JNVS Exam Date 2025: రేపే నవోదయ ఆరో తరగతి ప్రవేశ పరీక్ష.. చివరి నిమిషంలో ఈ తప్పులు చేయొద్దు
జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరో తరగతిలో ప్రవేశాలకు శనివారం (జనవరి 18) దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఇప్పటికే హాల్ టికెట్లు విడుదల చేయగా.. పరీక్ష నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు ఉదయం 11 గంటలలోపు విద్యార్ధులు ఆయా పరీక్ష కేంద్రాలకు చేరుకోవల్సి ఉంటుంది..

అమరావతి, జనవరి 17: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేద, మధ్య తరగతి విద్యార్థులకు కార్పొరేట్ చదువు అందించేందుకు జవహర్ నవోదయ విద్యాలయాల్లో యేటా ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. యేటా ఆరో తరగతిలో ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్షను ఈ ఏడాది రెండు విడతల్లో నిర్వహించనున్నారు. తొలి విడత జనవరి 6వ తేదీన, రెండో విడత ఏప్రిల్ 6వ తేదీన నిర్వహించనున్నారు. అయితే ఈ ఏడాది జనవరి 18వ తేదీన నిర్వహిస్తున్న పరీక్షకు ఇప్పటికే హాల్ టికెట్లు కూడా విడుదలవగా.. శనివారం దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నవోదయ ప్రవేశ పరీక్ష జరగనుంది. జనవరి 18వ తేదీ ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు దేశ వ్యాప్తంగా ఈ పరీక్ష జరగనుంది. ఇప్పటికే పరీక్ష నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందులో వచ్చిన ర్యాంకు ఆధారంగా దేశ వ్యాప్తంగా 27 రాష్ట్రాలతోపాటు 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 653 జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశాలు కల్పిస్తారు. పరీక్ష రెండు విడతలుగా నిర్వహించినప్పటికీ వీటన్నింటిలో ఆరో తరగతి ప్రవేశాలు మాత్రం ఒకేసారి జరుగుతాయి.
పరీక్ష రాసే విద్యార్థులకు ముఖ్య సూచనలు..
- పరీక్ష రాసే విద్యార్థులు తప్పనిసరిగా రెండు హాల్ టికెట్లు డౌన్‌లోన్ చేసుకోవాలి. 2 హాల్ టికెట్లపై సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుడి సంతకం ఉండాలి. ప్రధానోపాధ్యాయుడు సంతకం చేసిన ఒక హాల్ టికెట్ ఇన్విజిలేటర్‌కు అందించాలి.
- ఇది ఆఫ్‌లైన్ పరీక్ష కాబట్టి బ్లాక్ లేదా బ్లూ కలర్ పెన్నుతోనే పరీక్ష రాయాలి.
- విద్యార్థులు తమ వెంట ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్ష కేంద్రంలోకి తీసుకురాకూడదు.
- గంట ముందుగా విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్‌కి చేరుకోవాలి. విద్యార్థులందరూ ఉదయం 10.45 గంటలలోపే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. 11 గంటల తర్వాత గేట్లు మూసివేస్తారు. ఒక్క నిమిషం
- అలస్యమైనా పరీక్ష కేంద్రంలోపలికి అనుమతించరు.
- పరీక్ష రేసే సమయంలో ప్రతి ప్రశ్నను రెండుసార్లు చదివి, అర్థం చేసుకుని ఆ తర్వాత సమాధానం గుర్తించాలి.
- ఒక ప్రశ్నపై ఎక్కువ సమయం వృథా చేయకూడదు. ప్రశ్న కఠినంగా అనిపిస్తే తర్వాత ప్రశ్నకు వెళ్లాలి.
- ముందు తెలిసిన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించి, ఆ తర్వాత తెలియని ప్రశ్నలను గుర్తించాలి.
పరీక్ష విధానం ఇలా..
నవోదయ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ప్రశ్నపత్రంలో మొత్తం 80 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయిస్తారు. ప్రతీ ప్రశ్నకు 1.25 మార్కులు ఉంటాయి. మెంటల్ ఎబిలిటీ విభాగంలో 40 ప్రశ్నలకు 50 మార్కులకు, అర్థమెటిక్ విభాగం నుంచి 20 ప్రశ్నలకు 25 మార్కులకు, ల్యాంగ్వేజ్ టెస్ట్ విభాగం నుంచి 20 ప్రశ్నలకు 25 మార్కులు చొప్పున కేటాయిస్తారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




