బస్తర్ జర్నలిస్టు మర్డర్ కేసులో విస్తుపోయే వాస్తవాలు: పక్కటెముకలు విరగ్గొట్టి.. గుండెను చీల్చి బయటకు తీసి..
బస్తర్ జర్నలిస్టు మార్డర్ కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా పోస్టుమార్టం రిపోర్టు బయటకు రాగా అందులో షాకింగ్ విషయాలు వెల్లడించారు వైద్యులు. హత్యకు గురైన జర్నలిస్టు గుండెను నిందితులు చీల్చి బయటకు తీశారని తెలిపారు. పక్కటెముకలు 15 చోట్ల విరిగాయని, తలపై బలమైన గాయాలు ఉన్నట్లు తెలిపారు..
హైదరాబాద్, జనవరి 6: కాంట్రాక్టులో రూ.120 కోట్ల అవినీతిని బయటపెట్టినందుకు జర్నలిస్టు ముఖేశ్ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు సురేష్ చంద్రకర్‌ను ఆదివారం రాత్రి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం హైదరాబాద్‌లో అరెస్టు చేసినట్లు పోలీసులు సోమవారం (జనవరి 6) తెలిపారు. చత్తీస్‌ఘడ్‌లోని బస్తర్ జిల్లాలో జరిగిన ఈ మర్డర్ కేసులో దారుణ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
వృత్తిరీత్యా కాంట్రాక్టర్ అయిన నిందితుడు జనవరి 3న జర్నలిస్టు ముఖేష్ చంద్రాకర్ హత్య వెలుగులోకి వచ్చినప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. ఈ క్రమంలో సిట్ ఆదివారం అర్థరాత్రి సురేష్ చంద్రకర్‌ను హైదరాబాద్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అరెస్ట్ చేసింది. నిందితుడిని సోమవారం ఉదయం బీజాపూర్‌కు తీసుకువచ్చి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఈ కేసులో సురేష్ చంద్రకర్ సోదరులు రితేష్ చంద్రకర్, దినేష్ చంద్రకర్, సూపర్‌వైజర్ మహేంద్ర రామ్‌టేకేలను ఇప్పటికే పోలీసులు అరెస్టు చేశారు. రితేశ్‌ను రాయ్‌పూర్‌లో, దినేశ్, మహేంద్రలను బీజాపూర్‌లో అరెస్టు చేశారు.
ఫ్రీలాన్స్ జర్నలిస్టు ముఖేష్ చంద్రకర్ (33) జనవరి 1న అదృశ్యమయ్యాడు. బీజాపూర్ పట్టణంలోని చత్తన్‌పర బస్తీలో సురేష్ చంద్రకర్‌కు చెందిన సెప్టిక్ ట్యాంక్‌లో అతని మృతదేహం జనవరి 3న లభ్యమైంది. మరణించిన వ్యక్తి NDTV న్యూస్ ఛానెల్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నాడు. 1.59 లక్షల మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్న ‘బస్తర్ జంక్షన్’ అనే యూట్యూబ్ ఛానెల్‌ని కూడా నడుపుతున్నాడు. బీజాపూర్‌లో రోడ్డు నిర్మాణ పనుల్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ ఓ వార్త డిసెంబర్ 25న NDTVలో ప్రచురణ అయింది. గంగలూరు నుంచి హిరోలి వరకు రూ.120 కోట్లతో చేపట్టిన రోడ్డు ప్రాజెక్టులో అవినీతి జరిగినట్లు ఆరోపించాడు. దీంతో ఈ నిర్మాణ పనుల కాంట్రాక్టర్ సురేశ్ చంద్రాకర్.. జర్నలిస్టు ముఖేష్ చంద్రాకర్‌పై కక్ష్య పెట్టుకున్నాడు. అప్పటికే రంగంలోకి దిగిన అధికారులు కాంట్రాక్టర్‌కు చెందిన మూడు బ్యాంకు ఖాతాలను హోల్డ్‌లో ఉంచారు. ఆ తర్వాత కనిపించకుండా పోయిన ముఖేష్.. సురేశ్ చంద్రాకర్‌కు చెందిన సెప్టిక్ ట్యాంక్‌లో శవమై కనిపించాడు. పోలీసులు అతడి చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా గుర్తించారు.
#WATCH | Prime accused of journalist Mukesh Chandrakar’s murder case, Suresh Chandrakar, who was absconding after the crime, has been detained. The accused was detained from Hyderabad late last night by the SIT and he is being questioned
In Bijapur, SIT in-charge, Mayank Gurjar… pic.twitter.com/f4hCz9Wb7D
— ANI (@ANI) January 6, 2025
ఇక పోస్టుమార్టం రిపోర్టులో మరిన్ని విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. హంతకులు అతడిని దారుణంగా కొట్టి, గుండెను చీల్చి బయటకు తీసినట్లు పోస్టుమార్టంలో తేలింది. అంతేకాకుండా అతడి కాలేయం నాలుగు ముక్కలైనట్లు గుర్తించారు. అతడి పక్కటెముకలు ఐదు చోట్ల, తలపై 15 చోట్ల ఎముకలు విరిగిపోయాయని వైద్యులు తెలిపారు. తమ 12 ఏళ్ల కెరీర్‌లో ఇంత భయానక హత్యను ఎన్నడూ చూడలేదని వెల్లడించారు. ఇద్దరు కంటే ఎక్కువమందే ఈ హత్యలో పాల్గొన్నట్లు అనుమానం వ్యక్తంచేశారు.