TGPSC Group 1 Result Date: మార్చి నెలాఖరు నాటికి టీజీపీఎస్సీ గ్రూప్ 1 నియామకాలు పూర్తి: సీఎం రేవంత్‌రెడ్డి
రెండేళ్లుగా నానుతున్న గ్రూప్ 1 పోస్టుల నియామక ప్రక్రియ మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేయనున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు తాజాగా నిర్వహించిన ఓ సమావేశంలో సీఎం రేవంత్ వెల్లడించారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత చేపడుతున్న గ్రూప్ 1 ఉద్యోగాల నియామక పరీక్షలు ఆపేందుకు కొందరు తీవ్రంగా కష్టపడ్డారని, వారందరికీ నిరాశ ఎదురైందని ఆయన ఎద్దేవాచేశారు..
హైదరాబాద్, జనవరి 7: తెలంగాణ టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఫలితాలు మార్చి 31లోగా విడుదలవనున్నాయి. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల జరిగిన ఓ సమావేశంలో ప్రకటించారు. మొత్తం 563 గ్రూప్ 1 ఉద్యోగాలను మార్చి నెలాఖరు నాటికి భర్తీ చేయబోతున్నట్లు సీఎం రేవంత్ వెల్లడించారు. ఇప్పటికే ఈ పోస్టులకు సంబంధించిన ప్రిలిమ్స్, మెయిన్స్ పూర్తవగా త్వరలో ఫలితాలు వెల్లడించి నియామకాలు పూర్తి చేయనున్నట్లు వివరించారు. రాజీవ్‌గాంధీ అభయహస్తం పథకం కింద సివిల్స్ మెయిన్స్ రాతపరీక్షలో ప్రతిభ చూపి ఇంటర్వ్యూకు ఎంపికైన 20 మంది అభ్యర్థులకు జనవరి 5న ప్రజాభవన్‌లో రూ.లక్ష చొప్పున చెక్కులను అందజేశారు. సింగరేణి సంస్థ నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ…
‘గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను ఏదో రకంగా అడ్డుకుని కాలయాపన చేయాలని కొందరు కుట్ర చేశారన్నారు. కానీ మా ప్రభుత్వం యువత ఉపాధి అవకాశాల కోసమే ఆలోచిస్తుందని, ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత గ్రూప్-1 పరీక్షల ప్రకటనను 2011లో వచ్చింది. మళ్లీ 14 ఏళ్ల తరవాత 2025లో ఈ నియామకాలు చేపట్టబోతున్నామన్నారు. అప్పట్లో గ్రూప్ 1కి సన్నద్ధమైన 21, 22 ఏళ్ల నిరుద్యోగులకు ఇప్పుడు 35 సంవత్సరాలకు చేరుకుంటారని అన్నారు. 14 ఏళ్ల పాటు వారిని త్రిశంకుస్వర్గంలో ఉంచడం కన్నా నరకం ఏమైనా ఉంటుందాని ప్రశ్నించారు. సివిల్స్ పరీక్షలకు శిక్షణ పొందే వారికి ఢిల్లీలో అవసరమైన సహకారం అందించాలని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్‌కు ఆదేశాలిస్తామన్నారు. అత్యధికంగా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌లు తెలంగాణ నుంచే ఎంపికవుతున్నారని, అందుకు అనుగుణంగా తెలంగాణ పిల్లలు రాణించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. జాబ్ క్యాలెండర్‌లో ఇచ్చిన తేదీల ప్రకారం నియామకాలు చేపట్టడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
వెనుకబడిన రాష్ట్రమైన బిహార్ నుంచి ఎక్కువమంది సివిల్స్ విజేతలుగా నిలుస్తున్నారని, అలాగే తెలంగాణ నుంచి కూడా ఎంపికవ్వాలని రూ.లక్ష చొప్పున సాయం చేస్తున్నట్లు తెలిపారు. పుస్తకాలు కొనడానికి డబ్బులు లేకపోయినా కూలీగా పనిచేస్తూ ఐఆర్‌ఎస్‌కు ఎంపికైన బలరాం.. ప్రస్తుతం సింగరేణి సీఎండీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్లు తెలిపారు. సివిల్స్‌లో టాప్ ర్యాంకులు సాధించి తెలంగాణకు సేవలు అందిస్తే మంచిది. ఇతర రాష్ట్రాలకు ఎంపికైనా తెలంగాణకు సహకారం అందించాలని అన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలో 55,143 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి దేశానికి ఆదర్శంగా నిలిచామని, పదేళ్లుగా పేరుకుపోయిన నిర్లక్ష్యాన్ని వదిలించి ప్రతిశాఖలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నందుకు గర్వంగా ఉందని అన్నారు. సివిల్స్ ఇంటర్వ్యూకు వెళ్లే ప్రతిఒక్కరూ ఎంపికవ్వాలని ఆకాంక్షిస్తున్నట్లు రేవంత్‌రెడ్డి చెప్పారు.