AP Mega DSC 2025 Exam: డీఎస్సీ అభ్యర్ధులకు బిగ్ షాక్.. పరీక్షల తేదీల్లో కీలక మార్పులు! కొత్త షెడ్యూల్ ఇదే..
రాష్ట్ర వ్యాప్తంగా మెగా డీఎస్సీ ఆన్‌లైన్ రాత పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలు జూన్ 6వ తేదీ నుంచి ప్రారంభమవగా.. జూన్ 30వ తేదీతో ముగియనున్నాయి. అయితే ఏపీ ప్రభుత్వం తాజాగా ఈ పరీక్ష తేదీల్లో మార్పు చేస్తూ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కూటమి సర్కార్ ప్రకటన జారీ చేసింది..

అమరావతి, జూన్ 15: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మెగా డీఎస్సీ ఆన్‌లైన్ రాత పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలు జూన్ 6వ తేదీ నుంచి ప్రారంభమవగా.. జూన్ 30వ తేదీతో ముగియనున్నాయి. అయితే ఏపీ ప్రభుత్వం తాజాగా ఈ పరీక్ష తేదీల్లో మార్పు చేస్తూ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. యేటా జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని దేశ వ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా రాష్ట్రంలో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలిన కూటమి సర్కార్ భావించింది. ఈ నేపథ్యంలో డీఎస్సీ పరీక్ష తేదీల్లో మార్పులు జరిగాయి.
తాజా ప్రకటన మేరకు జూన్ 20, 21 తేదీల్లో జరగాల్సిన ఆన్‌లైన్ రాత పరీక్షలను జులై 1, 2 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు పరీక్ష తేదీలను రీషెడ్యూల్ చేశారు. మెగా డీఎస్సీ పరీక్షల్లో చోటు చేసుకున్న మార్పులను కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి శనివారం (జూన్ 14) మీడియాకు తెలిపారు. ఇందుకు సంబంధించిన కొత్త పరీక్షా కేంద్రాలు, పరీక్ష తేదీలు మార్చిన హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్ లో జూన్ 25 నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. మిగతా పరీక్షలన్నీ యథాతథంగా జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు.
కాగా మెగా డీఎస్సీ పరీక్షలు మొత్తం 154 కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. రోజుకు రెండు షిఫ్టుల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ పరీక్షలు జరుగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మెగా డీఎస్సీకి 3,35,401 మంది 5,77,417 దరఖాస్తులు సమర్పించారు. మొత్తం పరీక్షలు పూర్తయిన తర్వాత మరుసటి రోజున ప్రాథమిక ‘కీ’ విడుదల చేయనున్నారు. అభ్యంతరాల స్వీకరణకు వారం గడువు ఇచ్చి.. అనంతరం తుది ఆన్సర్ కీ విడుదల చేస్తారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.




