AP Mega DSC 2025 Last Date: మెగా డీఎస్సీ 2025కి అప్లై చేశారా? మరో రెండు రోజులే గడువు..
రాష్ట్రవ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నడుస్తుంది. వీటిలో జిల్లా స్థాయిలో 14,088, రాష్ట్ర, జోనల్ స్థాయిలో 2,259 పోస్టులున్నాయి. అయితే దరఖాస్తు గడువు సమీపిస్తున్నందు వల్ల అభ్యర్ధులు తుది గడువులోపు దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ..

అమరావతి, మే 13: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నడుస్తుంది. వీటిలో జిల్లా స్థాయిలో 14,088, రాష్ట్ర, జోనల్ స్థాయిలో 2,259 పోస్టులున్నాయి. అయితే దరఖాస్తు గడువు సమీపిస్తున్నందు వల్ల అభ్యర్ధులు తుది గడువులోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మరో రెండు రోజుల్లోనే అంటే మే 15వ తేదీతో దరఖాస్తు గడువు ముగియనుంది. మరోవైపు జూన్ 6 నుంచి ఆన్‌లైన్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వెలువడిన అతి పెద్ద డీఎస్సీ ఉద్యోగ నోటిఫికేషన్ ఇదే కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది నిరుద్యోగులు పోస్టులకు పోటీపడనున్నారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోనివారు చివరి నిమిషం వరకు వేచిచూడకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు.
ఈ నోటిఫికేషన్ కింద ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్తులు, పురపాలక, గిరిజన ఆశ్రమ పాఠశాలలు, జువెనైల్ సంక్షేమ పాఠశాలల్లోని ఖాళీలకు జిల్లా స్థాయిలో.. బధిర, అంధుల పాఠశాలలు, ఏపీ రెసిడెన్షియల్, ఏపీ ఆదర్శ పాఠశాలలు, సాంఘిక, బీసీ, గిరిజన సంక్షేమ పాఠశాలల్లోని పోస్టులను రాష్ట్ర, జోనల్ స్థాయిల్లో భర్తీ చేయనున్నారు. వీటిల్లో ఎస్జీటీ పోస్టులు 6,599, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 7,487 ఉన్నాయి. రాష్ట్ర స్థాయి పోస్టులు 259 ఉన్నాయి. ఇర జోన్ వారీగా చూస్తే జోన్-1లో 400, జోన్-2లో 348, జోన్-3లో 570, జోన్-4లో 682 పోస్టులు కలిపి మొత్తం 2,228 ఉన్నాయి. ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్తు, పురపాలక పాఠశాలల్లో కలిపి మొత్తం 13,192 ఖాళీలు ఉన్నాయి. ఇక గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో 881, జువెనైల్ పాఠశాలల్లో 15, రాష్ట్ర స్థాయిలో భర్తీ చేసే బధిరులు, అంధుల పాఠశాలల్లో 31 పోస్టులు ఉన్నాయి.
ఆన్‌లైన్ రాత పరీక్షలు జూన్ 6 నుంచి జులై 6 వరకు మొత్తం నెల రోజులపాటు జరగనున్నాయి. హాల్ టికెట్లను మే 30 నుంచి అందుబాటులోకి తీసుకువస్తారు. ప్రాథమిక కీ చివరి పరీక్ష తర్వాత 2వ రోజు విడుదల చేస్తారు. కీపై అభ్యంతరాలు ప్రారంభ కీ నుండి 7 రోజులలోపు తెల్పవల్సి ఉంటుంది. అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన ఏడు రోజుల తర్వాత తుది కీ విడుదల చేస్తారు. ఫైనల్ కీ తర్వాత ఏడు రోజులకు మెరిట్ జాబితా విడుదల చేయనున్నారు. ప్రిన్సిపల్, పీజీటీలకు 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ప్రిన్సిపల్, పీజీటీ, టీజీటీ పోస్టులకు పేపర్1లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వారికి 60 మార్కులు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50 మార్కులు వస్తేనే పేపర్ 2 మార్కులు లెక్కిస్తారు. టీజీటీ, స్కూల్ అసిస్టెంట్, ఎస్జీటీ పోస్టులకు టెట్ వెయిటేజీ 20 శాతం ఉంటుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.