‘యాంటీ ర్యాగింగ్ డే.. అన్ని మెడికల్ కాలేజీల్లో జరపాల్సిందే’.. నేషనల్ మెడికల్ కమిషన్ హుకూం
ఆగస్టు 12వ తేదీని యాంటీ ర్యాగింగ్ డేగా అన్ని మెడికల్ కాలేజీల్లో సెలబ్రేట్ చేసుకోవాలని పేర్కొంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీలకు NMC ఈ ఆదేశాలు జారీ చేసింది. యూజీసీ నిర్దేశించిన యాంటీ-ర్యాగింగ్ ఫ్రేమ్‌వర్క్ అమలులో భాగంగా దీనిని పాటించాలని NMC తన నోటీసులో పేర్కొంది..

న్యూఢిల్లీ, ఆగస్టు 9: దేశ వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో ఆగస్టు 12 నుంచి ఆగస్టు 18 వరకు యాంటీ ర్యాగింగ్ వీక్‌ను పాటించాలని నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) తన పరిధిలోని అన్ని మెడికల్ కాలేజీలను కోరుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ఆగస్టు 12వ తేదీని యాంటీ ర్యాగింగ్ డేగా అన్ని మెడికల్ కాలేజీల్లో సెలబ్రేట్ చేసుకోవాలని పేర్కొంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఆదేశాల మేరకు మెడికల్ కాలేజీలకు NMC ఈ ఆదేశాలు జారీ చేసింది. యూజీసీ నిర్దేశించిన యాంటీ-ర్యాగింగ్ ఫ్రేమ్‌వర్క్ అమలులో భాగంగా దీనిని పాటించాలని NMC తన నోటీసులో పేర్కొంది. ఈ నిబంధనలు తప్పనిసరని స్పష్టం చేసింది. అన్ని ఉన్నత విద్యా సంస్థలు ఈ నిబంధనలలో పేర్కొన్న పర్యవేక్షణ విధానాలుతో సహా మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటించాలని కూడా పేర్కొంది.
యాంటీ-ర్యాగింగ్ వీక్ సందర్భంగా మెడికల్ కాలేజీల్లో పలు కార్యకలాపాలను నిర్వహించాలని యూజీసీ వివరించింది. ఈ సందర్భంగా యాంటీ-ర్యాగింగ్ వీక్ ప్రారంభోత్సవ కార్యక్రమాలు, నినాదాలు రాయడం, వ్యాస రచన, పోస్టర్ తయారీ, ఫోటోగ్రఫీ పోటీలు, వీధి నాటకాలు, యాంటీ-ర్యాగింగ్ ఇతివృత్తాలపై డిబేట్స్ వంటి కార్యకలాపాలతో విద్యార్థులకు పోటీలు నిర్వహించాలని సూచించింది. ఇందులో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు, బహుమతులు ప్రదానం చేసి, వారిని భాగస్వాములను చేయాలని తెలిపింది.
డిజిటల్ పోస్టర్లు, షార్ట్ వీడియోలు, యాంటీ-ర్యాగింగ్ సందేశాలను హైలైట్ చేసే రీల్స్‌పై దృష్టి సారించేలా నేషనల్ కాంటెస్ట్ 2025 ఏర్పాటు చేస్తున్నట్లు, ఇందులో విద్యార్థుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి కాలేజీలు, యూనివర్సిటీలు కృషి చేయాలని యూజీసీ ఆదేశించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు UGC యాంటీ-ర్యాగింగ్ పోర్టల్ antiragging.inలో అందుబాటులో ఉన్నాయి. విద్యా సంస్థలు డిజిటల్ ప్రచారం కూడా చేయవచ్చు. ర్యాగింగ్ వ్యతిరేక సందేశాలను ప్రోత్సహించే సంస్థల నుంచి వీడియో సందేశాలను వినియోగించవచ్చని వివరించింది. వర్క్‌షాప్‌లు, సెమినార్లు, ఇంటరాక్టివ్ సెషన్‌లు, సెల్ఫీ కార్నర్‌ల వంటి సృజనాత్మక మార్గాలు వంటి అవగాహన కార్యకలాపాలను క్యాంపస్‌లో ఏర్పాటు చేయాలని UGC సూచించింది. ఆఫ్‌లైన్ కార్యకలాపాలతో పాటు విద్యార్థులు, అధ్యాపకుల కోసం విద్యా సంస్థలు UGC యాంటీ-ర్యాగింగ్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న షార్ట్ మువీలు, అవగాహన వీడియోలను ప్రదర్శించాలని సంస్థలకు సూచించింది.
యూనివర్సిటీలు, ఇతర పాలక సంస్థలు ఈ మార్గదర్శకాలను అన్ని అనుబంధ కాలేజీలకు పంపాలని, యాంటీ ర్యాగింగ్ డే, వీక్ ఆచారంలో పాల్గొనేలా చూడాలని UGC ఆదేశించింది. దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో ర్యాంగింగ్ నివరణకు, విద్యను బలోపేతం చేయడానికి, సురక్షితమైన క్యాంపస్ వాతావరణం నిర్మించడం లక్ష్యంగా యూజీసీ ఈ కార్యక్రమాన్ని తీసుకువచ్చింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.




