శ్రీ శార్వరి నామ ఉగాది.. అమ్మవారి ఆశీస్సుల‌తో..

చైత్ర శుద్ధ పాడ్యమినాడు వచ్చే తెలుగువారి మొదటి పండుగ ఉగాది. ఇది వసంత కాలంలో వస్తుంది. బ్రహ్మ దేవుడు గత ప్రళయం పూర్తి అయిన తర్వాత తిరిగి సృష్టి ప్రారంభించే సమయాన్ని ...

శ్రీ శార్వరి నామ ఉగాది.. అమ్మవారి ఆశీస్సుల‌తో..
Follow us

|

Updated on: Mar 25, 2020 | 10:16 AM

చైత్ర శుద్ధ పాడ్యమినాడు వచ్చే తెలుగువారి మొదటి పండుగ ఉగాది. ఇది వసంత కాలంలో వస్తుంది. బ్రహ్మ దేవుడు గత ప్రళయం పూర్తి అయిన తర్వాత తిరిగి సృష్టి ప్రారంభించే సమయాన్ని బ్రహ్మకల్పం అంటారు. ఇలా ప్రతికల్పంలోనూ మొదటవచ్చేది యుగాదిని యుగానికి ఆదిగా, ప్రారంభ సమయంగా “ఉగాది” అని వ్యవహరిస్తుంటారు. ఈ పండుగ మనకు చైత్రమాసంలో మొదలవుతుంది కనుక ఆ రోజు నుంచి తెలుగు సంవత్సర మొదటి దినంగా పరిగణిస్తాం.

ఉగాది అంటే ప్రతి ఒక్కరి మదిలో సంతోషం వెల్లివిరుస్తుంది. ఈ ఉగాది పండుగ రోజున అందరూ ఉదయం వేళ త్వరగా నిద్రలేచి తలంటు స్నానాలుచేసి కొత్త బట్టలు ధరిస్తారు. ఇంటి ముంగిట మామిడాకులు, బంతి పూల‌ తోరణాలు, వాకిళ్ల‌లో ముగ్గుల‌తో వసంత లక్ష్మిని స్వాగతిస్తారు. షడ్రుచులతో కూడిన ఉగాది ప్రసాదాన్ని పంచాంగానికి, దేవతలకు నైవేద్యం చేసి తమ భవిష్యత్ జీవితాలు ఆనందంగా సాగాలని కోరుతూ ఉగాది పచ్చడి తింటారు. వైద్య పరంగా ఈ పచ్చడి వ్యాధినిరోధక శక్తిని కలిగిస్తుందంటారు. ఆ రకంగా తమ జీవితాలు అన్ని రుచుల మిశ్రమంగా ఉండాలని ఆకాంక్షిస్తారు.

ఈ ఉగాది విశిష్ట‌త వెనుక మ‌రో శాస్త్రీయ నేప‌థ్యం దాగి ఉంద‌ని చెబుతారు. ఈ పండ‌గ మన జీవితంలో ఎదురయ్యే మంచి, చెడు, కష్ట, సుఖాలను ఒకేలా స్వీకరించాలన్న సందేశానిస్తుంది. అలాగే ఉగాది పండ‌గ కాలం అనేక రకాల విషజ్వరాలు, ఆటలమ్మ, ఇంకా చాలా రకాల వ్యాధులు వ్యాపించే సమయమిది. వ్యాధుల కార‌ణంగా పెద్ద సంఖ్య‌లో మ‌ర‌ణాలు కూడా సంభ‌విస్తాయ‌నేది ఒక‌నాటి నుంచి వ‌స్తున్న భ‌యం. కాబట్టి జనం ఈ కాలంలో ఆరోగ్య జాగ్రత్తలు బాగా తీసుకోవాలి. ఇప్పటికే కరోనా వైరస్ అనే మహమ్మారి కూడా ప్రపంచాన్ని వణికిస్తోంది. మ‌న దేశంలో కూడా ఈ కరోనా భూతం రోజురోజుకు చాలా మందిని కలవరపెడుతోంది.

ఉగాది పండుగ వెనుక ఒక వైజ్జానిక అంశం కూడా ఉంది. ఉగాది పచ్చడిని ఒక మహాఔషధమని చాలా మంది పెద్దలు చెబుతుంటారు. ఈ ఉగాది పచ్చడిని ఈ పండుగ నుండి శ్రీరామనవమి వరకూ లేదా చైత్ర పౌర్ణమి వరకు ప్రతిరోజూ ప‌ర‌గ‌డుపునే స్వీక‌రించాలి. ఈ ఉగాది పచ్చడి తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి ఆ సంవత్సరం మొత్తం రోగాలనేవి దరిచేరవు. ప్ర‌స్తుతం మ‌నం కొత్త తెలుగు సంవత్సం శ్రీశార్వరి నామ ఏడాదిలోకి అడుగుపెట్టాం…శ్రీశార్వ‌రి అంటే..సాక్షాత్తూ అమ్మ‌వారు…ఈ నామానికి కాళరాత్రి అని, శుభకరి అని, చంద్రకాంత అని, హిమం అని పంటలు బాగా పండేదనీ అనేక అర్థాలున్నాయి.

క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో దేశంలో లాక్‌డౌన్ కొన‌సాగుతోంది. దీంతో ప్ర‌జ‌లేవ‌రూ ఇంటినుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. పంచాగాశ్రావ‌ణం, దైవ‌ద‌ర్శ‌నం, బంధుమిత్రుల క‌ల‌యిక అన్ని క‌ట్ట‌డి చేయ‌బ‌డ్డాయి. దీంతో ఎవ‌రి ఇంట్లో వారు ఉగాదిని జ‌రుపుకుంటున్నారు.  ఆ ఆదిశ‌క్తి ఆశీస్సుల‌తో ఈ సంవత్సరం అందరికీ ఆయురారోగ్యాలు, పాడిపంట‌లు స‌మృద్ధిగా పండి, అందరూ సుఖసంతోషాలతో ఉంటారనీ ఆశిద్దాం.