మరో దారుణం.. పాలిటెక్నిక్ కాలేజీ గర్ల్స్ వాష్‌రూంలో వీడియో రికార్డింగ్
విద్యా సంస్థల్లోనూ అమ్మాయిల భద్రత ప్రశ్నార్ధకంగా మారింది. ఇటీవల మేడ్చల్ సీCMR ఉమెన్స్ కాలేజీ హాస్టల్‌లోని బాత్‌రూంలో కెమెరాలు పెట్టిన ఘటన మరువక ముందే మహబూబ్ నగర్ లో మరో దారుణం చోటు చేసుకుంది. బ్యాక్ లాగ్ పరీక్ష రాసేందుకు వచ్చిన ఓ విద్యార్ధి అమ్మాయిల వాష్ రూంలో తన మొబైల్ ఫోన్ ను రికార్డింగ్ మోడ్ లో ఉంచాడు. గమనించిన విద్యార్ధినులు ఆగ్రహంతో కాలేజీ ఎదుట బైఠాయించి ఆందోళనకు దిగారు..
మహబూబ్‌నగర్, జనవరి 5: ఇటీవల హైదరాబాద్ శివారు మేడ్చల్ జిల్లాలోని కండ్లకోయ సీఎంఆర్ ఉమెన్స్ కాలేజీ హాస్టల్‌లోని బాత్‌రూంలో కెమెరాలు పెట్టిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. హాస్టల్‌లో పని చేసే వంట సిబ్బంది ఈ దారుణానికి పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఘటన మరువకముందే మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ గర్ల్స్ కాలేజీలో కెమెరా కలకలం సృష్టించింది. అమ్మాయిల టాయిలెట్స్‌లో శనివారం రికార్డింగ్ మోడ్‌లో ఉన్న మొబైల్ కనిపించడం కలకలం రేపింది. టాయిలెట్స్‌లో వీడియోలు రికార్డు చేస్తున్నట్లు గుర్తించిన విద్యార్థినులు కాలేజీ ఎదుట ఆందోళనకు దిగారు. పలు విద్యార్ధి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగడంతో శనివారం కాలేజీ వద్ద ఉద్రిక్తత నెలకొంది. మేడ్చల్‌లోని సీఎంఆర్‌లో విద్యార్థినుల హాస్టల్ ఘటన మరువక ముందే మహబూబ్‌నగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల గర్ల్స్ బాత్‌రూంలో సెల్ ఫోన్‌తో వీడియోలు చిత్రీకరిస్తున్న సంఘటన చోటు చేసుకోవడం విద్యార్ధునుల్లో భయాందోళనలు సృష్టిస్తున్నాయి. కాలేజీ ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, బాధ్యులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి.
కాలేజీ ఎదుట విద్యార్థినులు ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి వచ్చి దర్యాప్తు చేపట్టారు. అదే కాలేజీలోని థర్డ్ ఇయర్ స్టూడెంట్ సిద్ధార్థ్‌ను నిందితుడిగా గుర్తించారు. బ్యాక్‌లాగ్ పరీక్ష రాసేందుకు వచ్చి వాష్‌రూంలో మొబైల్ కెమెరా పెట్టినట్లుగా నిందితుడు అంగీకరించాడని డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. నిందితుడి మొబైల్ నుంచి వీడియో స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని చెప్పారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని డీఎస్పీ హామీ ఇవ్వడంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు.
పరీక్ష రాసేందుకు వచ్చా.. నా ఫోన్ పోయింది..
బ్యాక్‌లాగ్ పరీక్ష రాసేందుకు వచ్చిన థర్డ్ ఇయర్ విద్యార్థి సిద్ధార్ద్.. పరీక్ష ముగిసిన తర్వాత తన మొబైల్ మిస్ అయ్యిందని ఆ విద్యార్థి ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశాడు. ఇంతలో బాత్రూమ్‌లో అదే ఫోన్ ఉన్నట్లు విద్యార్ధినులు గుర్తించారు. ఆ మొబైల్‌లో ఉన్న ఏటీఎం ఆ విద్యార్థిదే కావడంతో షీటీం వాళ్లు ఆ విద్యార్థిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అయితే మొబైల్‌లో వీడియోలు ఉన్నాయా..? వాటిని డిలీట్ చేశారా..? అనే విషయాలను పోలీసులు వెల్లడించలేదు.