Russia Ukraine Conflicts: హమ్మయ్య.. ఎట్టకేలకు రష్యాతో ఉక్రెయిన్ చర్చలు..! పుతిన్ ప్రతిపాదనకు జెలెన్‌స్కీ ఓకే..
నేరుగా చర్చిద్దామని ఆదివారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రతిపాదన పంపిన సంగతి తెలిసిందే. మే15 (గురువారం)న ఇస్తాంబుల్‌లో చర్చలకు రావాలని పుతిన్ ఆహ్వానించారు. పుతిన్ ప్రతిపాదనకు అంగీకారం తెలుపుతూ జెలెన్స్కీ తాజాగా ట్వీట్ చేశారు. దీంతో టర్కీ వేదికగా తొలిసారి ఇరువురు గురువారం (మే 15) సమావేశం కానున్నారు..

మాస్కో, మే 12: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలవడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ట్వీట్ చేశారు. ఉక్రెయిన్ శనివారం ప్రతిపాదించిన షరతులు లేని 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించాలని, లేదంటే మాస్కోపై ఒత్తిడి పెంచుతామని నాలుగు ప్రధాన యూరోపియన్ దేశాలు రష్యాపై ఒత్తిడి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంగా నేరుగా చర్చిద్దామని ఆదివారం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రతిపాదన పంపారు. పుతిన్ ప్రతిపాదనను శాంతియుతమైన పరిష్కారం కోసం నిబద్ధతతో చేస్తున్న ప్రయత్నంగా రష్యా ప్రభుత్వ అధికార ప్రతినిధి పెస్కోవ్ అభివర్ణించారు. మే15 (గురువారం)న ఇస్తాంబుల్‌లో చర్చలకు రావాలని పుతిన్ ఆహ్వానించారు. 2022లో మాస్కోలో దాడి ప్రారంభమైన నాటి నుంచి రష్యా నుంచి ఇలాంటి ప్రతిపాదనలు రావడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం.
పుతిన్ షరతులు లేని కాల్పుల విరమణకు అంగీకరించే వరకు ఇక చర్చలు సాధ్యం కాదని ఉక్రెయిన్ మిత్రదేశాలు ఆదివారం స్పష్టం చేశాయి. కానీ ట్రంప్ పుతిన్‌పై ఒత్తిడి తీసుకురావడంతో కథ మలుపు తిరిగింది. ఉక్రెయిన్, రష్యా అధికారులతో సమావేశానికి వెంటనే అంగీకరించాలని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో అన్నారు. ట్రంప్ పోస్టు పెట్టిన గంటలోపే ఈ వారం పుతిన్‌తో సమావేశానికి తాను సిద్ధంగా ఉన్నానని జెలెన్స్కీ సోషల్ మీడియా వేదికగా సమ్మతి తెలిపారు. దీంతో ఇరు దేశాలు చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు తేలిపోయింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత జరుగుతున్న మొదటి సమావేశం కూడా ఇదే.
‘గురువారం టర్కియేలో పుతిన్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. ఈసారి రష్యన్లు సాకులు వెతకరని నేను ఆశిస్తున్నా..’ అని జెలెన్స్కీ ఆదివారం తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. సోమవారం నుంచి శాశ్వత కాల్పుల విరమణ దౌత్యానికి అవసరమైన ఆధారాన్ని అందిస్తుందని జెలెన్స్కీ చెప్పినప్పటికీ.. చర్చలకు హాజరు కావడానికి ఇది ముందస్తు షరతు అని ఆయన ఎక్కడా పేర్కొనలేదు. సోమవారం నాటికి కాల్పుల విరమణ అమలులోకిరాకపోతే రష్యాపై బెదిరించిన అదనపు ఆంక్షలతో ముందుకు సాగుతారా లేదా అని యూరోపియన్ నాయకులు ఇంకా తేల్చలేదు.
We await a full and lasting ceasefire, starting from tomorrow, to provide the necessary basis for diplomacy. There is no point in prolonging the killings. And I will be waiting for Putin in Türkiye on Thursday. Personally. I hope that this time the Russians will not look for…
— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) May 11, 2025
చర్చలకు ఇప్పటికే వేదిక సిద్ధం చేస్తున్న పుతిన్.. ఆదివారం టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్‌తో మాట్లాడారు. శాంతి చర్చల కోసం పుతిన్ చేసిన ప్రతిపాదనకు ఎర్డోగన్ పూర్తిగా మద్దతు ఇచ్చారని ఇస్తాంబుల్‌ను వేదికగా ఇచ్చారని క్రెమ్లిన్ తెలిపింది. చర్చలకు ఆతిథ్యం ఇవ్వడానికి టర్కీ సిద్ధంగా ఉందని అంకారా ధృవీకరించినప్పటికీ, చర్చలకు ముందు కాల్పుల విరమణ తప్పనిసరిగా ఉండాలన్న ప్రతిపాదనకు ఉక్రెయిన్ అంగీకరించిందని టర్కీ అధ్యక్ష కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. మరోవైపు రష్యా కాల్పుల విరమణ ప్రతిపాదనను నిరాకరిస్తే టర్కీ చర్చలకు ఆతిథ్యం ఇవ్వడానికి నిరాకరిస్తుందో లేదో మాత్రం అందులో చెప్పలేదు. గురువారం జరగనున్న చర్చల సమయంలో సంఘర్షణకు గల మూల కారణాలను తొలగించడమే లక్ష్యంగా ఉంటాయని నొక్కి చెప్పారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.