాత అది విడుదలయ్యిందనుకోండి.. అప్పటికే మోహన్‌లాల్‌ సూపర్‌స్టార్‌ అయ్యారు. ఆ విషయం వదిలేస్తే తిరునోట్టమ్‌ విడుదల కాకపోయినా ఫ్రెండ్స్‌ నిరాశపడలేదు. ఊరుకోలేదు.. బతిమాలారు, బలవంతపెట్టారు.. చివరకు వారి పోరు పడలేక ఫాజిల్‌ దర్శకత్వంతో వచ్చిన మంజిల్‌ విరింజ పూక్కల్‌ సినిమా ఆడిషన్‌కు వెళ్లారు.. ఆ సినిమాలో విలన్‌ పాత్రకు ఎంపికయ్యారు. ఆ సినిమా బ్రహ్మండమైన విజయాన్ని సాధించింది.

Mohanlal (3)

ఇక అక్కడ్నుంచి మోహన్‌లాల్‌ వెనక్కి తిరిగి చూడలేదు. 1983లో ఏకంగా పాతిక సినిమాల్లో నటించారంటేనే చెప్పుకోవచ్చు లాలెటన్‌ డిమాండ్‌ ఎంతలా పెరిగిందని…ఆ సినిమాల్లో ఎక్కువగా నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రల్లోనే నటించారు. ఆ తర్వాతి సంవత్సరం ప్రియదర్శన్‌ దర్శకత్వంలో పూచక్కోరు మూక్కుర్తి అనే కామెడీ సినిమాలో హీరోగా నటించారు మోహన్‌లాల్‌. అది మొదలు.. మళ్లీ విలన్‌పాత్రలు వేయలేదు మోహన్‌లాల్‌.. అటు పిమ్మట మోహన్‌లాల్‌ నటనను చూసి ఎంతో మంది దర్శకులు మనసు పారేసుకున్నారు. అరవిందన్‌, హరిహరన్‌, ఎమ్‌టి వాసుదేవన్‌ నాయర్‌, పద్మరాజన్‌, భరతన్‌, లోహితాదాస్‌ వంటి అగ్రశ్రేణి దర్శకులకు ఆత్మీయుడయ్యారు.. వారు సృష్టించిన భిన్నమైన పాత్రలను ఛాలెంజ్‌గా తీసుకున్నాడు.. అద్భుతంగా నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఒకటా రెండా చిత్రం, కిరీటం, చంద్రలేఖ, నరసింహం, భరతం, దశరథమ్‌, నాడోడికట్టు, కిలుక్కమ్‌, సదయమ్‌, గాంధీనగర్‌ సెకండ్‌ స్ట్రీట్‌, నంబర్‌ 20 మద్రాస్‌ మెయిల్‌, దేవాసురమ్‌, హిస్‌ హైనెస్‌ అబ్దుల్లా, పవిత్రం, కాలాపాని, మిథునం, వానప్రస్థం ఇలా అద్భతమైన చిత్రాల్లో నటించారు.

Mohanlal (4)

నటుడంటే కేవలం హీరో కాదు.. అన్ని రకాల హావభావాలు ప్రదర్శించాలి. పాత్రోచితంగా ప్రవర్తించాలి. కొందరు హీరోల్లా మోహన్‌లాల్‌ ఇమేజ్‌ చట్రంలో ఇరుక్కుపోలేదు. తన పాత్రలను తానే శాసించలేదు.. పాత్రల కోసం తనని తను మలచుకున్నాడు. తెరమీద పాత్రలో మోహన్‌లాల్‌ కాదు కనిపించాల్సింది, పాత్ర మాత్రమే కనిపించాలన్న ఆదర్శంతో తన వ్యక్తిత్వాన్ని పాత్రలకు ధారపోశారు మోహన్‌లాల్‌. హీరోయిన్ల పక్కన గెంతులేసే పాత్రలు కావాలని ఏనాడూ కోరుకోలేదు. ఇప్పుడు కూడా తన వయసుకు తగ్గట్టు పాత్రలేసుకుంటూ వస్తున్నారు.. అందుకే నటుడిగా శిఖరాగ్రాన కూర్చున్నారు. మాస్‌ క్రేజ్‌, క్లాస్‌ క్రేజ్‌ అన్న పదాలు మనం వింటూ ఉంటుంటాం.. ఈ పదాలేమిటో మోహన్‌లాల్‌కు తెలియదు.. ఎందుకంటే ఆయన మాస్‌కు ఇష్టుడే, క్లాస్‌కు ఇష్టుడే! అందుకే అవార్డులు సాధించగల సినిమాలు చేయగలరు, బాక్సాఫీసును బద్దలు కొట్టే సినిమాలూ చేయగలరు. మలయాళంలో వంద కోట్ల వసూళ్లను పరిచయం చేసిందే మోహన్‌లాల్‌. పులి మురుగన్‌ సినిమా వందకోట్లను మార్క్‌ను అందుకుంది. మొన్నామధ్య వచ్చిన లూసిఫర్‌ సినిమా ఏకంగా 200 కోట్ల మార్క్‌ను చేరుకుంది.

