Health insurance: ఆరోగ్య బీమాతో ఆర్థిక ధీమా.. వయస్సు వారీగా ఎలా ఎంపిక చేసుకోవాలంటే..?
ఆధునిక కాలంలో ఆరోగ్య బీమా పాలసీల అవసరం బాాగా పెరిగింది. ప్రతి ఒక్కరూ వీటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం అనేక రోగాలు మానవులపై దాడి చేస్తున్నాయి. సుమారు 25 ఏళ్ల నుంచే వాటి బారిన పడుతున్నారు. చిన్న వయసులోనే సుగర్, బీపీ, గుండెపోటుతో బాధపడుతున్నారు. మారుతున్న జీవన విధానం, ఆహారం, రాత్రి పూట పని చేయడం, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం తదితర అనేక అంశాలు దీనికి కారణం. ఇలాంటి సమయంలో ఆరోగ్య బీమా రక్షణ కల్పిస్తుంది. ఆస్పత్రిలో చికిత్స పొందే సమయంలో ఆర్థిక భరోసా అందిస్తుంది. ఈ నేపథ్యంలో ఆరోగ్య పాలసీలను దశల వారీగా ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం.

Health Insurance
సాధారణంగా 20 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వయసులో ఆరోగ్య బీమాను తీసుకోవడం ప్రారంభించాలి. చిన్న వయస్సులో ఎక్కువ కవరేజ్ ఎంచుకోవడం వల్ల ఎక్కువ వయస్సులో పెద్ద బీమా మొత్తం లభిస్తుంది. రెగ్యులర్ చెకప్ లు, టీకాలు, వెల్నెస్ బెనిఫిట్లను అందించే ప్లాన్లను తీసుకోవాలి. చాలా సంస్థలు ఎన్సీబీని అందిస్తాయి. అంటే ప్రతి క్లెయిమ్ రహిత సంవత్సరానికి మీ బీమా మొత్తం పెరుగుతూ ఉంటుంది. కాలక్రమీణా ఎక్కువ ప్రయోజనాలను పొందటానికి ఇది మంచి మార్గం.
30 నుంచి 40 ఏళ్లకు..
- 30 ఏళ్ల నుంచి 40 ఏళ్లలోకి అడుగుపెట్టేసరికీ బాధ్యతలు పెరుగుతాయి. వివాహం, పిల్లలు కారణంగా ఖర్చులు ఎక్కువవుతాయి. ఈ సమయంలో ఆరోగ్య బీమా పాలసీ తీసుకునేటప్పుడు కొన్ని విషయాలను పరిశీలించాలి. వ్యక్తిగత పాలసీలకు బదులుగా భార్య, పిల్లలకు కలిపి ఒకే బీమాను అందించే ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ ఎంచుకోవాలి. ఈ పాలసీలు ఇంకా నిర్దారణ కాని వ్యాధులకు కూడా కవరేజీ అందిస్తాయి.
- ప్రినేటల్, ప్రసవానంతర ఖర్చులు, డెలివరీ ఖర్చులు, నవజాత శిశువులకు టీకాలు వేసి పాలసీలను తీసుకోవాలి.
- క్యాన్సర్, గుండె జబ్బులు, మూత్రపిండాల వైఫల్యం తదితర వాటికి ఒకేసారి చెల్లింపులను అందించే యాడ్ – ఆన్ లను పరిగణించాలి.
- కీమోథెరపీ, డయాలసిస్ వంటి డేకేర్ చికిత్సలు, ఔట్ పేషెంట్ విభాగం (ఓపీడీ) ఖర్చులను కవర్ చేసే పాలసీని తీసుకోవాలి.
- కొన్ని పాలసీలు మధ్యంతర కాలంలో, పునరుద్దరణ సమయంలో కొత్త సభ్యులను చేర్చుకునే అవకాశం కల్పిస్తాయి.
40 నుంచి 50 ఏళ్ల వయసులో..
- సాధారణంగా 40 నుంచి 50 ఏళ్లకు మధ్య వయస్సుగా పరిగణిస్తారు. ఈ సమయంలో హైపర్ టెన్సన్, డయాబెటీస్, గుండె వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది. వీటి కవరేజీ పాలసీలను తీసుకోవాలి.
- దీర్ఘకాలిక వ్యాధులకు వైద్య చికిత్సలు ఖరీదుగా ఉంటాయి. కాబట్టి అధిక మొత్తం బీమా మొత్తం కలిగిన పాలసీని ఎంపిక చేసుకోవాలి.
- చాలా బీమా సంస్థలు వార్షిక ఆరోగ్య పరీక్షలు, వెల్నెస్ ప్రోత్సాహకాలను అందిస్తాయి.
ఉద్యోగ విరమణ తర్వాత..
- బీమా సంస్థలు 60 ఏళ్లు పైబడిన వ్యక్తుల కోసం ప్రత్యేక పాలసీలను అందిస్తాయి. వయస్సు సంబంధిత వ్యాధులను కవర్ చేస్తాయి.
- కవరేజీలో ఇంటెన్సివ్ కేర్, అవయవ మార్పిడి ఉండేలా చూసుకోవాలి.
- పాలసీదారులు ఎటువంటి సహ చెల్లింపులు, గది అద్దె పరిమితులు లేని పాలసీల కోసం వెతకాలి.
- వైద్య సంరక్షణ అందుబాటులో ఉండేలా చూసుకోవడానికి తక్కువ వెయిటింగ్ పిరియడ్ ఉన్న పాలసీలకు ప్రాధాన్యం ఇవ్వాలి.








