CA 2024 Topper Success Story: సీఏ ప్రిపరేషన్‌కి ప్లానింగే పిల్లర్.. సీఏ సెకండ్ ర్యాంకర్ ప్రిపరేషన్ టిప్స్ ఇవిగో
చార్టర్ అకౌంటెంట్ (CA) పరీక్షలు ఎంత కఠినంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యేటా లక్షలాది మంది ఈ పరీక్షలు రాస్తే కేవలం పదుల సంఖ్యలో మాత్రమే ఉత్తీర్ణత నమోదవుతుంది. అలాంటి పరీక్షను సులువుగా క్రాక్ చేయాలంటే ఏలా చదవాలో 2024 నవంబర్ సీఏ ఫైనల్ ఫలితాల్లో సెకండ్ ర్యాంకు సాధించిన రియా కుంజన్‌కుమార్ షా మాటల్లో మీ కోసం..

సీఏ ఫైనల్ నవంబర్ 2024 పరీక్ష ఫలితాలను డిసెంబర్ 26న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్‌కి చెందిన రియా కుంజన్‌కుమార్ షా సీఏ పరీక్షల్లో ఆలిండియా సెకండ్ ర్యాంకు సాధించింది. ఈ పరీక్షలు నవంబర్ 3 నుంచి నవంబర్ 13 వరకు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా నిర్వహించింది. ఈ క్రమంలో ఎంతో కఠినమైన సీఏ ఫలితాల్లో రియా కుంజన్‌కుమార్ షా ఎలా ప్రిపరేషన్ సాగించిందో.. సీఏకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఆమె ఎలాంటి సూచనలు చేస్తుందో ఇక్కడ తెలుసుకుందాం..
సీఏ ఫైనల్ పరీక్షల్లో రియాకు 501 (83.50%) మార్కులు వచ్చాయి. CA ఇంటర్మీడియట్ పరీక్షలోనూ 46వ ఆల్ ఇండియా ర్యాంక్ సాధించింది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో తన జర్నీ గురించి మాట్లాడుతూ.. CA పరీక్షకు ఎలా ప్రిపేర్ సాగించిందో వివరించింది. CA ఫైనల్ పరీక్షలకు సరిగ్గా రెండు రోజుల ముందు రియాకు తీవ్ర జ్వరం వచ్చింది. దీంతో రియా తీవ్ర ఒత్తిడికి గురైనట్లు తెలిపింది. అయితే ఆ సమయంలో తన కుటుంబం ఎంతో సహకరించిందని ఆనందం వ్యక్తం చేసింది. తన కుటుంబం సపోర్ట్ లేకుంటే తాను సీఏ ఫైనల్ పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉండేది కాదని చెప్పింది. అలాగే రోజూ 10 నుంచి 12 గంటల పాటు చదువుకు కేటాయించినట్లు రియా చెప్పింది. రోజూ ఉదయాన్నే 4 గంటలకు నిద్ర లేచి రాత్రి 8 గంటలకు నిద్రపోయేది. ఇంత కష్టపడి చదివిన రియా.. తన క్రెడిట్ మొత్తం తన తల్లిదండ్రులకు, అన్నయ్య చలువేనని చెప్పుకొచ్చింది.
తాను 12వ తరగతిలో కామర్స్ చదివానని, ఇంటర్మీడియట్ తర్వాత సీఏకు ప్రిపేర్ కావడం ప్రారంభించానని రియా తెలిపింది. అలాగే బీకాం హానర్స్‌లో అడ్మిషన్ తీసుకుని.. సీఏ ప్రిపరేషన్ కొనసాగించినట్లు తెల్పింది. ఆన్‌లైన్‌లో కోచింగ్ కూడా తీసుకున్నట్లు తెలిపింది. కన్సల్టింగ్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ రంగంలో కెరీర్‌ను ప్రారంభించాలనుకుంటున్నట్లు రియా తన ఫ్యూచర్ ప్లాన్ చెప్పింది. సీఏ ప్రారంభ వేతనమే ఏడాదికి రూ.15 నుంచి 20 లక్షల వరకు ఉంటుందని రియా తెల్పింది.
ప్రణాళిక చాలా అవసరం..
సీఏ ప్రిపరేషన్‌లో.. ప్లానింగ్ చాలా ముఖ్యమని రియా చెబుతుంది. ప్రణాళిక లేకుండా ప్రిపేరయితే విజయం దక్కదు. ప్రతి అధ్యాయానికి సంబంధించి రోజు వారీగా ప్రణాళికలు రూపొందించుకుని అందుకు అనుగుణంగా ప్రిపరేషన్ సాగించాలి. ప్రిపరేషన్‌తో రివిజన్ చేయడం చాలా ముఖ్యం. కోచింగ్ లేకుండానే ప్రిపేర్ అవ్వవచ్చని, అయితే కోచింగ్‌లో చేరడం వల్ల రొటీన్ ఏర్పడుతుందని, తద్వారా ప్రిపరేషన్ బాగుంటుందని.. విద్యార్ధులకు రియా సూచిస్తుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.








