TG Scholarship 2025: విద్యార్ధులకు అలర్ట్.. స్కాలర్‌షిప్ దరఖాస్తు గడువు పెంపు! ఎప్పటివరకంటే
తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్ధులకు ఎస్సీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి ఎన్ శ్రీధర్ కీలక ప్రకటన జారీ చేశారు. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి స్కాలర్ షిప్, బోధన రుసుములకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు గడువు ఇప్పటికే ముగియగా అతితక్కువ దరఖాస్తులు వచ్చినట్లు గుర్తించారు. దీంతో విద్యార్ధులకు ప్రయోజనం చేకూర్చేందుకు దరఖాస్తు గుడువును పెంపొందిస్తూ ప్రకటన జారీ చేశారు..
హైదరాబాద్, జనవరి 6: తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థుల ఉపకారవేతనాలు, బోధన రుసుములకు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తు గడువు పొడిగించినట్లు ఎస్సీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి ఎన్ శ్రీధర్ ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులు మార్చి 31 వరకు చేసుకోవచ్చని విద్యార్ధులకు సూచించారు. కాగా 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి సెప్టెంబరు 1 నుంచి డిసెంబరు 31 వరకు ఈ-పాస్ వెబ్‌సైట్లో దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ఈ సారి దరఖాస్తులు తక్కువగా వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుత విద్యాసంవత్సరానికి 7,44,060 మంది రెన్యువల్ విద్యార్థులు ఉంటే.. గడువు ముగింపు సమయం నాటికి కేవలం 4,08,171 మంది మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కొత్తగా కోర్సుల్లో చేరిన విద్యార్థుల సంఖ్య 4,83,254 మంది ఉండగా.. వారిలోనూ కేవలం 1,39,044 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ప్రభుత్వం దరఖాస్తు గడువును మార్చి 31 వరకు పొడిగిస్తూ.. మరో అవకాశం ఇచ్చింది.
టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు (టీసీసీ) హాల్‌టికెట్లు విడుదల
తెలంగాణ రాష్ట్రంలో జనవరి 11 నుంచి 17వ తేదీ వరకు టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు(టీసీసీ) పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్ష హాల్‌టికెట్లు జనవరి 5 నుంచి విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ ఎ కృష్ణారావు ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 16,757 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ పరీక్షలకుగానూ మొత్తం 93 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
సీఎం ఆమోదానికి ఉమ్మడి ప్రవేశ పరీక్షల 2025 షెడ్యూల్‌లు..
తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి వివిధ ఉన్నత విద్యాకోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించాల్సిన ఈఏపీసెట్, ఐసెట్, ఎడ్‌సెట్ తదితర 7 ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. వీటిని సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదానికి దస్త్రం పంపింది. విద్యాశాఖ ఆమోదం లభిస్తే.. షెడ్యూల్‌లను ఉన్నత విద్యాశాఖ ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఏప్రిల్ నెలాఖరు నుంచి ప్రవేశ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఏప్రిల్‌లో ఒకటి లేదా రెండు పరీక్షలు జరిగే అవకాశం ఉంది. ఈఏపీసెట్ మాత్రం మే మొదటివారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పటివరకు నీట్ నిర్వహణ తేదీని ఎన్‌టీఏ ప్రకటించలేదు. ఒకవేళ ఆ పరీక్ష నాడు ఏదైనా పరీక్ష ఉంటే తేదీ మారే అవకాశం ఉంది.