AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI : 2016 నాటి పాత బాకీ తీర్చుకునే టైం వచ్చింది..కానీ ఆ రోజు వర్షం పడితే భారత్ అవుట్

IND vs WI : టీ20 వరల్డ్ కప్ 2026లో అసలు సిసలు సమరం మొదలైంది. జింబాబ్వేపై ఘనవిజయం సాధించి జోరు మీదున్న టీమిండియా, ఇప్పుడు సెమీఫైనల్ బెర్త్ కోసం ఆఖరి పోరాటానికి సిద్ధమైంది. మార్చి 1వ తేదీన కోల్‌కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌తో భారత్ తలపడనుంది.

IND vs WI : 2016 నాటి పాత బాకీ తీర్చుకునే టైం వచ్చింది..కానీ ఆ రోజు వర్షం పడితే భారత్ అవుట్
Ind Vs Wi
Rakesh
|

Updated on: Feb 27, 2026 | 8:03 AM

Share

IND vs WI : టీ20 వరల్డ్ కప్ 2026లో అసలు సిసలు సమరం మొదలైంది. జింబాబ్వేపై ఘనవిజయం సాధించి జోరు మీదున్న టీమిండియా, ఇప్పుడు సెమీఫైనల్ బెర్త్ కోసం ఆఖరి పోరాటానికి సిద్ధమైంది. మార్చి 1వ తేదీన కోల్‌కతాలోని చారిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్‌లో వెస్టిండీస్‌తో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ గెలిస్తేనే సూర్యకుమార్ సేన సెమీస్‌కు చేరుకుంటుంది. ఓడితే మాత్రం టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది. అంటే, ఇది భారత్‌కు అక్షరాలా క్వార్టర్ ఫైనల్ లాంటిదన్నమాట.

జింబాబ్వేతో జరిగిన గత మ్యాచ్‌లో భారత బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 256 పరుగుల భారీ స్కోరు సాధించి, ఈ టోర్నీలోనే అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా నిలిచారు. ఓపెనర్ అభిషేక్ శర్మ 55 పరుగులతో మెరుపు ఆరంభాన్ని ఇవ్వగా, ఆఖర్లో హార్దిక్ పాండ్యా (50 నాటౌట్), తిలక్ వర్మ (44 నాటౌట్) విధ్వంసం సృష్టించారు. బౌలింగ్‌లోనూ అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లతో రాణించడంతో భారత్ 72 పరుగుల తేడాతో గెలిచి సెమీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంది.

సెమీఫైనల్ ఈక్వేషన్స్ చూస్తే భారత్‌కు గెలుపు తప్ప మరో మార్గం లేదు. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయి రెండు జట్లకు ఒక్కో పాయింట్ కేటాయిస్తే మాత్రం భారత్‌కు ఇబ్బందులు తప్పవు. నెట్ రన్ రేట్ పరంగా వెస్టిండీస్ మెరుగైన స్థితిలో ఉండటంతో, మ్యాచ్ రద్దయితే విండీస్ సెమీస్ చేరుతుంది. అందుకే వరుణుడి కరుణతో పాటు విండీస్‌పై స్పష్టమైన విజయం సాధించడంపైనే భారత్ ఆశలు పెట్టుకుంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమిష్టిగా రాణిస్తే ఈడెన్ గార్డెన్స్‌లో భారత్ జెండా ఎగరడం ఖాయం.

ఈ మ్యాచ్ 2016 టీ20 వరల్డ్ కప్ చేదు జ్ఞాపకాలను గుర్తు చేస్తోంది. ఆ నాడు ముంబై వేదికగా జరిగిన సెమీఫైనల్‌లో వెస్టిండీస్ జట్టు భారత్‌ను ఓడించి టోర్నీ నుంచి బయటకు పంపింది. నాడు విరాట్ కోహ్లీ అద్భుతంగా ఆడినా జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. ఇప్పుడు మళ్ళీ అదే వెస్టిండీస్‌ను ఓడించి, పాత బాకీ తీర్చుకోవడంతో పాటు సెమీఫైనల్ టికెట్ కన్ఫర్మ్ చేసుకోవాలని భారత్ పట్టుదలగా ఉంది. ఇది కేవలం ఒక మ్యాచ్ మాత్రమే కాదు, టీమిండియాకు ప్రతీకారం తీర్చుకునే గొప్ప అవకాశం కూడా.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us