AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fake Currency: యూట్యూబ్‌లో చూసి ఇంట్లోనే దొంగ నోట్ల ముద్రణ.. పక్కా స్కెచ్‌తో భారీ ముఠా అరెస్ట్!

వందకు నాలుగువందలు . అవును, ఇప్పుడు బెజవాడలో ఇదే దందా సాగుతోంది. ఉదాహరణకు మనం లక్ష ఇస్తే... మనకు వాళ్లు 4 లక్షలు ఇస్తారు. ఇదేదో అధిక వడ్డీ ఇచ్చే బిజినెస్ కాదు..

Fake Currency: యూట్యూబ్‌లో చూసి ఇంట్లోనే దొంగ నోట్ల ముద్రణ.. పక్కా స్కెచ్‌తో భారీ ముఠా అరెస్ట్!
Fake Currency
Balaraju Goud
|

Updated on: Dec 14, 2021 | 11:47 AM

Share

Fake Currency Gang in Krishna District: వందకు నాలుగువందలు . అవును, ఇప్పుడు బెజవాడలో ఇదే దందా సాగుతోంది. ఉదాహరణకు మనం లక్ష ఇస్తే… మనకు వాళ్లు 4 లక్షలు ఇస్తారు. ఇదేదో అధిక వడ్డీ ఇచ్చే బిజినెస్ కాదు.. నెలలు, సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన పనిలేదు. జస్ట్ రోజుల్లో పని. ఇలా ఇచ్చి అలా తీసుకోవచ్చు. కానీ, ఇది పక్కా ఫేక్ నోట్ల వ్యాపారం. ఎట్టకేలకు కృష్ణా జిల్లాలో ఈజీ మనీకి అలవాటుపడ్డ కేటుగాళ్ల బండారం బయటపడింది.

డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో నకిలీ కరెన్సీ ముద్రించి.. వాటిని చెలామణి చేసేందుకు ప్రయత్నించిన ముఠాను పెడన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యూ ట్యూబ్‌ ద్వారా నకిలీ కరెన్సీని ఎలా తయారు చేయాలో తెలుసుకుని.. వాటిని ఎలా ముద్రించాలి, ఎలా చెలామణి చేయాలి అనే అంశాలపై మూడు నెలలపాటు క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. పక్కాగా అమలు చేయాలనుకున్నారు. అయితే, వారి ఫ్లాన్‌ను ఏపీ పోలీసులు ఆదిలోనే చెక్‌ పెట్టారు. పెడన పట్టణంలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు మచిలీ పట్నం డీఎస్పీ షేక్‌ మసూంబాషా మీడియాకు వివరించారు. సూత్రధారితో పాటు కేసుతో సంబంధం ఉన్న మొత్తం ఎనిమిది మందిని మీడియా ముందు ప్రవేశపెట్టారు.

కృష్ణా జిల్లా పెడనలో పట్టుబడ్డ గ్యాంగ్ ఇది. డీఎస్పీ షేక్ మసూంబాషా తెలిపిన వివరాల ప్రకారం.. కాసా వెంకటేశ్వరరావు అనే వ్యక్తి.. ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా దుకాణం తెరిచాడు. వీరభద్రపురంలోని కాసా నాగరాజు అనే వ్యక్తి ఇంట్లో దొంగనోట్ల కుటీర పరిశ్రమే పెట్టేశాడు. ఒక స్కానర్‌, ప్రింటర్‌, పేపర్‌ కట్టర్‌లతో ముద్రణ నడిపిస్తున్నాడు. ఇతనితోపాటు మధ్యవర్తులు కూడా జతకలిశారు. లక్ష ఒరిజినల్‌కు 4లక్షల ఫేక్ నోట్లు ఇచ్చే ఈ బిజినెస్‌లో 35 నుంచి 40శాతం కమిషన్ కూడా ఇస్తున్నాడు. ఇప్పటికి ఈ గ్యాంగ్ ఇన్ని కోట్లు ముద్రించిందో, అంత సొమ్మును ఎలా మార్కెట్‌లోకి చొప్పించిందో ! మొత్తం 9మందిని అరెస్ట్ చేసి వాళ్ల నుంచి ఈ ప్రశ్నలకు సమాధానం సేకరించే పనిలో ఉన్నారు పోలీసులు.

ఈ క్రమంలోనే పట్టణంలోని దక్షిణ తెలుగుపాలెంకు చెందిన ముచ్చు శివ తన తల్లి వైద్యఖర్చుల నిమిత్తం రామలక్ష్మీవీవర్స్‌కాలనీకి చెందిన వాసా వెంకటేశ్వరరావు దగ్గర అప్పుగా రూ.2వేలు తీసుకున్నాడు. వీటితో శివ స్థానికంగా మెడికల్‌ దుకాణంలో మందులు కొనుగోలు చేసేందుకు నగదు ఇచ్చాడు. మెడికల్‌ షాపులో ఉన్న వ్యక్తి ఆ నోట్లలో తేడాను గమనించి.. ఇవి దొంగనోట్లు అని చెప్పడంతో శివ తిరిగి వాసా వెంకటేశ్వరరావు వద్దకు వెళ్లాడు. వెంకటేశ్వరరావు అవి దొంగనోట్లు కాదని, తనకు వీరభద్రపురంలోని కాసా నాగరాజు, అతని కుమారుడు ఇచ్చారని చెప్పాడు. అనుమానం వచ్చిన శివ పెడన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కాసా నాగరాజు అసలు భాగోతం వెలుగులోకి వచ్చింది. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేశామని, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని మచిలీ పట్నం డీఎస్పీ షేక్‌ మసూంబాషా తెలిపారు.

Read Also… MP Vijayasai Reddy: GST పరిహారం చెల్లించండి.. కేంద్రాన్ని కోరిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి