కరీంనగర్ రెడ్‌జోన్‌లో..బంధనలు మరింత కఠినం
తెలంగాణలోని అన్ని జిల్లాల్లోకెల్లా కరీంనగర్‌లో వైరస్ భయం వణుకు పుట్టిస్తోంది. తాజాగా మరికొంతమందిని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈక్రమంలోనే ఆంక్షలు మరింత..
తెలంగాణలోని అన్ని జిల్లాల్లోకెల్లా కరీంనగర్‌లో వైరస్ భయం వణుకు పుట్టిస్తోంది. తాజాగా మరికొంతమందిని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈక్రమంలోనే ఆంక్షలు మరింత తీవ్రతరం చేశారు. నగరంలో ప్రమాదకర జోన్‌గా ప్రకటించిన ప్రాంతం నుంచి ఏ ఒక్కరూ బయటకు రావొద్దని కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఓ క్రమంలో అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారిపై కనిపిస్తే..కాల్చివేస్తామనే హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ శశాంక, సీపీ కమలాసన్ పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. కరోనా వల్ల నెలకొన్న పరిస్థితులపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
లాక్ డౌన్ వల్ల నగరంలో తలెత్తిన చిన్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని కలెక్టర్ శశాంక చెప్పారు. మంగళవారం ఒక్కరోజే స్థానికంగా ఉన్న 1,500 కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసినట్లుగా తెలిపారు. కరోనా అనుమానితులను 14 రోజుల పాటు క్వారంటైన్ తరలించి అక్కడే ఉంచుతున్నామని వివరించారు. మరికొంత మందిని కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. కరీంనగర్‌లో రెడ్ జోన్‌గా ప్రకటించిన ప్రాంతం నుంచి ఏ ఒక్కరూ బయటకు రావొద్దని తీవ్రమైన హెచ్చరిక చేశారు.నిత్యావసర సరకులు అమ్మే కిరాణా దుకాణాలు, మార్కెట్‌ల వద్ద ప్రజలంతా విధిగా సామాజిక దూరం పాటించాలని సూచించారు. వ్యాపారులతోపాటు, కొనుగోలు దారులు కూడా సహకరించాలని కోరారు.
ప్రభుత్వ ఆదేశానుసారం ప్రజలంతా రోడ్లపైకి రాకుండా పోలీసులకు సహకరించాలని పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కొద్దిరోజుల క్రితం వచ్చిన ఇండోనేసియన్లు తిరిగిన ప్రాంతాలను మొత్తం గుర్తించామని చెప్పారు. ఈ నేపథ్యంలో మిగతా జిల్లాల కంటే కరీంనగర్ మరింత జాగ్రత్తలు అవసరం ఉన్నందున నిబంధనలను, అత్యంత కఠినంగా ఇకపై అమలు చేయనున్నట్లుగా సీపీ తేల్చి చెప్పారు.