TSPSC Group 1 Age Relaxation: టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 1 పోస్టుల గరిష్ట వయోపరిమితిపై హైకోర్టు కీలక ఆదేశాలు.. 4 వారాలు గడువు
గ్రూప్ 1 పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం గరిష్ట వయోపరిమితిని 46 ఏళ్ల నుంచి 51 ఏళ్లకు పెంచాలని అభ్యర్ధులు విజ్ఞప్తులు చేస్తోన్న సంగతి తెలిసిందే. పోస్టుల నియామకాల్లో ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ)ని హైకోర్టు ఆదేశించింది. చాలా ఏళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 1 పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టిందని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం 46 ఏళ్లను అర్హతగా..
హైదరాబాద్, ఫిబ్రవరి 29: గ్రూప్ 1 పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం గరిష్ట వయోపరిమితిని 46 ఏళ్ల నుంచి 51 ఏళ్లకు పెంచాలని అభ్యర్ధులు విజ్ఞప్తులు చేస్తోన్న సంగతి తెలిసిందే. పోస్టుల నియామకాల్లో ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ)ని హైకోర్టు ఆదేశించింది. చాలా ఏళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 1 పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టిందని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం 46 ఏళ్లను అర్హతగా పేర్కొందని, దీనిని 51 ఏళ్ల వరకు పెంచేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాస్‌రెడ్డితో పాటు మరో ఇద్దరు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ అంశంపై పలుమార్లు అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా కమిషన్ స్పందించలేదని, అందువల్లనే న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలిపారు. కోర్టు ఈ విషయంలో స్పందించి గరిష్ట వయసు సడలింపు ఇస్తూ నోటిఫికేషన్‌లో మార్పు చేసేలా టీఎస్‌పీఎస్సీని ఆదేశించాలని వారు కోరారు.
ఈ పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్ పుల్ల కార్తీక్ తాజాగా విచారణ చేపట్టారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నోటిఫికేషన్ల జారీలో చాలా జాప్యం జరిగిందని పిటిషనర్ తరఫు న్యాయవాది ఫణిభూషణ్ వాదనలు వినిపించారు. దీంతో అనేక మంది గ్రూప్ 1 పరీక్షలకు అర్హత కోల్పోయినట్లు వివరించారు. వారందరికీ అవకాశం కల్పించేందుకు గరిష్ట వయోపరిమితిని పెంచాల్సిన ఆవశ్యకత ఉందని విజ్ఞప్తి చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఈ ఆంశంలో మెరిట్ జోలికి వెళ్లడంలేదని అన్నారు. ఫిబ్రవరి 2న పిటిషనర్లు ఇచ్చిన వినతిపత్రాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. 4 వారాల్లో దీనిపై తమ నిర్ణయాన్ని తెలియజేయాలని పేర్కొన్నారు.
కాగా పేపర్ లీకేజీల కారణంగా గత ప్రభుత్వం ఇచ్చిన గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు కావడంతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం 503 పోస్టులతో ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఫిబ్రవరి 23 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. అయితే నోటిఫికేషన్‌లో ఆయా పోస్టులకు గరిష్ఠ వయోపరిమితిని 46 యేళ్లకు పెంచుతున్నట్లు కమిషన్ పేర్కొంది. మరికొన్ని పోస్టులకు 35 యేళ్లకు మాత్రమే సడలింపు ఇచ్చింది. దీంతో ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలపై కొంత జాప్యం చోటుచేసుకోవడంతో వయసు పెరిగిన కొందరు అభ్యర్ధులు గ్రూప్ 1కు దూరం అవుతున్నారు. వయోపరిమితిని 51 యేళ్లకు పెంచాలని కోరుతూ పలువురు అభ్యర్ధులు కమిషన్‌కు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో వారు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు టీఎస్‌పీఎస్సీని ఆదేశించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.