Telangana: ఇకపై పరీక్షల ఆన్సర్‌ ‘కీ’పై అభ్యంతరాలు లేవనెత్తాలంటే ఫీజు కట్టాల్సిందే.. ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం!

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి మరో సంచలన నిర్ణయం తీసుకోనుంది. ఇకపై రాష్ట్రంలో జరిగే ప్రవేశ పరీక్షలకు ఆయా బోర్డులు విడుదల చేసే ప్రాథమిక ఆన్సర్ కీలపై అభ్యంతరాలు తెలియజేయాలంటే విద్యార్ధుల తల్లిదండ్రల జేబుకు చిల్లు పడనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ విధానాన్ని అమలు చేయాలని ఉన్నత విద్యామండలి యోచిస్తుంది..

Telangana: ఇకపై పరీక్షల ఆన్సర్‌ 'కీ'పై అభ్యంతరాలు లేవనెత్తాలంటే ఫీజు కట్టాల్సిందే.. ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం!
Entrance Examinations Key
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 08, 2025 | 9:33 AM

హైదరాబాద్‌, జనవరి 8: సాధారణంగా ప్రొఫెషనల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు ఎంట్రన్స్‌ టెస్ట్‌లు, పోటీ పరీక్షలకు నియామక పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆయా పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్‌ ‘కీ’ విడుదల చేస్తుంటారు. ఆ కీలపై అభ్యర్ధుల నుంచి అభ్యంతరాలను స్వీకరించిన తర్వాత వాటిని పరిగణనలోకి తీసుకుని తుది ఆన్సర్‌ ‘కీ’లను తయారు చేస్తుంటారు. అయితే జేఈఈ, గేట్‌, నీట్‌ వంటి అఖిల భారత ఎంట్రన్స్‌ టెస్ట్‌లకు మాత్రం అభ్యంతరాల నమోదుకు ఒక్కో ప్రశ్నకు అభ్యర్ధులు నిర్ధేశిత రుసుము కింద ఫీజు చెల్లించి అభ్యంతరాలు లేవనెత్తవల్సి ఉంటుంది. ఈ ఫీజు నాన్‌ రీఫండబుల్‌. అంటే ఎట్టిపరిస్తితుల్లోనూ విద్యార్ధులకు ఫీజును తిరిగి చెల్లించడం ఉండదు.

ఈ విధానం రాష్ట్ర స్థాయి పరీక్షలకు దాదాపు ఉండదు. అయితే ఇకపై తెలంగాణలో జరిగే ఎంట్రన్స్‌ పరీక్షలకు ఫీజులు వసూలు చేయనున్నారు. అయితే ఇది పూర్తిగా రీఫండబుల్‌ ఫీజు. అంటే ఒక ప్రశ్నపై అభ్యంతరం వ్యక్తం చేసిన పక్షంలో ప్రాథమిక కీలో వెల్లడించిన ఆన్సర్‌ తప్పుగా తేలితే విద్యార్థి చెల్లించిన ఫీజు మొత్తాన్ని తిరిగి వారిచే ఇచ్చేస్తారన్నమాట. ఆన్సర్‌లో మార్పులేకపోతే మాత్రం ఫీజు వాపస్‌ ఉండదు. 2025-26 విద్యా సంవత్సరంలో నిర్వహించే పలు ప్రవేశ పరీక్షలు(సెట్‌) కన్వీనర్ల సమావేశాన్ని మంగళవారం మాసాబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలిలో మంగళవారం నిర్వహించగా.. ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డి సహా పలు సెట్ల కన్వీనర్లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా పలువురు ప్రాథమిక కీపై అభ్యంతరాలకు ఫీజు వసూలు చేయాలని ప్రతిపాదించారు. ఇందుకు ఉన్నత విద్యామండలి ఆమోద ముద్రవేయాల్సి ఉంది. ఈ విధానం కింద ఒక్కో ప్రశ్నపై అభ్యంతరాలకు రూ. 200 ఫీజుగా వసూలు చేయాలని ప్రతిపాదనలో పేర్కొన్నారు. ఈ విధానాన్ని ఈఏపీసెట్‌తో సహా పలు ప్రవేశ పరీక్షల ప్రాథమిక ‘కీ’లకు వర్తించనున్నారు. సాధారణంగా డీఎస్సీ, గ్రూప్స్‌ పరీక్షలు, ఇతర అన్ని రకాల సెట్స్‌కు వేల కొద్దీ అభ్యంతరాలొస్తుంటాయి. ఒక వేళ ఇది అమలులోకి వస్తే విద్యార్ధులు, నిరుద్యోగులపై ఫీజుల భారం పడే అవకాశం ఉంది. పైగా అభ్యంతరాలు వ్యక్తంచేసేందుకు ఫీజు పెడితే, విద్యార్థులు కొంత ఆలోచించి.. ఆచీతూచీ అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశముంటుందని, ఫలితంగా అభ్యంతరాల సంఖ్య కూడా తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు. ఉన్నత విద్యామండలి తుది నిర్ణయంపై ఇది అమలులోకి వచ్చే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.