Chicken Prices Today: కొండెక్కిన కోడి ధరలు.. కిలో చికెన్ ఎంతో తెలుసా? అదేబాటలో గుడ్లు కూడా..
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు కొండెక్కాయి. ముక్కలేనిదే మద్ద ముట్టని చికెన్ ప్రియులు ఇప్పుడు వెనకడుగు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కొన్నిచోట్ల కిలో చికెన్ ధర ఏకంగా రూ.300 పలుకుతోంది. పెరిగిన ఎండలతోపాటు కోళ్ల ఉత్పత్తి తగ్గడమే దీనికి ప్రధాన కారణమని వ్యాపారులు అంటున్నారు. మరో పక్క బర్డ్ ఫ్లూతో కోళ్లు చనిపోతున్నాయి. మార్చి వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు..
అమరావతి, ఫిబ్రవరి 28: తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు కొండెక్కాయి. ముక్కలేనిదే మద్ద ముట్టని చికెన్ ప్రియులు ఇప్పుడు వెనకడుగు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కొన్నిచోట్ల కిలో చికెన్ ధర ఏకంగా రూ.300 పలుకుతోంది. పెరిగిన ఎండలతోపాటు కోళ్ల ఉత్పత్తి తగ్గడమే దీనికి ప్రధాన కారణమని వ్యాపారులు అంటున్నారు. మరో పక్క బర్డ్ ఫ్లూతో కోళ్లు చనిపోతున్నాయి. మార్చి వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో గడచిన కొద్ది రోజులుగా చికెన్ ధరలు అమాంతం పెరిగిపోతుండటంతో సామాన్యులు కొనలేక బెంబేలెత్తిపోతున్నాడు. ఇక గుడ్డు ధర కూడా ఒక్కోటి రూ.5 పైనే పలుకుతోంది. పెరిగిన ధరల దృష్ట్యా కొందరు చిల్లర వ్యాపారులు ఇదే అదనుగా.. ఒక్కో గుడ్డు రూ.8 వరకు విక్రయిస్తున్నారు. కార్తీక మాసం సమయంలో కోడి మాంసం ధరలు భారీగా పడిపోవడంతో అప్పట్లో.. కిలో రూ.130 నుంచి రూ.140 చొప్పున అమ్మకాలు జరిగాయి. దీంతో అధికశాతం కోళ్ల ఫారాల యజమానులకు భారీగా నష్టాలు వచ్చాయి. ఈ భయంతో కోళ్ల పెంపకాన్ని చాలా వరకు తగ్గించారు. తల్లికోళ్లను కూడా గిట్టుబాటు కాక అమ్మేశారు. ఫలితంగా ఉత్పత్తి తగ్గి, కోళ్లకు కొరత ఏర్పడింది. దీంతో ధరలు అంతకంతకు పెరుగుతున్నాయి.
గత బుధ, గురు వారాల్లో కిలో లైవ్ కోడి రూ.150 నుంచి రూ.200 ఉండగా.. ఆది, సోమ వారాల్లో అమాంతం పెరిగి పోయింది. కోళ్ల ఉత్పత్తి తగ్గి, డిమాండ్ పెరగడంతో వ్యాపారులు ధరలు అమాంతం పెంచేశారు. ప్రస్తుతం కిలో స్కిన్‌లెస్ చికెన్ రూ.300, స్కిన్‌తో రూ.260 వరకు అమ్ముతున్నారు. ఇక బోన్ లెస్ చికెన్ రికార్డు స్థాయిలో కిలోకు రూ.500కు పైగా అమ్ముతున్నారు. కొన్ని చోట్ల వ్యాపారులు సిండికేట్ గా మారి ఇష్టారీతిన ధరలను నిర్ణయించేస్తున్నారు.
తెలంగాణలోనూ ఇదే పరిస్థితి
ఆదివారం వస్తే గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 12 లక్షల కిలోలు, మిగిలిన రోజుల్లో సుమారు 10వేల టన్నుల చికెన్ విక్రయాల జరుగుతుంటాయి. దసరా, దీపావళి, సంక్రాంతి, రంజాన్ పండుగల సమయంలో రోజుకు 15 వేల నుంచి 16 వేల టన్నులు అమ్ముతుంటారు. తాజాగా ధరల పెరుగుదలతో విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. చికెన్ ధరలు అధికంగా ఉండటంతో మాంసం ప్రియులు చేపల వైపు మొగ్గు చూపుతున్నారు. యేటా మహాశివరాత్రి పర్వదినం తర్వాత మొదలు కావాల్సిన ఎండలు, ఈసారి ఫిబ్రవరి రెండోవారం నుంచే ప్రారంభం అయ్యాయి. దీంతో వేడికి కోళ్లు చనిపోతున్నాయి. పెరిగిన ఎండలతోపాటు మేడారం మహాజాతర నేపథ్యంలో కోళ్ల దిగుమతిపై తీవ్ర ప్రబావం చూపింది. ఉత్పత్తి తగ్గిడం.. డిమాండ్ పెరగడంతో ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.