TG SSC 2025 Answer Sheets: ఎంతటి నిర్లక్ష్యం..! బస్సు టైర్ల కింద నలిగిన ‘పది’ పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాలు..
రాత్రింబగళ్లు కష్టపడి చదివి బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకునేందుకు విద్యార్ధులు పడుతున్న కష్టంతో అధికారులు చలగాటం ఆడుతున్నారు. పదో తరగతి పరీక్షల నిర్వహణ, జవాబు పత్రాల తరలింపుపై అధికారులు నిర్లక్ష్యం అద్దం పట్టే దృష్యం తాజాగా చోటు చేసుకుంది. పరీక్షలు నిర్వహించామా.. జవాబు పత్రాలు పంపించామా.. మమా అనేట్లుగా..

హైదరాబాద్, మార్చి 30: రాత్రింబగళ్లు కష్టపడి చదివి బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుకునేందుకు విద్యార్ధులు పడుతున్న కష్టాన్ని అధికారులు రోడ్డుపాలు చేశారు. పదో తరగతి పరీక్షల నిర్వహణ, జవాబు పత్రాల తరలింపుపై అధికారుల నిర్లక్ష్యం అద్దం పట్టే దృష్యం తాజాగా చోటు చేసుకుంది. పరీక్షలు నిర్వహించామా.. జవాబు పత్రాలు పంపించామా.. మమా అనేట్లుగా వ్యవహరిస్తున్నారు. ఖమ్మంలో నడి రోడ్డుపై బస్సు టైర్ల కింద పడి నలిగిపోయిన టెన్త్ జవాబు పత్రాలు చూస్తే అదే అనిపిస్తుంది. విద్యార్ధుల జీవితాలతో ఆటలాడుతున్న ఈ ఘటన శనివారం ఖమ్మం బస్టాండ్ వద్ద చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..
ఖమ్మం జిల్లా కారేపల్లిలోని మోడల్ స్కూల్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కోమట్లగూడెంలోని హైస్కూల్‌లో పదో తరగతి పరీక్షలు జరుగుతున్నాయి. మార్చి 28న ఫిజికల్ సైన్స్ పరీక్ష ముగిశాక.. ఆ పరీక్ష జవాబు పత్రాలను కారేపల్లి పోస్టాఫీస్‌లో పార్శిల్ బుకింగ్ చేశారు. అక్కడి సిబ్బంది జవాబు పత్రాలను మూడు పార్శిళ్లు చేసి బ్యాగులో సీల్ వేసి కారేపల్లి బస్టాండ్‌లో ఖమ్మం వెళ్లే బస్ కండక్టర్‌కు అప్పగించారు. బస్సు ఖమ్మం పాత బస్టాండ్‌కు సాయంత్రం చేరుకుంది. అక్కడి నుంచి ఆర్‌ఎంఎస్ (రైల్వే మెయిల్ సర్వీస్) క్యాంప్ ఆఫీస్‌కు పంపించి, ఆ తర్వాత నిర్దేశిత మూల్యాంకన కేంద్రానికి చేరవేస్తారు.
అయితే ఎంతో పకడ్భందీగా తరలించవల్సిన పదో తరగతి జవాబు పత్రాలను పోస్టాఫీస్ నుంచి తరలించే సమయంలో శుక్రవారం సాయంత్రం షాకింగ్ ఘటన జరిగింది. జవాబుపత్రాల బ్యాగ్‌ను ఖమ్మం పాత బస్టాండ్‌లో బస్సు నుంచి కిందకి పడేయగా, సరిగ్గా అదే సమయంలో డ్రైవర్ బస్సును ముందుకు నడిపాడు. దీంతో బస్సు టైరు ఆ బ్యాగ్ పైనుంచి వెళ్లింది. దీంతో బ్యాగ్ చిరిగి కారేపల్లి మోడల్ స్కూల్‌లో పరీక్ష రాసిన విద్యార్థుల జవాబుపత్రాలు బయటకు వచ్చాయి. జవాబు పత్రాలు రోడ్డుపై పడిన ఘటనపై జిల్లా కలెక్టర్.. డీఈవో, ఆర్డీవోలను విచారణకు ఆదేశించారు. ఇద్దరు అధికారులు సమాధాన పత్రాలను నిల్వ చేసిన ఖమ్మం రైల్వే స్టేషన్‌లోని ఆర్‌ఎంఎస్ పాయింట్‌కి వెళ్లి పత్రాలను పరిశీలించారు. ప్యాకింగ్ తొలగినా జవాబు పత్రాలన్నీ భద్రంగా ఉన్నాయని, విద్యార్థులు ఆందోళన చెందాల్సిన పనిలేదని డీఈఓ తెలిపారు.
దీనిపై కారేపల్లి పోస్ట్ మాస్టర్ ఝాన్సీ లక్ష్మిబాయిని వివరణ కోరగా.. పార్సిల్ బుకింగ్ చేయడం, ప్యాకర్ ద్వారా బస్సులో వేయడమే తమ బాధ్యతని, ఆ తర్వాత ఖమ్మం బస్టాండ్‌లో ఆర్‌ఎంఎస్ వారికి బ్యాగ్ అప్పగించే వరకు కండక్టరే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. ఈ ఘటనపై పోస్టల్ శాఖకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.