Inter Practical Exams: ఇకపై ఇంటర్మీడియట్ జూనియర్‌ కాలేజీల్లో ఉత్తుత్తి ప్రాక్టికల్స్‌కు చెక్‌.. నిఘా నీడలోనే ప్రయోగాలు

ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ పరీక్షలు ఫిబ్రవరి 3 నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఎంపీసీ విద్యార్థులకు కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లో ప్రయోగ పరీక్షలు ఉండగా.. బైపీసీ విద్యార్థులకు వీటితోపాటు బోటనీ, జువాలజీ సబ్జెక్టుల్లో ప్రాక్టికల్స్‌ జరగనున్నాయి. అయితే రాష్ట్రంలోని కొన్ని ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ప్రాక్టికల్స్ నిర్వహించకుండానే విద్యార్ధులకు ఫుల్ మార్కులు కేటాయిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో..

Inter Practical Exams: ఇకపై ఇంటర్మీడియట్ జూనియర్‌ కాలేజీల్లో ఉత్తుత్తి ప్రాక్టికల్స్‌కు చెక్‌.. నిఘా నీడలోనే ప్రయోగాలు
Inter Practical Exams
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 08, 2025 | 10:13 AM

హైదరాబాద్‌, జనవరి 8: ఇంటర్మీడియెట్‌ ప్రాక్టికల్స్‌ పరీక్షలపై ఇంటర్‌ బోర్డు ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇకపై సీసీ కెమెరాల నిఘా నీడలోనే ప్రాక్టికల్స్‌ పరీక్షలు జరగాలని బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అన్ని జిల్లాల ఇంటర్‌ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులు సమీక్ష జరిపారు. దీంతో ఈ ఏడాది జరగనున్న ఇంటర్‌ ప్రాక్టికల్స్‌కు ప్రతి పరీక్ష కేంద్రంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటన్నింటిని ఇంటర్‌ బోర్డ్‌ ప్రధాన కార్యాలయానికి అనుసంధానం చేయాలని నిర్ణయించారు. కాగా ఇంటర్ ప్రాక్టికల్స్‌ ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అలాగే అన్ని గ్రూపుల విద్యార్థులకు ఇంగ్లిష్‌ ప్రాక్టికల్స్‌ సైతం ఉన్నాయి.

ఏటా ప్రాక్టికల్‌ పరీక్షలపై అనేక ఫిర్యాదులొస్తున్నాయి. ముఖ్యంగా ప్రైవేటు కాలేజీల్లో ఉత్తుత్తి ప్రాక్టికల్స్‌ నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. విద్యార్థులు ప్రాక్టికల్స్‌ చేయకపోయినా ఫుల్‌ మార్కులు వేస్తున్నారని, పర్యవేక్షణకు ఇన్విజిలేటర్లుగా వెళ్ళే ప్రభుత్వ లెక్చరర్లను ఆయా కాలేజీలు ముందే ఆకట్టుకుంటున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ కారణంగానే ప్రభుత్వ కాలేజీలకన్నా, ప్రైవేటు కాలేజీ విద్యార్థులకు ఇంటర్మీడియట్‌లో ఎక్కువ మార్కులు వస్తున్నాయన్న విమర్శలు వస్తున్నాయి. ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఇంటర్‌ బోర్డ్‌ ప్రత్యేక చర్యలకు ఉపక్రమించింది.

కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2024-25 విద్యా సంవత్సరానికి 3,80,960 మంది విద్యార్థులు ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు రాయనున్నారు. ఇందులో 1,20,515 మంది ఎంపీసీ విద్యార్థులు, 75,040 మంది బైపీసీ విద్యార్థులకు ప్రాక్టికల్స్‌ పరీక్షలు ఫిబ్రవరి 3 నుంచి ప్రారంభంకానున్నాయి. ఎంపీసీ విద్యార్థులకు కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లో ప్రయోగ పరీక్షలు ఉండగా బైపీసీ విద్యార్థులకు ఈ రెండింటితోపాటు బోటనీ, జువాలజీ సబ్జెక్టుల్లో ప్రాక్టికల్స్‌ ఉంటాయి. రెండేళ్లుగా ప్రభుత్వ కాలేజీల విద్యార్థులకు ప్రయోగ పరీక్షల్లో 75 శాతం మార్కులు వస్తుండగా కార్పొరేట్‌ కాలేజీల్లో ఏకంగా 90 శాతంపైనే మార్కులు వస్తున్నాయి. ప్రభుత్వ కాలేజీల్లో చదివే విద్యార్ధులు ప్రాక్టికల్స్‌ చేస్తుంటే.. చాలా వరకు ప్రైవేటు కాలేజీల్లో కనీసం లేబొరేటరీలు కూడా లేవు. ఇలాంటి చోట్ల కూడా విద్యార్ధులకు ఫుల్‌ మార్కులు వేస్తున్నట్లు బోర్డు దృష్టికి వచ్చింది. ఇలాంటి అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు కాలేజీలపై నిఘా పెట్టాలని బోర్డు నిర్ణయించింది. ఈ ఆరోపణలున్న కాలేజీల సీసీ ఫుటేజ్‌లను ఇంటర్ బోర్డు తనిఖీ చేసే యోజనలో ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.