Delhi Assembly Poll 2025: నేడే ఢిల్లీ ఎన్నికల నగారా.. మధ్యాహ్నం 2 గంటలకు షెడ్యూల్ విడుదల! త్రిముఖ పోరులో గెలుపెవరిదో…
ఢిల్లీ పీఠాధిపత్యానికి ఎన్నికల నగారా మరి కొన్ని గంటల్లో మొగనుంది. ఈ రోజు మధ్యాహ్నం ఎన్నికల షెడ్యూల్ ను ఈసీ ప్రకటించనుంది. ఇప్పటికే మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకుగానూ త్రిముఖ పోరుకు రంగం సిద్ధమైంది. అధికార ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్ధులను సైతం ప్రకటించాయి. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ఈసీ మీడియా సమావేశం నిర్వహించి, పూర్తి షెడ్యూల్ ను విడుదల చేయనుంది..
న్యూఢిల్లీ, జనవరి 7: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం ఫిబ్రవరి 15తో ముగియనుంది. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు మరికొన్ని గంటల్లో ఎన్నికల నగారా మోగనుంది. త్రిముఖ పోరుతో ఉత్కంఠ రేపనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ఈ రోజు విడుదలవనుంది. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం (EC) మీడియా సమావేశంలో షెడ్యూల్‌ను విడుదల చేయనుంది.
ఇప్పటికే పలు నియోజకవర్గాలకు బీజేపీ, ఆప్, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి కూడా. ఢిల్లీ 7వ అసెంబ్లీ గడువు ఫిబ్రవరి 15తో ముగియనుండటంతో ఆలోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. దీంతో నెల రోజుల ముందుగానే ఎన్నికల ప్రక్రియ మొదలవనుంది. 2020లో జనవరి 6న ఢిల్లీ ఎన్నికల ప్రకటన వెలువడగా.. ఫిబ్రవరి 8న పోలింగ్ నిర్వహించి, ఫిబ్రవరి 11న ఓట్ల లెక్కింపు జరిగింది. ఐదేళ్ల తర్వాత మళ్లీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగారా మరికొన్ని గంటల్లో మోగనుంది.
అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 2015 నుంచి 2020 ఎన్నికల్లో వరుసగా విజయ ఢంకా మోగించింది. ఈ ఎన్నికలల్లో వరుసగా 67, 62 స్థానాలతో క్లీన్ స్వీప్ చేసింది. ప్రస్తుతం ఆమ్ ఆద్మీ పార్టీ హ్యాట్రిక్‌పై కన్నేసింది. గత రెండు అసెంబ్లీలలో సింగిల్ డిజిట్‌కే పరిమితమైన బీజేపీ.. ఈసారి ఎలాగైనా ఢిల్లీ గద్దెనెక్కాలని ఉవ్విళ్లూరు తుంది. మరోవైపు గత రెండు పర్యాయాలు ఢిల్లీని పాలించిన ఆమ్ ఆద్మీ పార్టీని తుడిచిపెట్టేందుకు కాంగ్రెస్ సైతం పావులు కదుపుతోంది. ఇక అధికార ఆప్ మాత్రం మరోసారి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అవే హామీల వర్షం కురిపిస్తుంది.
#DelhiElection2025 | Election Commission of India to announce the schedule for the General Election to the Delhi Legislative Assembly today at 2 pm. pic.twitter.com/PZ2fTBcMpt
— ANI (@ANI) January 7, 2025
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి, పశ్చిమ ఢిల్లీ మాజీ ఎంపీ పర్వేశ్ సాహిబ్ సింగ్, దివంగత ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడు, కాంగ్రెస్ మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్‌తో తలపడనున్నారు. కల్కాజీ స్థానంలో కాంగ్రెస్ నేత అల్కా లాంబా, దక్షిణ ఢిల్లీ బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బిధూరిపై ముఖ్యమంత్రి అతిషి పోటీ చేయనున్నారు. ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సోమవారం ప్రచురించిన ఓటర్ల జాబితా ప్రకారం.. ఢిల్లీలో 1.55 కోట్ల మంది ఓటర్లు ఓటు వేయడానికి నమోదు చేసుకున్నారు. వీరిలో 18-19 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన 2.08 లక్షల మంది మొదటి సారి తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.