రెమ్డెసివిర్ ఔషధానికి ఆరోగ్యశాఖ గ్రీన్ సిగ్నల్ !

ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌-19 మహమ్మారి విలయతాండవం చేస్తోంది. దీని కట్టడికోసం వ్యాక్సిన్‌తో పాటు ఔషధంపై కూడా ప్రపంచవ్యాప్తంగా విస్తృత ప్రయోగాలు జరుగుతున్నాయి. అమెరికాకు చెందిన గిలీడ్‌ సైన్సెస్‌ సంస్థ అభివృద్ధి చేసిన 'రెమ్డెసివిర్‌' ఔషధం ఇప్పుడు నేరుగా కరోనా బాధితులపై ఉపయోగించేందుకు సిద్ధమవుతున్నారు.

రెమ్డెసివిర్ ఔషధానికి ఆరోగ్యశాఖ గ్రీన్ సిగ్నల్ !
Follow us

| Edited By:

Updated on: Jun 14, 2020 | 10:14 AM

ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌-19 మహమ్మారి విలయతాండవం చేస్తోంది. దీని కట్టడికోసం వ్యాక్సిన్‌తో పాటు ఔషధంపై కూడా ప్రపంచవ్యాప్తంగా విస్తృత ప్రయోగాలు జరుగుతున్నాయి. అమెరికాకు చెందిన గిలీడ్‌ సైన్సెస్‌ సంస్థ అభివృద్ధి చేసిన ‘రెమ్డెసివిర్‌’ ఔషధం ఇప్పుడు నేరుగా కరోనా బాధితులపై ఉపయోగించేందుకు సిద్ధమవుతున్నారు. కరోనా బాధితులకు చికిత్స అందించే విషయంలో కేంద్ర ఆరోగ్యశాఖ సవరించిన ‘క్లినికల్‌ మేనేజ్‌మెంట్‌ ప్రోటోకాల్స్‌ ఫర్‌ కోవిడ్‌–19’ను శనివారం విడుదల చేసింది. యాంటీ వైరల్‌ డ్రగ్‌ రెమ్‌డెసివిర్‌ను అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించవచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది. అలాగే కరోనా ప్రాథమిక దశలోనే ఉంటే యాంటీ మలేరియల్‌ డ్రగ్‌ హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మాత్రలు వాడుకోవచ్చని తెలియజేసింది. ఈ విషయంలో గతంలో జారీ చేసిన ప్రోటోకాల్‌లోని అంశాలను కేంద్ర ఆరోగ్యశాఖ తొలగించింది. పరిశోధనాత్మక రెమ్‌డెసివిర్ ఔషధాన్ని తయారు చేసి మనదేశంతో పాటు 127 దేశాల్లో విక్రయించేందుకు వీలుగా గిలీడ్‌ సైన్సెస్‌ సంస్థతో డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌, జైడస్‌ క్యాడిలా ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఒప్పందంలో భాగంగా ఈ ఔషధాన్ని తయారు చేయటానికి అవసరమైన సాంకేతిక నైపుణ్యం గిలీడ్‌ సైన్సెస్‌ నుంచి డాక్టర్‌ రెడ్డీస్‌, జైడస్‌ క్యాడిలాకు బదిలీ అవుతుంది. ఏ దేశంలో ఈ ఔషధాన్ని విక్రయించాలనుకుంటే ఆ దేశంలోని ఔషధ నియంత్రణ ఏజెన్సీల నుంచి డాక్టర్‌ రెడ్డీస్‌, జైడస్‌ క్యాడిలా అనుమతులు తీసుకోవలసి ఉంటుంది. రెమ్‌డెసివిర్‌ ఔషధాన్ని కొవిడ్‌- 19 బాధితులకు ఉపశమనం కలిగించేదిగా గిలీడ్‌ సైన్సెస్‌ అభివృద్ధి చేసింది. దీనికి అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ నుంచి అత్యవసర వినియోగ అనుమతి లభించింది. తదనంతరం రెమ్‌డెసివిర్‌ ఔషధాన్ని తయారు చేసి విక్రయించేందుకు వీలుకల్పిస్తూ గిలీడ్‌ సైన్సెస్‌, ఇతర ఫార్మా కంపెనీలతో లైసెన్సింగ్‌ ఒప్పందాలను కుదుర్చుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మనదేశంలోని హెటెరో ల్యాబ్స్‌, సిప్లా, జుబిలెంట్‌ లైఫ్‌సైన్సెస్‌తో లైసెన్సింగ్‌ ఒప్పందాలు చేసుకుంది. ఇప్పుడు డాక్టర్‌ రెడ్డీస్‌, జైడస్‌ క్యాడిలాతోనూ ఇదే తరహా ఒప్పందాలు కుదిరాయి.