Success Story: ‘ఎన్నో ఏళ్ల కల ఇది.. కోచింగ్ తీసుకోలేదు’ టీజీపీఎస్సీ గ్రూప్ 1 టాపర్ లక్ష్మీ దీపిక విజయగాథ
టీజీపీఎస్సీ గ్రూప్ 1 పోస్టులకు సంబంధించిన రాత పరీక్ష మెయిన్స్ ఫలితాలు ఆదివారం (మార్చి 31) విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో హైదరాబాద్ ఏఎస్‌రావు నగర్‌కు చెందిన లక్ష్మీదీపిక కొమ్మిరెడ్డి రాష్ట్ర టాప్ ర్యాంకర్‌గా నిలిచారు. లక్ష్మీదీపిక మొత్తం 900 మార్కులకు గానూ 550 మార్కులు సాధించి ఫస్ట్ ర్యాంక్ సాధించారు. లక్ష్మీదీపిక ప్రిపరేషన్ జర్నీ ఇదే..

హైదరాబాద్, మార్చి 31: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న దాదాపు 563 గ్రూప్ 1 పోస్టులకు సంబంధించిన రాత పరీక్ష మెయిన్స్ ఫలితాలు ఆదివారం (మార్చి 31) విడుదలైన సంగతి తెలిసిందే. అభ్యర్థులు సాధించిన మార్కులతో జనరల్ ర్యాంకు జాబితా(జీఆర్‌ఎల్)ను టీజీపీఎస్సీ వెల్లడించింది. ఈ ఫలితాల్లో తొలి 10 ర్యాంకుల్లో ఏకంగా ఆరుగురు అమ్మాయిలు సత్తా చాటారు. ఇక టాప్ 50లో 25 మంది, తొలి వంద ర్యాంకుల్లో 41 మంది అమ్మాయిలే ఉండటం విశేషం. ఈ ఫలితాల్లో హైదరాబాద్ ఏఎస్‌రావు నగర్‌కు చెందిన లక్ష్మీదీపిక కొమ్మిరెడ్డి రాష్ట్ర టాప్ ర్యాంకర్‌గా నిలిచారు. లక్ష్మీదీపిక మొత్తం 900 మార్కులకు గానూ 550 మార్కులు సాధించి ఫస్ట్ ర్యాంక్ సాధించారు.
లక్ష్మీదీపిక తండ్రి కృష్ణ కొమ్మిరెడ్డి సీనియర్ ఆడిట్ ఆఫీసర్‌గా పనిచేసి రిటైరయ్యారు. తల్లి పద్మావతి గృహిణి. తల్లిదండ్రులకు లక్ష్మీదీపిక ఏకైక సంతానం. టెన్త్ వరకూ సఫిల్‌గూడలోని డీఏవీ స్కూల్లో చదివిన లక్ష్మీదీపిక 2013లో మెడిసిన్ 119వర్యాంకు సాధించి ఉస్మానియా మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ పూర్తిచేశారు. తొలుత అమెరికా వెళ్లి మాస్టర్స్ చేయాలని భావించినప్పటికీ ‘యూపీఎస్సీ’ మెరుగైన ఎంపిక అనుకుని అటుగాసాగారు. సిలబస్, పాత ప్రశ్నాపత్రాలు చూశాక సొంతంగా సిద్ధమైతేనే మనదైన వ్యూహంతో ముందుకెళ్లొచ్చని ఎక్కడా శిక్షణ కూడా తీసుకోకుండా సొంత ప్రిపరేషన్ సాగించారు. 2020లో మొదటిసారి యూపీఎస్సీ రాశారు. ప్రిలిమ్స్‌లో గట్టెక్కినా 5 మార్కుల్లో మెయిన్స్ క్లియర్ కాలేదు. 2021లో ఇంటర్వ్యూ వరకూ వెళ్లారు. 2023లో మూడో ప్రయత్నంలో ప్రిలిమ్స్ క్లియర్ చేయలేకపోయారు. జనరల్ స్టడీస్‌లో మంచి మార్కులు వస్తున్నప్పటికీ ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంచుకున్న తెలుగులో అంతగా మార్కులు సాధించలేకపోయానని భావించి, ఆ తర్వాత ఆంత్రపాలజీని ఆప్షనల్‌గా ఎంచుకుని మళ్లీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశానని అన్నారు.
2023లో బయో ఫెర్టిలైజర్స్ తయారుచేసే అంకుర సంస్థలో కొద్ది నెలలు పనిచేశారు. ఆ తర్వాత ఆ జాబ్ మానేసి 2024 జనవరి నుంచి పరీక్షల మీదే పూర్తి దృష్టి పెట్టారు. అటు యూపీఎస్సీకి సిద్ధమవుతూనే, టీజీపీఎస్సీ పరీక్షలూ రాస్తుండేవారు. గతేడాది సెప్టెంబరులో యూపీఎస్సీ మెయిన్స్, అక్టోబరులో టీజీపీఎస్సీ మెయిన్స్ రాశారు. ఈ ఏడాది మార్చి 16న యూపీఎస్సీ ఇంటర్వ్యూకి హాజరయ్యారు. ఆ ఫలితాలు రావల్సి ఉంది. ఇంతలో గ్రూప్ 1 ఫలితాలు వచ్చాయి. ఇందులో రాష్ట్రస్థాయిలోనే ఫస్ట్‌ర్యాంకు రావడంతో డెప్యూటీ కలెక్టర్ పోస్టుకు ఎంపికయ్యారు. తల్లిదండ్రులకు దగ్గరగా ఉండాలనుకుంటున్నానని, అందుకే గ్రూప్ 1లో చేరాలనుకుంటున్నట్లు తెలిపారు. యూపీఎస్సీలో హోమ్ క్యాడర్ వస్తే అప్పుడు ఏమైనా మార్పులు చేసు విషయంపై ఆలోచిస్తానని అన్నారు. తన ప్రిపరేషన్ గురించి చెబుతూ.. కొన్నేళ్లుగా ఈ పరీక్షలకు సిద్ధమవుతున్న కారణంగా పరీక్షల సమయంలో రోజులో 8-9 గంటలు చదివేదాన్ననని అన్నారు. యూపీఎస్సీకి, గ్రూప్ 1కి 80శాతం సిలబస్ కామన్‌గా ఉండటంతో సులభమైంది. 20శాతం తెలంగాణ అంశాలను జాగ్రత్తగా ప్రిపేరయ్యానని అన్నారు.
ప్రిపరేషన్ నుంచి ఆటవిడుపుగా పాటలు పాడటం, చుట్టుపక్కల పిల్లలకు చదువుల్లో సందేహాలు ఉంటే తీర్చడం వంటివి చేస్తుంటానని అన్నారు. కొందరికి మొదటి ప్రయత్నంలో విజయం వరిస్తుంది.. నాకైతే ఇన్నాళ్లు పట్టిందని. అనుకున్నది సాధించే వరకు ఓపిక, పట్టుదలతో నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలని యువతకు సూచించారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.