TG DSC 2024 Key: తప్పులతడకగా డీఎస్సీ తుది ఆన్సర్ ‘కీ’.. ఏకంగా 109 ప్రశ్నలకు జవాబులు మార్చిన విద్యాశాఖ
తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. 11,062 ఉపాధ్యాయ పోస్టుల కోసం రాష్ట్రంలో మొత్తం 2.45 లక్షల మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. ఈ నెల 6వ తేదీన తుది ‘కీ’ వెలువడగా.. దానిపై పలు జిల్లాల అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. వందల మంది అభ్యర్థులు పాఠ్యపుస్తకాలు, తెలుగు అకాడమీ పుస్తకాలను తీసుకుని..
హైదరాబాద్, సెప్టెంబర్ 11: తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. 11,062 ఉపాధ్యాయ పోస్టుల కోసం రాష్ట్రంలో మొత్తం 2.45 లక్షల మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. ఈ నెల 6వ తేదీన తుది ‘కీ’ వెలువడగా.. దానిపై పలు జిల్లాల అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. వందల మంది అభ్యర్థులు పాఠ్యపుస్తకాలు, తెలుగు అకాడమీ పుస్తకాలను తీసుకుని పాఠశాల విద్యాశాఖ, రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) కార్యాలయానికి సోమవారం తరలివచ్చారు. గతంలో వెలువరించిన ప్రాథమిక కీలోని సమాధానాలకు, తుది ‘కీ’లోని 109 ప్రశ్నల జవాబులను విద్యాశాఖ మార్చింది. మరో 59 ప్రశ్నలకు అర మార్కు చొప్పున కలిపింది.
తుది ‘కీ’ని వెల్లడించిన తర్వాత రెండు రోజులు సెలవులు వచ్చాయి. దీంతో సోమవారం సంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్ తదితర జిల్లాల నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయానికి పోటెత్తారు. ప్రాథమిక ‘కీ’లో సరిగ్గా ఉన్న సమాధానాలను తుది ‘కీ’లో మార్చారని, తప్పుగా ఇచ్చిన సమాధానాలను పట్టించుకోలేదని పలువురు అభ్యర్థులు ఫిర్యాదు చేస్తున్నారు. ప్రాథమిక కీపై తాము అభ్యంతరాలు గుర్తించి, తగిన ఆధారాలను చూపినా తుది ‘కీ’లో వాటిని తప్పుగా ఇచ్చినట్లు పాఠశాల విద్యాశాఖ అడిషన్ డైరెక్టర్ కె.లింగయ్య, ఎస్‌సీఈఆర్‌టీలో టెట్ ప్రత్యేకాధికారి రేవతీరెడ్డికి విన్నవించారు.
టెట్‌లో తెలుగు విభాగంలో ‘ఏకాదేశం అనగా’.. ఒక వర్ణం స్థానంలో మరో వర్ణం రావడం అనేది సరైన జవాబు. గత జూన్ 12న వెలువడిన ఫలితాల్లో దానికి మార్కు ఇచ్చారు. డీఎస్సీలో ‘ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరడాన్ని ఇలా అంటారు’ అని 4 ఐచ్ఛికాలు ఇచ్చారు. అందులో ‘ఆదేశం’ సరైన జవాబుగా విద్యాశాఖ చూపింది. తెలుగు అకాడమీ పుస్తకాల్లో ఉన్నట్లుగానే తాము ‘ఏకాదేశం’ అని గుర్తించామని, మార్కులు ఇవ్వాలని అభ్యర్ధులు డిమాండ్ చేస్తున్నారు. ఇదొక్కటేకాదు ఇలా పలు ప్రశ్నలకు అడ్డదిడ్డంగా సమాధానాలు ఇచ్చినట్లు తెలిపారు. వీటిపై నిపుణుల కమిటీ చర్చించి, నిర్ణయం తీసుకుంటుందని అధికారులు చెబుతున్నారు. డీఎస్సీ తుది ‘కీ’లో కూడా తప్పులు దొర్లడంతో డీఎస్సీ, టెట్ మార్కులను కలిపి ఇచ్చే జీఆర్‌ఎల్‌లో భారీగా మార్పులు వచ్చే అవకాశం ఉంది. తుది ‘కీ’లో తప్పుల వల్ల డీఎస్సీ ఫలితాలు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.