Indian Railway: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ట్రైన్ టికెట్లపై అందరికీ 3 శాతం రాయితీ.. ఎలా పొందాలంటే..?
సంక్రాంతికి ఇంటికెళ్లే ప్రయాణికులకు రైల్వేశాఖ తీపికబురు అందించింది. ట్రైన్ టికెట్ల బుకింగ్‌పై డిస్కౌంట్ ప్రకటించింది. జనవరి 14వ తేదీ నుంచి ఈ ఆఫర్ అమల్లోకి రానుంది. కేవలం ఆ యాప్‌లో ట్రైన్ టికెట్లు బుక్ చేసుకునేవారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది.

న్యూ ఇయర్, సంక్రాంతి లాంటి వరుస పండగలు వస్తున్న క్రమంలో వివిధ ఆన్‌లైన్ ఫ్లాట్‌ఫామ్‌లు బస్సులు, రైల్వే టికెట్లపై ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటిస్తున్నాయి. ప్రజలను ఆకట్టుకుని తమ బిజినెస్‌ను పెంచుకునేందుకు టికెట్ల ఛార్జీలపై భారీగా రాయితీలు ప్రకటిస్తున్నాయి. ప్రైవేట్ ఆపరేటర్లకు పోటీగా ప్రభుత్వాలు కూడా ఆర్టీసీ, రైల్వే టికెట్లపై పండుగ ఆఫర్లు ఇస్తున్నాయి. ఈ క్రమంలో భారతీయ రైల్వే ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త అందించింది. టికెట్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఆన్‌లైన్‌లో టికెట్ల బుకింగ్‌పై భారీ ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆఫర్ వివరాలు ఇప్పుడు చూద్దాం.
3 శాతం డిస్కౌంట్
రైల్ వన్ యాప్ ద్వారా బుకింగ్ చేసే టికెట్లపై 3 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు రైల్వేశాఖ వెల్లడించింది. అన్ రిజర్వుడ్ టికెట్ల బుకింగ్‌కు ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. వచ్చే ఏడాది జనవరి 14 నుంచి జులై 14 వరకు ఇది అమల్లో ఉంటుందంటూ చెప్పుకొచ్చింది. అంటే సంక్రాంతి నుంచి ఆఫర్‌ను ప్రారంభించనుంది. సంక్రాంతి ఇంటికెళ్లేందుకు రైల్వే టికెట్లు బుక్ చేసుకునేవారికి ఇది శుభవార్తగా తెలిపింది. రైల్ వన్ యాప్‌లో ఏ డిజిటల్ పేమెంట్ మోడ్‌తో టికెట్లు బుక్ చేసుకున్నా ఈ డిస్కౌంట్ లభిస్తుంది. ఇప్పటికే ఈ యాప్‌లో ఆర్-వ్యాలెట్ ద్వారా చెల్లింపులు చేసినవారికి క్యాష్ బ్యాక్ అందిస్తుంది. ఆ క్యాష్ బ్యాక్ ఎప్పటిలాగే అందిస్తామని, దానితో పాటు కొత్తగా ఈ ఆఫర్ తెచ్చినట్లు పేర్కొంది.
రైల్ వన్ యాప్ అంటే..?
ప్రయాణికులకే అన్నీ సేవలు ఒకేచోట అందించాలనే లక్ష్యంతో రైల్వే శాఖ కొత్తగా ఈ యాప్ ప్రవేశపెట్టింది. ఇందులో ట్రైన్ టికెట్ల బుకింగ్‌తో పాటు ఫ్లాట్‌ఫామ్ టికెట్ కూడా తీసుకోవచ్చు. అలాగే ట్రైన్ల షెడ్యూల్, లైవ్ ట్రాకింగ్, ఫుడ్ బుకింగ్ వంటి సేవలు ఒకేచోట పొందవచ్చు. అన్నీ ఒకేచోట అందించాలనే ఉద్దేశంతో ఈ యాప్ అందుబాటులోకి తె్చింది. ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్, ఐఓఎస్ వెర్షన్లలో ఉంది. రిజర్వుడ్‌తో పాటు అన్ రిజర్వుడ్ టికెట్లను కూడా ఈ యాప్‌లో బుక్ చేసుకోవచ్చు.
