Telangana: గురుకులాల్లో ఆగని విద్యార్ధుల మృత్యుఘోష.. అనారోగ్యంతో 9వ తరగతి విద్యార్థి మృతి!
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల విద్యాలయాలు విద్యార్ధుల పాలిట మృత్యుకుహరాలుగా మారుతున్నాయి. ఇప్పటికే పదుల సమఖ్యంలో గురుకుల విద్యార్ధులు అనారోగ్యంతో మృతి చెందగా.. తాజాగా మరో విద్యార్ధి మృత్యువాత పడ్డాడు. గురుకులాల్లో అందిస్తున్న కలుషిత ఆహారం విద్యార్ధుల ప్రాణాలు వరుసగా హరిస్తున్నాయి..

మెదక్, మార్చి 30: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల విద్యాలయాలు విద్యార్ధుల పాలిట మృత్యుకుహరాలుగా మారుతున్నాయి. ఇప్పటికే పదుల సమఖ్యంలో గురుకుల విద్యార్ధులు అనారోగ్యంతో మృతి చెందగా.. తాజాగా మరో విద్యార్ధి మృత్యువాత పడ్డాడు. గురుకులాల్లో అందిస్తున్న కలుషిత ఆహారం విద్యార్ధుల ప్రాణాలను హరిస్తుంది. ఈ క్రమంలోనే మెదక్ జిల్లా సిర్గాపూర్ మండలం నల్లవాగు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న బాలుడు మృత్యువాత పడ్డాడు. అసలేం జరిగిందంటే..
మెదక్ జిల్లా పెద్దశంకరంపేట్ మండలం చీలపల్లికి చెందిన దార నిఖిల్ కుమార్ (14) సిర్గాపూర్ మండలం నల్లవాగు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నా డు. నిఖిల్ గత వారంరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సరిగ్గా భోజనం చేయక పోవడంతో ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతింది. దీంతో మార్చి 26న పాఠశాల ప్రిన్సిపాల్ తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. పరుగు పరుగున వచ్చిన విద్యార్థి తల్లిదండ్రులు నిఖిల్‌ను ఆస్పత్రికి తరలించారు. అయితే విద్యార్ధి పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి పలు ఆస్పత్రులకు తీసుకెళ్లిన నిఖిల్ తల్లిదండ్రులు.. చివరికి హైదరాబాద్‌కు తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం (మార్చి 28) మృతి చెందాడు.
గురుకుల పాఠశాల ప్రిన్సిపల్, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా తమ కుమారుడు మృతి చెందాడని తల్లిదండ్రులు, బంధువులు విద్యార్థి మృతదేహంతో గురుకుల పాఠశాల ముట్టడికి యత్నించారు. ఈ క్రమంలో వారు రోడ్డుపైనే బైఠాయించి ధర్నాకు దిగారు. రూ.10లక్షల ఎక్స్‌గ్రేసియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నారాయణఖేడ్ ఆర్డీవో అశోక చక్రవర్తి ఘటనా స్థలానికి చేరుకుని ఆర్‌సీవో నిర్మలతో ఫోన్‌లో మాట్లాడారు. వెంటనే విద్యార్థి అంత్యక్రియల కోసం రూ.50 వేలు అందజేసి, ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఇప్పటి వరకు గురుకులాల్లో చదువుతున్న 83 మంది విద్యార్థులు అనారోగ్యంతో మరణించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.