‘పులిమురుగన్‌’తో వందకోట్ల వసూళ్ల మార్క్‌ను అందుకొని ఈ ఘనత సాధించిన తొలి మలయాళ చిత్రంగా నిలిపారు. ఆ తర్వాత వచ్చిన ‘లూసిఫర్‌’ రూ.200 కోట్లకు పైగా వసూళ్లను సాధించిపెట్టింది. ఈ వసూళ్లతో వందకోట్ల హీరో అయిపోయాడు మోహన్‌లాల్‌. యంగ్‌ హీరోలకూ సాధ్యం కానీ ఈ ఘనత సాధిస్తూ.. తనకింకా వయసైపోలేదని నిరూపిస్తున్నారు. ఇంత భారీ వసూళ్లు సాధించిన సినిమా నిర్మాణానికి బోలెడంత ఖర్చు అయిందనుకుంటున్నారేమో! హంగులు ఆర్భాటాలు ఏమీ ఉండవు.. కోట్లు ఖర్చు పెట్టే సెట్లు ఉండవు.. పాటల కోసం హాలెండ్‌కో, స్విట్జర్లాండ్‌కో వెళ్లరు.. కేరళలోనే షూటింగ్‌ కానిచ్చేస్తారు.. పైగా నెలల తరబడి షూటింగ్‌ జరుపుకోవు.. మోహన్‌లాల్ ఏ సినిమా అయినా మూడు నాలుగు నెలల్లో పూర్తి కావాల్సిందే! తమిళంలో ఇరువర్‌ సినిమాతో అక్కడివారికి దగ్గరయ్యారు. వర్మ తీసిన కంపెనీ సినిమాతో ఉత్తరాదివారికి ఇష్టుడయ్యారు. లవ్‌ సినిమాతో కన్నడ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మనమంతా, జనతా గ్యారేజ్‌ సినిమాలతో తెలుగువారికి ఆత్మీయుడయ్యారు. మోహన్‌లాల్‌ నటిస్తుంటే ఒక్కసారి దర్శకులు కూడా తన్మయంలో మునిగిపోయేవారట! కట్‌ చెప్పడం కూడా మర్చిపోయేవారట! తన మూలాలను మోహన్‌లాల్‌ ఎప్పుడూ మర్చిపోలేదు.. ఇప్పటికీ సమయం దొరికితే నాటకాలు వేస్తూనే ఉంటారు.. తను సూపర్‌స్టార్‌గా ఉన్నకాలంలోనే ఓ నాటకం కోసం ఆరు నెలలు షూటింగ్‌ను వాయిదా వేసుకున్నారంటే నమ్ముతారా? నేషనల్ స్కూల్ ఆఫ్‌ డ్రామా ఢిల్లీలో కర్ణన్‌ అనే సంస్కృత నాటకాన్ని రూపొందించింది.

Mohanlal (5)

ఇందులో మోహన్‌లాల్‌ ప్రధానపాత్ర.. ఇందుకోసం ఆరు నెలలు సినిమాలకు దూరంగా ఉండి, సంస్కృతం నేర్చుకుని ఆ పాత్రను పండించారు మోహన్‌లాల్.. తీవ్రమైన అభినివేశం, ఏదో చేయాలనే తపన, అందుకు తగినట్టుగా ప్రజ్ఞాపాటవాలు..ఇవన్నీ ఉన్న నటుడు మోహన్‌లాల్. ఎప్పటికప్పుడు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటూనే ఉంటారు. ఇప్పటికీ తనకు నటన తప్ప మరేదీ పెద్దగా రాదంటారాయన. ఆ నటనలోనూ తెలిసింది తక్కువేనంటారు. నేర్చుకోవలసింది చాలా ఉందని నిజాయితీగా చెబుతారు. అన్నట్టు మోహన్‌లాల్ పాటలు కూడా పాడగలరు.. ఈమధ్యనే మెగా ఫోన్‌ కూడా పట్టుకున్నారు. నటన పట్ల ఇంత తపన ఉంది కాబట్టే అవార్డులు ఆయన ఇంటికి పరుగెత్తుకుంటూ వచ్చాయి. ఇప్పటి వరకు అయిదు జాతీయ అవార్డులను గెల్చుకున్నారు. భరతం, వానప్రస్థం సినిమాలకు ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న మోహన్‌లాల్‌కు స్పెషల్‌ జ్యూరీ అవార్డులు కూడా వచ్చాయి. 11 ఫిలింఫేర్‌ అవార్డులు సొంతమయ్యాయి. భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ, పద్మభూషన్‌లతో సత్కరించింది. మరోసారి మోహన్‌లాల్‌కు జన్మదిన శుభాకాంక్షలు.

మరిన్ని ఇక్కడ చూడండి: Jio: తెలుగు రాష్ట్రాల్లోని జియో యూజర్లకు శుభవార్త… ఇక డబుల్ స్పీడ్‌తో డేటా .. ( వీడియో )

Gir Lions: తుపాను సమయంలో మన సింహాలు క్షేమం అంటూ దక్షిణాఫ్రికా సింహాల వీడియో పోస్ట్ .. ఏకిపారేస్తున్న నెటిజన్లు!